సిటీలో మటన్‌ ముక్కకు ఏదీ లెక్క?

22 Jan, 2021 12:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ముక్క లేనిదే ముద్ద దిగని మాంసం ప్రియుల సంఖ్య భారీగానే ఉంటుంది. ఇక ఆదివారం వస్తే దీని వినియోగం గణనీయంగానే పెరుగుతుంది. ప్రత్యేకించి మేక, గొర్రె మాంసం ఖరీదైనా ఎంతో కొంత కొనుగోలు చేయకుండా ఉండలేని వారెందరో. అయితే.. తాము కొనుగోలు చేస్తున్న మాంసం నాణ్యమైనదేనా? నిబంధనల ప్రకారమే వ్యాపారులు మాంసాన్ని అమ్ముతున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు లేకుండా పోయాయి. ఆయా సందేహాలపై ‘మెహర్‌’ సర్వే నిర్వహించిందని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి ఆఫ్పాన్‌ ఖాద్రీ తెలిపారు. కొన్ని రోజులుగా చికెన్‌ విక్రయాలు తగ్గి మటన్‌ విక్రయాలు పెరిగాయి. దీంతో మటన్‌ విక్రేతలు నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రోగాల బారినపడిన జీవాల మాంసాన్ని అమ్ముతున్నట్లు సర్వేలో వెల్లడైనట్లు ఆయన పేర్కొన్నారు.  

వెయ్యి మంది అభిప్రాయాల సేకరణ..  
జంట నగరాల్లోని షాపుల్లో, రోడ్ల పక్కన విక్రయిస్తున్న మాంసంపై ముద్రలు ఉండట్లేదు. నిబంధనలకు అనుగుణంగానే మేకలు, గొర్రెలను కోస్తున్నారా? నాణ్యమైన మాంసాన్నే అమ్ముతున్నారా? ఇలాంటి నిబంధనలు నగర వాసులకు తెలుసా? షాపుల వారు ఇస్తున్న రసీదులను పరిశీలిస్తున్నారా? షాపుల్లో అమ్మే మాంసంపై నాణ్యత ముద్ర ఉండాలన్న విషయం కొనుగోలుదారులకు తెలుసా? అనే అంశాలపై వెయ్యి మంది అభిప్రాయాలను ‘మెహర్‌’ సంస్థ  సేకరించింది.  

అవగాహన లేదు.. 
మటన్‌ నాణ్యతపై పెద్దగా అవగాహన లేదని అత్యధిక మంది స్పష్టం చేశారు. షాపుల్లో, రోడ్లపై ఎక్కడ కొన్నా నాణ్యత ఉందని భావిస్తున్నామని వెల్లడించారు. నిజానికి నగరంలోని కబేళాల్లో రోజూ వేల సంఖ్యలో మేకలు, గొర్రెలను కోసి మాంసాన్ని నగరంలోని షాపులకు, ఇతర హోటళ్లకు, విందులకు సరఫరా చేస్తున్నారు. కబేళాలో మేక, గొర్రెలను వెటర్నరీ డాక్డర్ల పర్యవేక్షణలోనే కోయాలన్న నిబంధనలను పెద్దగా పాటించడం లేదు. తెల్లవారుజామునే కబేళాల్లో మేక, గొర్రెలు ఆరోగ్యంగా ఉంటేనే వాటిని కోసేందుకు డాక్టర్లు అనుమతి ఇవ్వాలి. మాంసంపై నాణ్యత ముద్ర వేయాలి. ఇవేవీ పాటించడం లేదని స్పష్టమైంది.   

ప్రాంతాలను బట్టి.. 
జంట నగరాల్లోని ఆయా ప్రాంతాలను బట్టి కూడా మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. నగరం నడి»ొడ్డున మాంసం దుకాణాలు ఎక్కువగా ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో దుకాణాల కంటే కూడా రోడ్లకు ఇరువెపుల మేకలు, గొర్రెలను కోసి అమ్ముతున్నారు. నగరంలోనూ కొన్నిషాపుల వారు సొంతంగా మేకలు, గొర్రెలను కొనుగోలు చేసి ఇంటి వద్దనే వాటిని కోసి మాంసాన్ని షాపుల్లో అమ్ముతున్నారు. ఇలాంటి వాటికి అధికారుల పర్యవేక్షణ ఉండడం లేదని చాలా మంది వెల్లడించారు.     

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు