నాగార్జున సాగర్‌: ప్రైవేట్‌ టీచర్‌ రవి భార్య ఆత్మహత్య

8 Apr, 2021 18:03 IST|Sakshi

నాగార్జున సాగర్‌ కుడి కాలువలో దూకి ఆత్మహత్య

తల్లిదండ్రులిద్దరిని కోల్పోయి అనాథలుగా మారిన బిడ్డలు

సాక్షి, నల్లగొండ: లోకం తెలియని చిన్నారులు.. అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ.. నాన్నతో కలిసి ఆడుతూ పాడుతూ పెరగాల్సిన వారు. పట్టుమని పదేళ్లు కూడా నిండని ఆ చిన్నారులపై విధి పగబట్టింది. కరోనా రూపంలో వారిని కాటేసింది. కోవిడ్‌ వల్ల ఏడాదిగా ఉద్యోగం లేక.. ఆర్థిక సమస్యలు పెరగడంతో తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు రోజులుగా ఇంట్లో ఒకటే ఏడుపు. ఏమైందో ఆ చిన్న బుర్రలకు అర్థం కావడం లేదు. ఒక్కటి మాత్రం తెలిసింది. నాన్న ఇక ఎన్నిటికి రాడని. ఈ బాధ నుంచి కోలుకోక ముందే వారి ఇంటి మరో విషాదం చోటు చేసుకుంది. చిన్నారుల తల్లి కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. తల్లిదండ్రులిద్దరిని కోల్పోయిన ఆ చిన్నారులను చూస్తే ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది. బిడ్డల ముఖం చూసైన బతుకకపాయే అంటూ విలపిస్తున్నారు బంధువులు. 

నాగార్జున సాగర్‌లో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. రెండు రోజుల క్రితం ఆర్థిక సమస్యలు తట్టుకోలేక సాగర్‌ హిల్‌ కాలనీకి చెందిన ప్రైవేట్‌ టీచర్‌ రవి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నేడు వారి ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. రవి కుమార్‌ భార్య అక్కమ్మ కూడా ఆత్మహత్య చేసుకుని మరణించింది. భర్త మరణాన్ని జీర్ణించుకోలేని అక్కమ్మ గురువారం నాగార్జున సాగర్‌ కుడి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. దంపతులిద్దరి మరణంతో వారి పిల్లలు అనాథలుగా మారారు. పసి బిడ్డలను చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెడుతున్నారు. బిడ్డల ముఖం చూసైనా బతుకకపాయే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: ప్రైవేట్‌ టీచర్‌ ఆవేదన: సీఎం సారూ.. పస్తులుంటున్నం 

మరిన్ని వార్తలు