సాగర్‌కు భారీ వరద.. శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తివేత

30 Jul, 2021 01:46 IST|Sakshi
సాగర్‌లో స్పిల్‌వేను తాకిన నీరు

నాలుగు లక్షల క్యూసెక్కులపైనే ప్రవాహం

ఎగువన ప్రాజెక్టులన్నీ ఫుల్‌.. వస్తున్న నీళ్లన్నీ దిగువకే

సాక్షి, హైదరాబాద్‌/ధరూరు/కందనూలు: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు పడుతుండటం, ఉప నదులు ఉప్పొంగుతుండటంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులకు వచ్చిన నీటిని వచ్చినట్టుగా వదిలేస్తున్నారు. జూరాల నుంచి 4.71 లక్షల క్యూసెక్కులు విడుదల అవుతుండగా.. దీనికి తుంగభద్ర వరద తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 5.37 లక్షల క్యూసెక్కుల వరద పోటెత్తుతోంది. ప్రస్తుత సీజన్‌లో కృష్ణా నదిలో గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. గురువారం రాత్రి సమయానికి శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లను ఎత్తి.. 3,76,170 క్యూసెక్కులను నదిలోకి వదులుతున్నారు. 

సాగర్‌ వైపు ప్రవాహం: శ్రీశైలం స్పిల్‌వే నుంచి విడుదల చేస్తున్న నీటితోపాటు.. కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 66 వేల క్యూసెక్కులకుపైగా వదిలేస్తున్నారు. ఈ వరద అంతా నాగార్జునసాగర్‌ వైపు పరుగులు తీస్తోంది. సాగర్‌ నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలకుగాను.. గురువారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 204.96 టీఎంసీలకు చేరుకుంది. 
ప్రకాశం బ్యారేజీలోకి తగ్గిన వరద: వానలు తగ్గుముఖం పట్టడంతో వైరా, కట్టలేరు, మున్నేరు నుంచి వరద తగ్గింది. పులిచింతలలో తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేస్తూ వదులుతున్న నీటికి వైరా, కట్టలేరు, మున్నేరు ప్రవాహం కలిసి.. ప్రకాశం బ్యారేజీకి 10,468 క్యూసెక్కులు వరద కొనసాగుతోంది. 

లక్ష్మీ బ్యారేజీకి భారీగా వరద: 
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీకి ప్రాణహిత నది ద్వారా 1.1 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. గురువారం 85 గేట్లకు 24 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులు తున్నారు. అవుట్‌ఫ్లో 74.56 వేల క్యూసెక్కులు వెళ్తోంది. 

మరిన్ని వార్తలు