వాల్వ్‌ల్లేని ‘ఎన్‌–95’లే బెస్ట్‌

14 Aug, 2020 03:56 IST|Sakshi

కరోనా తుంపర్లను అడ్డుకోవడంలో ఆ మాస్కులే అత్యుత్తమమైనవి

రెండో స్థానంలో నిలిచిన త్రీ లేయర్‌ మాస్క్‌లు

వివిధ మాస్క్‌ల సామర్థ్యంపై డ్యూక్‌ వర్సిటీ పరిశోధనలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రజల రోజువారీ అలవాట్లను, జీవనశైలిని ఒక్కసారిగా మార్చేసింది. మాస్క్‌ ధరించడం అందరి జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. దేశంలో కరోనా వ్యాప్తి మొదలై తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాంతకంగా మారుతుందని తెలిశాక మాస్క్‌లకు విపరీతమైన ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ఈ వైరస్‌ వ్యాప్తి నిరోధానికి ఎలాంటి మాస్క్‌లు ధరించాలన్న అంశంపై మాత్రం ఆరు నెలలు గడిచినా ఇంకా నిర్దిష్టమైన పరిష్కారమేదీ లభించలేదు. దీంతో ప్రజలు తమకు తోచినట్లుగా వివిధ రకాల మాస్క్‌లను ధరిస్తున్నారు. వైద్యులు మొదలుకొని నర్సింగ్, పారామెడికల్‌ సిబ్బంది ‘సర్జికల్‌ మాస్క్‌’లు ఉపయోగిస్తుండగా ఇప్పుడు రకరకాల మాస్క్‌లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇవి ఏ మేరకు ఒకరి నుంచి మరొకరికి తుంపర్లు వ్యాప్తి చెందకుండా అడ్డుకుంటాయి? ఏ మాస్క్‌లు ఉపయోగిస్తే మంచిది? దీనికి తాజాగా సమాధానం లభించింది. 

శాస్త్రవేత్తల పరిశోధన... 
ఈ అంశంపై పరిశోధన చేసిన అమెరికా డ్యూక్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కరోనా వ్యాప్తికారక తుంపర్లను నిరోధించడం లేదా తగ్గించడంలో వాల్వ్‌లు లేని ఎన్‌–95 మాస్క్‌లు అత్యుత్తమమైనవని తేల్చారు. దీని తర్వాతి స్థానంలో ‘త్రీ లేయర్‌ మాస్క్‌లు’(మూడు పొరలవి) నిలిచాయి. కాటన్‌–పాలిప్రోలిన్‌–కాటన్‌ మాస్క్‌ మూడోస్థానంలో నిలవగా టూ లేయర్‌ పాలిప్రోపిలిన్‌ ఏప్రాన్‌ మాస్క్‌ నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు వదులుగా బట్టతో చేసిన మాస్క్‌లు, ఫేస్‌ కవరింగ్స్‌ వంటివి పెట్టుకున్నప్పటికీ అవి మాస్క్‌లు ధరించకుండా ఉన్న దానితో సమానమని వెల్లడైంది. వాల్వ్‌లున్న ఎన్‌–95 మాస్క్‌లు కూడా సమర్థంగా తుంపర్ల వ్యాప్తిని అడ్డుకోలేకపోతున్నాయని ఈ అధ్యయనంలో తెలిసింది. ఈ మాస్క్‌లు ఏడో ర్యాంక్‌లో నిలిచాయి. 

ప్రయోగం సాగిందిలా... 
డ్యూక్‌ వర్సిటీ పరిశోధకులు తక్కువ ఖర్చుతో రూపొందించిన ‘లేజర్‌ సెన్సర్‌ డివైజ్‌’తో 14 రకాల మాస్క్‌లు, ఫేస్‌ కవరింగ్స్‌ను పోల్చి చూశారు. ఈ మాస్క్‌లు ధరించిన వారు మాట్లాడినప్పుడు వారి నుంచి తుంపర్లు ఏ దిశలో ప్రయాణించాయి? వాటిని అడ్డుకోవడంలో మాస్క్‌లు ఏ మేరకు సమర్థంగా పనిచేశాయన్న దానిని లేజర్‌ బీమ్, లెన్స్, మొబైల్‌ ఫోన్‌ కెమెరాతో పరిశీలించారు. మాట్లాడేటప్పుడు, గాలిని బయటకు వదిలినప్పుడు ఎన్‌–95 మాస్క్‌కున్న వాల్వ్‌లు తెరుచుకోవడం వల్ల పరిసరాల్లోని వ్యక్తులకు తుంపర్ల నుంచి రక్షణ తగ్గుతోందని ఈ పరిశీలనలో వెల్లడైంది. అయితే ఈ పరిశోధనకున్న పరిమితులతోపాటు ఇతర రూపాల్లోని మాస్క్‌లు, వెర్షన్లను పరిశీలించకపోవడం వంటి అంశాల ప్రాతిపదికన దీనిపై మరింతగా పరిశోధించాల్సిన అవసరముందని డ్యూక్‌ వర్సిటీ పరిశోధకుడు ఎమ్మా ఫిషర్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు