అయ్యా సర్పంచునయ్యా.. దానం చెయ‍్యండి

10 May, 2022 11:23 IST|Sakshi
దుకాణాల వద్ద భిక్షాటన చేస్తున్న సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, కార్మికులు  

మునుగోడు సర్పంచ్, పాలకవర్గం, కార్మికుల భిక్షాటన

మునుగోడు: ‘అయ్యా మేము గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులం, పంచాయతీ కార్మికులం.. మేము చేసిన అభివృద్ధి పనులకు ఐదు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదు.. ప్రతి నెలా కార్మికులకు అందించాల్సిన వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో కుటుంబాలు గడవక నానా ఇబ్బందులు పడుతున్నాం. మీరంతా మాకు దానం చేసి ఆదుకోవాలి’ అని కోరుతూ మునుగోడు సర్పంచ్‌ మిర్యాల వెంకన్నతో పాటు, పలువురు పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్మికులు సోమవారం మండల కేంద్రంలో భిక్షాటన చేశారు. సర్పంచ్‌ వెంకన్న నిక్కరు వేసుకుని అర్ధనగ్న ప్రదర్శనగా డప్పు చప్పుళ్లతో వార్డు సభ్యులు, కార్మికులతో కలసి దుకాణాలు, ఇంటి యజమానుల వద్దకు వెళ్లి నగదు ఇచ్చి ఆదుకోవాలని అభ్యర్థించారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ వెంకన్న మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఖాతాల్లో నగదు ఉన్నప్పటికీ తాము చేసిన పనుల చెక్కులు ఎస్‌టీఓలో వేస్తే చెల్లడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దాదాపు రూ.35 లక్షలకు పైగా అభివృద్ధి పనుల కోసం అప్పు చేసి తీసుకొచ్చామని వీటికి నెలకు రూ.70 వేల చొప్పున వడ్డీలు కడుతున్నామన్నారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు సరిగా అందక ఆ కుటుంబాలు పస్తులుండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

చదవండి: (Hyderabad: వెస్ట్‌ బెంగాల్‌ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం)

ఇప్పటికైనా ప్రభుత్వం సర్పంచ్‌ల, కార్మికుల సమస్యలు దృష్టిలో పెట్టుకొని వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉప్ప సర్పంచ్‌ పందుల పవిత్రశ్రీను, వార్డు సభ్యులు ఎర్రబెల్లి శంకర్‌రెడ్డి, మిర్యాల మధుకర్, యాట రామస్వామి, పందుల నర్సింహ, యడవల్లి సురేష్, పంచాయతీ కార్మికులు సుధాకర్, పెంటయ్య, అచ్చమ్మ, పావని,  కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు సాగర్ల లింగస్వామి, ఎండీ అన్వర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు