ఆఖరి ఆయకట్టు అంతేనా?

15 Mar, 2023 03:43 IST|Sakshi

ఎండుతున్న సాగర్‌ ఆయ’కట్‌’

పాలేరుకు ఇన్‌ఫ్లో తగ్గడంతో దిగువకు అందని నీరు 

అధికారుల ప్రణాళికా లోపంతో రైతులకు ఇక్కట్లు 

ఆందోళనకు దిగుతున్న రైతాంగం 

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: నాగార్జునసాగర్‌ చివరి ఆయకట్టు ఎండిపోతోంది. జలవనరుల శాఖ అధికారుల ప్రణాళికా లోపంతో ఆఖరి ఆయకట్టుకు నీరు చేరక సత్తుపల్లి, వైరా, మధిర ప్రాంతాల్లో వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయి. ఇంకో నెలన్నరలో పంటలు చేతికి రావాల్సి ఉన్న వేళ ఈ పరిస్థితితో రైతుల్లో ఆందోళన నెలకొంది.  

సాగర్‌ జలాలు వస్తాయని.. 
ఖమ్మం జిల్లాలో 2,54,270 ఎకరాల సాగర్‌ ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టు పరిధిలో యాసంగిలో 2,23,545 ఎకరాల సాగుకు 33.61 టీఎంసీల నీరు అవసరమని అధికారులు లెక్కలు వేశారు. గత ఏడాది డిసెంబర్‌ 15నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 14 వరకు మొత్తం 29.067 టీఎంసీల నీటిని వారబంధీ విధానంలో విడుదలకు ప్రణాళిక సిద్ధం చేశారు.

ఇక ఐడీసీ స్కీమ్స్‌ కింద 1.880 టీఎంసీలు, భక్తరామదాసు, వైరా ప్రాజెక్టు నుంచి 2.663 టీఎంసీల నీరు అందుబాటులో ఉంటుందని భావించారు. కానీ ఇటీవల పాలేరుకు ఇన్‌ఫ్లో భారీగా తగ్గడంతో చివరి ఆయకట్టు భూములకు సరిగ్గా నీరు అందక పంటలు ఎండిపోతుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. బోనకల్‌ బ్రాంచి కెనాల్, సిరిపురం మేజర్‌ కాల్వ పరిధిలో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. 

నీటి కోసం ఎదురుచూపులు.. 
పాలేరు జలాశయంలో నీరు లేకపోవడంతో దిగువకు నీటి విడుదల సాఫీగా సాగడం లేదు. తల్లాడ మండలం సిరిపురం మేజర్‌ కాల్వ పరిధి తల్లాడ, రేజర్ల, కొత్త వెంకటగిరి గ్రామాల ఆయకట్టుకు సాగర్‌ జలాలు అందక రైతులు ఈనెల 11న ఆందోళనకు దిగారు. అలాగే, బోనకల్‌ బ్రాంచి కెనాల్‌ పరిధిలోని 500 ఎకరాల మేర పంట దెబ్బతిన్నది. 
 
ఏప్రిల్‌ వరకు నీరందిస్తామని ఫిబ్రవరిలోనే చేతులెత్తేశారు.. 
తల్లాడ మండలం గాంధీనగర్‌ తండాకు చెందిన భూక్యా లక్ష్మి యాసంగిలో రెండున్నర ఎకరాలు రూ.50వేలకు కౌలుకు తీసుకుంది. తెలగవరం సబ్‌ మైనర్, సిరిపురం ఎన్నెస్పీ మేజర్‌ కాల్వ కింద రేజర్లలో 75 రోజుల క్రితం వరి నాట్లు వేయగా, నెల రోజులుగా నీరు రావడం లేదు. దీంతో వరి మొత్తం ఎండిపోగా.. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న లక్ష్మి, ఆమె భర్త తమను ఆదుకునే వారెవరని ప్రశ్నిస్తున్నారు. ఏప్రిల్‌ వరకు నీరందిస్తామన్న అధికారులు ఫిబ్రవరిలోనే ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.  
 
పరిహారం అందించాల్సిందే...  
బోనకల్‌ మండలం ఆళ్లపాడుకు చెందిన రైతు బొమ్మగాని సాంబయ్య ఐదెకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశాడు. ఆయన భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి రూ.2 లక్షల మేర పెట్టుబడి పెట్టాడు. కంకి దశలో ఉండగా సాగర్‌ జలాలు అందక పంట ఎండిపోయింది. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఆళ్లపాడు మైనర్‌కు నీరు విడుదల చేయలేదని.. ఎండిపోయిన మొక్కజొన్న పంట సర్వే చేయించి పరిహారం అందించాలని సాంబయ్య కోరుతున్నాడు.  

ప్రణాళికా లోపం.. 
ఏప్రిల్‌ వరకు నీటి సరఫరా ఉంటుందని అధికారులు ప్రకటించడంతో రైతులు పంటల సాగు చేపట్టారు. కానీ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు అధికారుల ప్రణాళికా లోపంతో ఫిబ్రవరిలోనే నీటి కటకట ఏర్పడింది. అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తే చివరి ఆయకట్టుకు కూడా కొంత మేర నీరు అందేది. ప్రస్తుతం పాలేరుకు ఇన్‌ఫ్లో తగ్గగా.. ఇటీవల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ జలవనరుల సలహా మండలి సమావేశం నిర్వహించి సూచనలు చేశారు.

ఆ మేరకు ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో 5వేల క్యూసెక్కులను పాలేరు రిజర్వాయర్‌కు విడుదల చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చినా పూర్తిగా నెరవేరలేదు. ఒకటి, రెండు రోజులకే ఇన్‌ఫ్లో తగ్గడంతో పాలేరు రిజర్వాయర్‌లో నీటిమట్టం మళ్లీ 16 అడుగులకు చేరింది.  

మరిన్ని వార్తలు