మిస్టర్‌ కేసీఆర్‌! డబ్బు సంచులతో ప్రజాస్వామ్యాన్ని కొనలేరు

7 Apr, 2021 14:12 IST|Sakshi

కేసీఆర్ నియతృత్వానికి ప్రజాస్వామ్యానికి మధ్య పోరు సాగర్ ఉప ఎన్నిక

సాగర్ ప్రజలకు కేసీఆర్ కుటుంబానికి మధ్యనే పోటీ

నిడుమనూరు: నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి, సాగర్ ప్రజలకు మధ్య జరుగుతున్న పోరని, ప్రజాస్వామ్యానికి.. నియంతృత్వానికి మధ్య జరుగుతున్న సమరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అభివర్ణించారు. సాగర్ ఉప ఎన్నిక సందర్భంగా నిడుమనూర్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్ కుమార్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్‌, మెదక్ లోక్ సభ ఇంచార్జీ గాలి అనిల్ కుమార్‌తో కలిసి భట్టి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై భట్టి మాటల తూటాలు పేల్చారు.

కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో వనరులు, ఆత్మగౌరవం, కొలువులు ప్రజలకు అందడం లేదని భట్టి విక్రమార్క తెలిపారు. కేసీఆర్ నియంతృత్వ పోకడతో, అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు మార్గాలతో ప్రజలను అణగదొక్కుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో పారే ప్రతినీటి బొట్టు, పండే ప్రతి కంకిలోనూ కాంగ్రెస్ పార్టీ కనిపిస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, ప్రశ్నించే గొంతును అసెంబ్లీకి పంపేందుకు సాగర ప్రజలు సిద్ధమయ్యారని జోస్యం చెప్పారు. నియంతృత్వ పోకడలతో రాష్ట్రాన్ని నలిపేస్తున్న కేసీఆర్ కుటుంబానికి ఈ ఉప ఎన్నికతో ప్రజలు బుద్ది చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికను జానారెడ్డికి, కాంగ్రెస్ ఎన్నికగా చూడడం లేదని.. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే ఎన్నికగా చూస్తున్నట్లు వివరించారు.

ఉద్యోగాల సాధన కోసం ఆత్మార్పణలు చేసుకుంటున్న యువతకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఒక అందివచ్చిన అవకాశమని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఎన్నికల్లో జనారెడ్డిని గెలిపించాల్సిన ఆవశ్యకత అందరిపైన ఉందని గుర్తుచేశారు. జానారెడ్డిని గెలిపించి కేసీఆర్‌పై ఒత్తిడి తీసుకురావాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రతి ఊరికి నీళ్లు, ఇళ్లు, ఆరోగ్యశ్రీ కార్డు, ప్రతి కుటుంబంలోని విద్యార్థులు చదువుకునేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, ఉపాధి హామీ జాబ్ కార్డును, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించినది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. జానారెడ్డికి ప్రజలంతా పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. డబ్బు, మద్యం, అధికారంతో ప్రజాస్వామ్యాన్ని కొనుగోలు చేయాలని అనుకుంటున్న కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ది చెబుతారని పేర్కొన్నారు. సాగర్ ప్రజలను కొనగలను అని విర్రవీగుతున్న కేసీఆర్‌కు ఇక్కడ ప్రజలు ఓటు ద్వారా సమాధానం చెబుతారని భట్టి విశ్వాసం వ్యక్తం చేశారు. జానారెడ్డికి పదవులు, హోదాలు కొత్త కాదని, కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నిలదీసే జానారెడ్డి అసెంబ్లీలో ఉండడం ప్రజలకు అవసరం అని గుర్తుచేశారు.

>
మరిన్ని వార్తలు