‘సాగర్‌’లో భారీగా‌ పోలింగ్‌...ఎవరిదో గెలుపు! 

18 Apr, 2021 03:05 IST|Sakshi
సాగర్‌ హిల్‌కాలనీలో పోలింగ్‌ కేంద్రం లోపలికి తన తల్లిని స్కూటర్‌పై తీసుకొస్తున్న కుమారుడు

ఉప ఎన్నికలో 86.2 పోలింగ్‌ శాతం

రాత్రి 7 గంటల దాకా సాగిన పోలింగ్‌

గతం కన్నా పెరిగిన పోలింగ్‌ శాతం

ఉప ఎన్నికలో ఓట్లు 2,20,300

మొత్తం పోలైన ఓట్లు 1,90,329

మే 2వ తేదీన ఫలితాలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో భారీ పోలింగ్‌ నమోదైంది. శనివారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్‌ రాత్రి 7 గంటల దాకా కొనసాగింది. గత ఎన్నికలకు భిన్నంగా ఎన్నికల కమిషన్‌ ఈసారి అదనంగా మరో 2 గంటలు పోలింగ్‌ సమయాన్ని పెంచింది. ఈ ఉపఎన్నికలో 86.2 పోలింగ్‌ శాతం నమోదైంది. మొత్తం 2,20,300 ఓట్లకు గాను, 1,90,329 ఓట్లు పోలయ్యాయి. తుది క్రోడీకరణల అనంతరం ఈ సంఖ్యలో కొంతమార్పు ఉండే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. వాస్తవానికి 2018 ఎన్నికల కంటే ఈసారి పోలింగ్‌ శాతం కొంత తక్కువగా నమోదైంది. గత ఎన్నికల్లో 2,08,176 ఓట్లకు గాను, 1,79,995 ఓట్లు పోల్‌ కావడంతో 86.46 శాతం  పోలింగ్‌ నమోదైంది. అంతే కాకుండా.. గత ఎన్నికల కంటే ఈసారి 12 వేల ఓట్లు కూడా పెరిగాయి. ఉప ఎన్నికల్లో విజయం కోసం అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్‌ హోరాహోరీగా తలపడ్డాయి. బీజేపీ సహా మొత్తం 41 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా.. ప్రధాన పోటీ మాత్రం టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే సాగింది.

ఓట్లు వేయించడంలోనూ పోటాపోటీ
ఇరు పార్టీలకు ఈ ఎన్నికల్లో గెలవడం అనివార్యంగా మారడంతో ఎన్నికల ప్రచారంలో పోటీ పడినట్లే.. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకొచ్చి ఓట్లేయించడలోనూ పోటీ పడినట్లే కన్పించింది. దీంతో పోలింగ్‌ జోరుగా సాగింది. ప్రతి ఓటును కీలకంగా భావించి.. ఆయా గ్రామాల్లో స్థానిక నేతలు శ్రద్ధ తీసుకున్నారు. మరోవైపు పల్లెల్లో పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలోనే ఆయా పార్టీ కార్యకర్తల పోల్‌ చీటీలు పంచే అవకాశమిచ్చారు. దీంతో చాలా చోట్ల పోలింగ్‌ కేంద్రం దరిదాపుల్లో ఎవరూ లేకుండా అయ్యారు.

చదవండి: కాంగ్రెస్‌ వడివడిగా.. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు