కరోనా కల్లోలం రేపిన ‘నాగార్జునసాగర్‌ సభ’

19 Apr, 2021 23:51 IST|Sakshi

నల్లగొండ: ఉప ఎన్నిక సందర్భంగా నాగార్జునగర్‌ నియోజకవర్గ పరిధిలో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్వహించిన బహిరంగ సభ కరోనా వైరస్‌ విజృంభణకు కేంద్రంగా నిలిచింది. ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ సాగర్‌ అభ్యర్థి నోముల భగత్‌తో పాటు అక్కడి కీలక టీఆర్‌ఎస్‌ నాయకులకు కరోనా సోకింది. దీంతో పాటు ఆ బహిరంగ సభకు హాజరైన వారిలో చాలామందికి వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం ఒక్కరోజే కేవలం నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో 160 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సందర్భంగా ఈనెల 17వ తేదీన ఉప ఎన్నిక ఉండడంతో ఈసారి గెలుపు కోసం టీఆర్‌ఎస్‌ తీవ్రంగా శ్రమించింది. అందులో భాగంగా సీఎం కేసీఆర్‌ ఈనెల 14వ తేదీన హాలియాలో‌ బహిరంగ సభ నిర్వహించారు. కరోనా విజృంభిస్తున్న వేళ అందరూ సభ వద్దన్నా కూడా నిర్వహించారు. ఆ సభ వలనే సీఎంతో పాటు ఆ పార్టీ అభ్యర్థికి ఇతర ముఖ్య నాయకులకు కరోనా సోకిందని నిఘా వర్గాలు గుర్తించాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్‌‌తో పాటు అతడి కుటుంబసభ్యులకు, టీఆర్ఎస్ సాగర్‌ నాయకులు ఎంసీ కోటిరెడ్డి, కడారి అంజయ్యలకు కూడా పాజిటివ్‌ తేలింది. ఆ బహిరంగ సభకు కేసీఆర్‌తో పాటు వీరంతా హాజరైన వారే. సభకు వచ్చిన వారిలో కరోనా బాధితులు ఉండడంతోనే అందరికీ వ్యాపించిందని తెలుస్తోంది. అంతకుముందు 

కాంగ్రెస్, బీజేపీ నేతలకూ కూడా కరోనా  పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీలు నిర్వహించిన కార్యక్రమాల ద్వారా కూడా కరోనా తీవ్రంగా విజృంభిస్తోందని తేలింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు గుమికూడడం, ప్రజలను కలవడం.. కరోనా నిబంధనలు పాటించకపోవడం తదితర కారణాలతో సాగర్‌ నియోజకవర్గంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. మాస్క్‌లు ధరించినా భౌతిక దూరం విస్మరించడం వైరస్‌ వ్యాప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. శానిటైజర్‌ వినియోగం కూడా అంతంతమాత్రమేనని సమాచారం.

చదవండి: కేసీఆర్‌కు కరోనా.. కేటీఆర్‌, కవిత భావోద్వేగం

మరిన్ని వార్తలు