‘కేటీఆర్‌ వర్గానికే పదవులు.. హరీశ్‌ వర్గాన్ని అణగదొక్కుతున్నారు’: మురళీ యాదవ్‌

8 Aug, 2022 01:26 IST|Sakshi

మెదక్‌ మున్సిపాలిటీ: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రాజకీయ పదవులతోపాటు నామినేట్‌ పదవులు కూడా అగ్రవర్ణాలకే ఇస్తున్నారని, టీఆర్‌ఎస్‌ పార్టీలో బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని నర్సా పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ మురళీయాదవ్‌ అన్నారు. 

ఆదివారం మెదక్‌ జిల్లా కేంద్రంలోని ఐబీ గెస్ట్‌ హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌లో బీసీలకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. కాగా, పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆయనను టీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మురళీయాదవ్‌ టీఆర్‌ఎస్‌ నాయకత్వం తీరుపై ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, హరీశ్‌ వెంటే ఉండి, రాష్ట్ర సాధనకు పోరాడామన్నారు. అంతర్గతంగా పార్టీ గురించి చర్చించాలంటే అధిష్టానాన్ని కలిసే అవకాశం రావాలన్నారు. 

కానీ, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకే ప్రగతిభవన్‌లోకి ఎంట్రీ లేకపోతే తనలాంటి వారు పార్టీలో జరుగుతున్న విషయాలు చెప్పే అవకాశం ఎక్కడ దొరుకుతుందన్నారు. పార్టీలో కేటీఆర్‌ వర్గానికి పదవులు ఇస్తూ, హరీశ్‌రావు వర్గాన్ని అణగదొక్కరని ఆరోపించారు. తన రాజకీయ భవిష్యత్‌ను నర్సాపూర్‌ ప్రజలే నిర్ణయిస్తారని, వారి అభిప్రాయాల మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు.  

ఇది కూడా చదవండి: మున్సిపల్‌ చైర్మన్‌ను సస్పెండ్ చేసిన టీఆర్ఎస్‌

>
మరిన్ని వార్తలు