Anil Geela: టీచర్‌ నుంచి యాక్టర్‌.. ట్రెండ్‌ సెట్‌చేస్తున్న యూట్యూబర్‌ అనిల్‌

21 Aug, 2022 11:21 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌(మల్యాల): అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే విజయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదంటున్నాడు.. యూట్యూబ్‌ స్టార్‌ అనిల్‌ జీల. టీచర్‌ కావాల్సిన వ్యక్తి యాక్టర్‌గా సక్సెస్‌ అయ్యాడు. మారుమూల పల్లెనుంచి వచ్చిన వ్యక్తి తనప్రతిభతో దేశంలోనే నంబర్‌వన్‌ వెబ్‌సిరీస్‌ తీస్తున్నాడు. అంకితభావం, పట్టుదల, స్వయంకృషి, నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చంటూ యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. జన్మనిచ్చింది దర్గాపల్లి అయితే యూట్యూబ్‌ వైపు అడుగులు నేర్పింది మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం. నటుడు, ఎడిటర్, సినీ ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తున్న ట్రెండ్‌ సెట్టర్‌ అనిల్‌పై సండే స్పెషల్‌..

వ్యవసాయ కుటుంబం
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గాపల్లి గ్రామానికి చెందిన జీల మల్లేశం–నిర్మల పెద్ద కుమారుడు అనిల్‌. వీరిది వ్యవసాయాధారిత కుటుంబం. ఆది నుంచి అన్నింటిలో ముందుండాలనే సంకల్పం, క్రమశిక్షణతో అందరి మన్ననలు పొందాడు అనిల్‌. స్వయం కృషితో తనదైన లోకాన్ని సృష్టించుకున్నాడు. సెల్‌ఫోన్‌ వాడటం తెలిసిన యువతకు అనిల్‌ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.

ప్రతీ చోట తనదైన ముద్ర
అనిల్‌ జీల జీవితంలో ప్రతి చోట తనదైన ముద్ర వేసుకున్నాడు. ఐదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు హోటల్‌లో పనిచేస్తూ చదువు కొనసాగించాడు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు టీ అమ్మేవాడు. సాయంత్రం వచ్చిన తర్వాత రాత్రి 8గంటల వరకు హోటల్‌లో పనిచేస్తూ చదువుకుని పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు. ఇంటర్‌లో సైతం టాపర్‌గా నిలిచి సత్తా చాటాడు. అనంతరం బుక్‌స్టాల్‌లో సేల్స్‌ బాయ్‌గా పనిచేసి తన ఆలోచనలకు పదును పెడుతూ సామాన్యులకు పుస్తకాలను చేరువ చేశాడు.
చదవండి: నో కాంట్రవర్సీ కామెంట్స్‌.. ఆద్యంతం నవ్వులు పండించిన మునావర్‌

ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభం
అనిల్‌ జీల కరీంనగర్‌లోని ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో టీటీసీ పూర్తిచేశాడు. అనంతరం జమ్మికుంటలోని ఆవాసంలో రెండేళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే తనలోని నటనా ఆసక్తి, ఆలోచలనకు రూపం ఇస్తూ, షార్ట్‌ఫిల్మ్స్‌ చిత్రీకరణ ప్రారంభించాడు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదగాలనే తనలోని ఆలోచనలకు అనుగుణంగా ఆచరిస్తూ విద్యార్థులకు బోధించాడు. అనంతరం లంబాడిపల్లికి వచ్చి షార్ట్‌ఫిల్మ్‌లో నటించడం ప్రారంభించి తనలోని నటనతో ప్రపంచాన్ని మెప్పించాడు.

