ప్రయత్నిస్తే ప్రమాణాల పెరుగుదల 

30 Oct, 2021 01:51 IST|Sakshi

రాష్ట్రంలో ఉన్నత విద్య స్థితిగతులపై న్యాక్‌ 

తక్షణం ప్రమాణాల కోసం కమిటీ వేయాలి 

ఉన్నత విద్యా మండలి కీలక పాత్ర పోషించాలి 

వర్సిటీ స్థాయి కమిటీలను బలోపేతం చేయాలి 

నిధుల కేటాయింపు పెరగాలని సూచన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని నేషనల్‌ అనాలసిస్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) సూచించింది. ఈ దిశగా ఉన్నత విద్యా మండలి ఓ కమిటీ వేయాలని పేర్కొంది. నాణ్యత ప్రమాణాల కోసం విశ్వవిద్యాలయాల స్థాయిలో పనిచేస్తున్న కమిటీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. విద్యా శాఖ నిధుల కేటాయింపు పెరగాలని పేర్కొంది.

విద్యా రంగానికి రాష్ట్ర జీడీపీలో 30 శాతం రాష్ట్రం, 10 శాతం కేంద్రం ఖర్చు చేయాలని 1960లో కొఠారీ కమిటీ చేసిన సిఫార్సును న్యాక్‌ ప్రస్తావించింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2018–19లో 9.8 శాతం, 2019–20లో 7.5, 2020–21లో 7.4 శాతం నిధులే ఇవ్వడాన్ని ఉదహరించింది. రాష్ట్రంలో 85 శాతం కాలేజీలు యూజీ, పీజీ కోర్సులు కలిగి ఉంటే, అందులో 15 శాతం సంస్థలకే న్యాక్‌ గుర్తింపు ఉందని తెలిపింది. క్యుమ్యులేటివ్‌ గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (సీజీపీఏ)లో 80 శాతం గుర్తింపు గల కాలేజీలకు తక్కువ గ్రేడ్‌ వచ్చిందని, దీన్ని పెంచితేనే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని సూచించింది. 

న్యాక్‌ చేసిన పలు సూచనలు.. 
విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ పాత పద్ధతులనే అనుసరిస్తున్నాయి. వీటిని పూర్తిగా మార్చాలి. నైపుణ్యం ఉండే కోర్సులను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాలి. ఈ క్రమంలో పారిశ్రామికవేత్తలు, నిపుణులతో సమన్వయం అవసరం. అకడమిక్‌ ఆడిట్‌లో యూనివర్సిటీలు వెనుకబడ్డాయి. ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా ముందుకెళ్లే చర్యలు ఉండాలి. 

టీచింగ్‌ విధానంలో గణనీయ మార్పులు అవసరం. విద్యార్థి కేంద్రంగా బోధన జరగాలి. ప్రాజెక్టు వర్క్‌ ఎక్కువగా ఉండేలా చూడాలి. పరిశోధన దిశగా విద్యార్థులను తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇది జరగాలంటే అధ్యాపకుడిలోనూ పరిశోధన విధానాన్ని మేళవించే మెళకువలు అభివృద్ధి చెందాలి. 

విశ్వవిద్యాలయాలు ప్రధానంగా జాతీయ, అంతర్జాతీయ మార్పులను మేళవింపు చేసుకోవాలి. అంతర్జాతీయ సంస్థలతో కలసి పరిశోధన చేపట్టాలి. అప్పుడే విద్యార్థి ఆలోచన ధోరణి విస్తృతమవుతుంది. విజ్ఞాన మార్పిడి చాలా అవసరం. దీనిపై విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి కృషి జరగట్లేదు. పారిశ్రామిక నిపుణులతో కలసి కొత్తదనం నింపేలా ఎంటర్‌ప్రెన్యూర్‌ను అభివృద్ధి చేయాలి. ఎన్‌సీపీ, ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలు చురుకుగా ఉంటే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. 

మౌలిక వసతుల కల్పన కొన్ని యూనివర్సిటీలకే పరిమితమైంది. దీన్ని కాలేజీ స్థాయికి తీసుకెళ్లాలి. లైబ్రరీల ఏర్పాటు, కొత్త సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి తేవడం, రిఫరెన్స్‌ జర్నల్స్‌ ఉండేలా చూడటం, ఎలక్ట్రానిక్‌ సెర్చ్‌ ఫ్యాకల్టీ అభివృద్ధి, ఈ–క్లాస్‌ రూమ్స్‌ పెంచడం అత్యంత ముఖ్యమైన అంశాలు. 

క్రీడలు, సాంస్కృత కార్యక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. వ్యాయామ ఉపాధ్యాయుల నియామకానికి ఎక్కడా ప్రాధాన్యం కన్పించట్లేదు. సబ్జెక్టు అధ్యాపకుల కొరత కాలేజీలు, యూనివర్సిటీలను వేధిస్తోంది. దేశంలో కొన్ని యూనివర్సిటీలు అంతర్జాతీయ క్రీడాకారులను ఆహ్వానిస్తున్నాయి. ఇక్కడ ప్రమాణాలు బాగుంటున్నాయి. ఈ తరహా ప్రయోగాలు చేయాలి. 

ఉన్నత విద్య ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నాయకత్వం వహించాలి. సంబంధిత అధికారులతో చర్చలు జరపాలి. మెరుగైన రీతిలో బోధనకు గల అవకాశాలను పరిశీలించాలి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక పాత్ర పోషించాలి. వాస్తవ నివేదికలను, క్షేత్రస్థాయి నుంచి సేకరించి, విలువైన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి.   

మరిన్ని వార్తలు