ఈఎస్‌ఐ చందాదారులకు శుభవార్త.. అక్కడి ఈఎస్‌ఐలో 24/7 మందులు! 

19 Dec, 2022 01:01 IST|Sakshi

త్వరలో మెడికల్‌ స్టాల్‌ ఏర్పాటు చేయనున్న కార్మిక శాఖ

ఆపై మరో రెండు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లోనూ ఏర్పాటుకు సన్నాహాలు 

సాక్షి, హైదరాబాద్‌: కార్మిక రాజ్య బీమా (ఈఎస్‌ఐ) చందాదారులకు శుభవార్త. ఇప్పటివరకు కేవలం ఓపీ పనివేళల్లోనే ఈఎస్‌ఐ నాచారం ఆస్పత్రిలో రోగులకు మందులు లభిస్తుండగా అతిత్వరలో ప్రతిరోజూ 24 గంటలపాటు అక్కడ మందులు లభించనున్నాయి. ఇందుకోసం నాచారం ఆస్పత్రిలో 24 గంటలపాటు మందులు అందించేలా ఒక మెడికల్‌ స్టాల్‌ను కార్మిక శాఖ ఏర్పాటు చేయనుంది.

ఈఎస్‌ఐ ఖాతాదారుల డిమాండ్‌కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర కార్మిక సంక్షేమ, ఉపాధి కల్పన శాఖ మంత్రి సీహెచ్‌ మల్లారెడ్డి ఇటీవల జరిగిన ఈఎస్‌ఐ అధికా­రుల సమావేశంలో వెల్లడించారు. మందుల కొనుగోలుకు ఇప్పటికే రూ. 37 కోట్లు విడు­దల చేశామన్నారు. ముందుగా నాచారం ఆస్పత్రిలో 24/7 మందుల పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టి ఆ తర్వాత మరో రెండు ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లోనూ దీన్ని అమలు చేసేందుకు కార్మిక శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించింది.

మరోవైపు జ్వరం మొదలు బీపీ, షుగర్, హృద్రోగాలకు సంబంధించిన మందులను ప్రధాన ఆస్పత్రులతోపాటు క్షేత్రస్థాయిలోని డిస్పెన్సరీల్లోనూ ప్రత్యేక కోటా కింద కేటాయించి నిల్వలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలని కార్మిక శాఖను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ఈఎస్‌ఐ పరిధిలో ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రితోపాటు మరో మూడు ఆస్పత్రులు, 70 డిస్పెన్సరీలు ఉండగా వాటికి అదనంగా 25 ప్యానెల్‌ క్లినిక్‌లు ఉన్నాయి. ఈఎస్‌ఐ పరిధిలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో దాదాపు అన్ని రకాల రోగులకు మందులను పంపిణీ చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు