ముప్పిరెడ్డిపల్లి ఉపసర్పంచ్‌పై వేటు

16 Mar, 2021 08:37 IST|Sakshi

 జిల్లాలోనే మొదటి అవిశ్వాసం  

సాక్షి, మనోహరాబాద్‌(తూప్రాన్‌): కొత్త చట్టం ప్రకారం మండలంలోని ముప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్‌పై పెట్టిన అవిశ్వాసం సోమవారం నెగ్గింది. గత నెల 18న ఉప సర్పంచ్‌ రొడ్డ భిక్షపతి పనితీరు బాగాలేదని తూప్రాన్‌ ఆర్డీఓ కార్యాలయంలో ఆరుగురు వార్డు సభ్యులు ఆయనపై అవిశ్వాస ఫిర్యాదు చేశారు. దీంతో గత పదిరోజుల క్రితం పాలకవర్గానికి అవిశ్వాస నోటీసులను అందజేశారు. దీంతో సోమవారం ముప్పిరెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయం వద్ద ఆర్డీఓ శ్యాంప్రకాష్‌ ఆధ్వర్యంలో డీఎల్‌పీఓ వరలక్ష్మీ, ఎంపీడీఓ జైపాల్‌రెడ్డిలు అవిశ్వాస పరీక్షను నిర్వహించారు.

8మంది వార్డు సభ్యులుండగా ఐదుగురు సభ్యులు చేతులు లేపడంతో భిక్షపతిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గినట్లు ఆర్డీఓ తెలిపారు. ఇట్టి విషయాన్ని కలెక్టర్‌కు పంపనున్నట్లు తెలిపారు. అనంతరం నూతన ఉప సర్పంచ్‌ ఎన్నికకై త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఇట్టి విషయం బయటకు తెలియడంతో గ్రామ పంచాయతీ వద్ద కొంత మంది దూషణలకు దిగడంతో ఎస్‌ఐ రాజుగౌడ్‌ తన సిబ్బందితో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నరాల ప్రభావతి, కార్యదర్శి స్వామిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  సభ్యులు  

మరిన్ని వార్తలు