వ్లాగ్‌ నుంచి సినిమాల వైపు..
అనిల్‌ సహజసిద్ధ నటన పల్లెటూరి సామాన్యుల నుంచి సినీ ఇండస్ట్రీని సైతం ఆకర్షించింది. హాస్యం, జానపద పాటలు, డాక్యుమెంటరీ ఇలా అన్నిరకాల కేటగిరీల్లో ప్రతిభ కనబర్చాడు. దీంతో యువకులకు క్రేజీ హీరోగా మారాడు. అనిల్‌ ఏది చేసినా ట్రెండింగ్‌గా మారడంతో ట్రెండింగ్‌ స్టార్‌గా ముద్రపడింది. గతంలో హీరో విజయ్‌ దేవరకొండ వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమాలో నటించాడు. ఎస్‌ఆర్‌ కల్యాణ మండపంలో ప్రధానపాత్రలో, డిగ్రీ కాలేజ్, ఫ్రెషర్‌ కుక్కర్, అర్ధ శతాబ్దం వంటి సినిమాల్లో సైతం నటించాడు.

పెళ్లిలో సైతం ప్రత్యేకతే..
అనిల్‌ పెళ్లి సైతం ప్రత్యేకత సంతరించుకుంది. తెలంగాణ యాసలో రాసిన పత్రిక వైరల్‌గా మారింది. ‘శుభలేకలో శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు స్థానంలో శానిటైజర్‌ ఫస్టు.. మాస్కు మస్టు.. సోషల్‌ డిస్టాన్స్‌ బెస్ట్‌ అంటూ కరోనా కాలంలో పాటించాల్సిన నియమాలు రాశారు. తల్వాలు పడ్డంక ఎవరింట్ల ఆళ్లే బువ్వ తినుండ్రి. బరాత్‌ ఉంది కాని ఎవరింట్ల వాళ్లే పాటలు పెట్టుకుని ఎగురుండ్రి. కట్నాలు మాత్రం గూగుల్‌ పే, ఫోన్‌ పే చేయుండ్రి’ అంటూ తనదైన ప్రత్యేకత చాటుకున్నాడు. కట్నాల రూపంలో వచ్చిన సుమారు రూ.80వేలకు మరో రూ.20వేలు కలిసి కరోనా కాలంలో బాధపడుతున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు ఇంటింటికీ తిరిగి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నాడు అనిల్‌ జీల.

ఇండియాలో నంబర్‌ 1
అనిల్‌ అడుగడుగునా అంకితభావం, పట్టుదల, సాధించాలనే తపనతో ముందుకుసాగుతున్నాడు. నిహారిక కొణిదెల నిర్మాతగా హలో వరల్డ్‌ వెబ్‌ సిరీస్‌ ఇండియా మొత్తంలో జీ5 నిర్మించిన అన్ని వెబ్‌సిరీస్‌లలో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోకెల్లా అనిల్‌ నటించిన హలో వరల్డ్‌ వెబ్‌సిరీస్‌ నంబర్‌ 1గా నిలిచింది. ఇప్పటికే మై విలేజ్‌ షోలో సుమారు 100 షార్ట్‌ ఫిల్మ్‌ల్లో నటించాడు. హుషారు పిట్టలు వెబ్‌ సిరీస్‌లో సైతం నటించి మెప్పించాడు. 

ఒకరిని మించి ఒకరు
అనిల్‌ జీల వ్లాగ్‌కు లక్షల్లో సబ్‌స్క్రైబర్లు, వీక్షకులుండగా సెలబ్రిటీలకు ఇచ్చే గ్రీన్‌సైన్‌ లభించింది. అలాగే అతడి జీవిత భాగస్వామి ఆమని చేసే రీల్స్, ప్రమోషన్‌ పాటలకు సైతం వీక్షకులు లక్షల్లో ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రాంకు 1.17 లక్షల మంది ఫాలోవర్సు ఉన్నారు. వీరి అనురాగానికి ప్రతీకైన ఆరునెలల మేధాన్‌‡్ష ఇన్‌స్టాగ్రాంకు సైతం 3,000 మంది ఫాలోవర్సు ఉండడం విశేషం. 

అనిల్‌ వ్లాగ్‌కు సబ్‌స్క్రైబర్లు: 7.70 లక్షల మంది
నటించిన షార్ట్‌ ఫిల్మ్స్‌ : 100 
ఇన్‌స్టాగ్రాంకు ఫాలోవర్లు: 3.80 లక్షల మంది
వీక్షకులు: 25 లక్షల మంది

మరిన్ని వార్తలు