22 గంటలపాటు ఇంట్లోనే మృతదేహం

10 Aug, 2020 08:42 IST|Sakshi
అంత్యక్రియలు నిర్వహిస్తున్న మున్సిపల్‌ సిబ్బంది

సాక్షి, పాల్వంచ‌: కరోనా మహమ్మారి మనుషుల మధ్య మానవత్వాన్ని కూడా దూరం చేస్తోంది. ఓ వృద్ధుడు గుండెపోటుతో చనిపోతే.. కరోనా వైరస్‌ సోకి చనిపోయాడని భయపడి, మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ సహకరించలేదు. ఈ సంఘటన పాల్వంచ మండలం నాగారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మల్లాది వెంకయ్య(56)కు గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా శనివారం సాయంత్రం మృతిచెందాడు. అయితే కరోనా కారణంగా మృతి చెంది ఉంటాడని భావించిన స్థానికులు భయంతో అంతిమ సంస్కారాలకు హాజరుకాకుండా దూరంగా ఉన్నారు. మృతుడి ఇరుగు పొరుగు, గ్రామస్తులెవరూ కనీసం చూసేందుకు కూడా రాలేదు. దీంతో మృతదేహం శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటల వరకు 22 గంటలపాటు ఇంట్లోనే ఉంచారు. స్థానికులు సహకరించకపోవడంతో పాల్వంచలోని మున్సిపాల్‌ కార్మికులను ముగ్గుర్ని పిలిపించి, స్థానిక రైతు రంజిత్‌ ట్రాక్టర్‌పై మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు. శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో నివాసం ఉండే వారు కూడా మృతదేహాన్ని తమ వీధి నుంచి తీసుకెళ్లొద్దంటూ అభ్యంతరం వ్యక్తంచేశారు.

పంచాయతీలు బాధ్యత తీసుకోవాలి
నాగారం గ్రామంలో మల్లాది వెంకయ్య మృతి చెందితే అంత్యక్రియలు చేయడానికి గ్రామపంచాయతీ ట్రాక్టర్‌ ఇచ్చేందుకు సర్పంచ్, కార్యదర్శి నిరాకరించారని సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన చేశారు. అదే గ్రామానికి చెందిన రంజిత్‌ అనే వ్యక్తి ట్రాక్టర్‌ ఇవ్వడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే పంచాయతీలు బాధ్యత తీసుకుని దహన సంస్కారాలు నిర్వహించాలని కోరారు.

మరిన్ని వార్తలు