Telangana: రిపోర్టింగ్‌ టు ప్రియాంక.. కొత్త ఇన్‌చార్జి కార్యదర్శి నదీమ్‌ జావేద్‌ రంగంలోకి..

17 Aug, 2022 01:00 IST|Sakshi

పార్టీలో సమన్వయ లోపం, అంతర్గత విభేదాలపై నేతలతో చర్చలు

నేరుగా ప్రియాంకకే నివేదిక ఇస్తున్నారంటున్న గాంధీ భవన్‌ వర్గాలు

సీనియర్లందరితో కలిసి బస్సు యాత్రకు ప్లాన్‌ జరుగుతుందనే చర్చ

రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల్లో కొత్త ఇన్‌చార్జి కార్యదర్శి నదీమ్‌ జావేద్‌ చొరవ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అంతర్గత పరిణామాలపై అధిష్టానం దృష్టి సారించింది. టీపీసీసీ నేతల మధ్య సమన్వయ లోపం, అంతర్గత విభేదాలను పరిష్కరించి అందరినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు పార్టీ ఇన్‌చార్జి కార్యదర్శిగా ఇటీవల నియమించిన నదీమ్‌ జావేద్‌ను రంగంలోకి దింపింది. దీంతో గత రెండు రోజులుగా పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన అందులో భాగంగా సోమవారం టీపీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో దాదాపు రెండున్నర గంటలపాటు భేటీ అయినట్లు గాంధీ భవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్, మాజీ మంత్రి షబ్బీర్‌అలీతోనూ నదీమ్‌ జావేద్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌ నగర కాంగ్రెస్‌ బలోపేతం కోసం నదీమ్‌ జావేద్‌ పాదయాత్రలు, బస్తీ పర్యటనలు చేస్తున్నారని తెలుస్తోంది. పార్టీ నేతల ఫీడ్‌బ్యాక్‌ను ఆయన నేరుగా ప్రియాంక గాంధీకి అందిస్తుండటం గాంధీ భవన్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అలాగే సీనియర్లందరితో కలసి బస్సు యాత్రను జావేద్‌ ప్రతిపాదించారని, దీన్ని అధిష్టానం పరిశీలిస్తోందని గాంధీ భవన్‌ వర్గాలంటున్నాయి. 

మాణిక్యంపై నివేదిక?
ఇటీవలి వరకు ఏఐసీసీ కార్యదర్శి హోదాలో రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించిన శ్రీనివాస కృష్ణన్‌ అధిష్టానానికి కీలక నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. తనను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించాలని అధిష్టానాన్ని కోరిన ఆయన ఇప్పుడు పార్టీ వ్యవహారాలకే దూరంగా ఉంటున్నారు. తాను వెళ్లిపోయే సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌ పరిస్థితి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ వ్యవహార శైలి, నేతల బలాబలాలు, ఆయా నాయకుల వ్యూహాలు, ప్రాధాన్యతలపై నివేదిక ఇచ్చారని, దీన్ని పరిశీలించాకే తెలంగాణపై దృష్టి పెట్టే బాధ్యతను ప్రియాంకకు అధిష్టా్టనం అప్పజెప్పిందనే చర్చ ఇప్పుడు గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. 

నేడు వరుస భేటీలు
కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చారు. ఆయన బుధవారం గాంధీ భవన్‌లో వరుస సమావేశాల్లో పాల్గొననున్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం మండలాలవారీగా నియమించిన ఇన్‌చార్జులతో ముందుగా భేటీ కానున్న ఆయన... ఆ తర్వాత మునుగోడు నియోజకవర్గంలో పర్యటించే 175 గ్రామాల సమన్వయకర్తలతో సమావేశం కానున్నారు. అనంతరం పార్టీ కార్యక్రమాల అమలు, ఆజాదీ గౌరవ్‌యాత్రలు, ఇతర అంశాలపై డీసీసీ అధ్యక్షులతోనూ సమావేశం కానున్నారు. ఏఐసీసీ కార్యదర్శులుగా నియమితులైన నదీమ్‌ జావేద్, రోహిత్‌ చౌదరిలతో కూడా ఠాగూర్‌ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు