పర్యాటలకు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ తీపి కబురు

29 Nov, 2021 10:43 IST|Sakshi

సాగర్‌ టు శ్రీశైలం

నేటి నుంచి లాంచీ ప్రారంభం

ఆహ్లాదం, ఆనందం పంచనున్న నదీ ప్రయాణం

ప్యాకేజీలు వెల్లడించిన తెలంగాణ పర్యాటక శాఖ

సాక్షి, పెద్దవూర(నల్గొండ) : పర్యాటలకు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ తీపి కబురు అందించింది. కృష్ణానదిలో నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సోమవారం సాగర్‌ హిల్‌కాలనీలోని లాంచీస్టేషన్‌ నుంచి ఉదయం 9 గంటలకు లాంచీ ప్రారంభమవుతుందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. మూడు నెలల క్రితం ప్రారంభం కావాల్సిన లాంచీ ప్రయాణం పర్యాటకులు ఆసక్తి కనపర్చకపోవడంతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయంలో నీటిమట్టం 570 అడుగులకు పైగా ఉన్నప్పుడు సాగర్‌ నుంచి శ్రీశైలం లాంచీ విహార యాత్రకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జలాశయంలో పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉండటంతో పర్యాటకులు ఆసక్తి చూపిస్తే మరో నెల రోజులకు పైగా లాంచీ ప్రయాణం నిర్వహించే అవకాశం ఉంది. 

ప్రకృతి అందాల నడుమ ప్రయాణం
చుట్టూ ప్రకృతి అందాలతో అలరారే పచ్చదనంతో కప్పేసిన ఎత్తయిన కొండల నడుమ సాగే ఈ లాంచీ ప్రయాణం పర్యాటకులను ఎంతగానో అలరించనుంది.  సాగర్‌ నుంచి శ్రీశైలం వరకు 110 కిలో మీటర్ల దూరం లాంచీలో ఏడు గంటల పాటు ప్రయాణం ఉంటుంది. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో సాగే లాంచీ ప్రయాణం పర్యాటకులకు అంతులేని ఆనందాన్ని ఇస్తుంది. ఆహ్లాదకరమైన దృశ్యాలతో పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో సాగే లాంచీ ప్రయాణం హాయిగా ఉంటుంది. ఈ ప్రయాణం మరవలేని స్మృతులను అందించనుంది. పక్షుల కిలకిలరావాలతో, నీటి సవ్వడుల మధ్య సాగే ఈ జర్నీలో ఆధ్యంతం ఆసక్తిగా సాగుతూ కొండల మధ్య తిరుగుతూ ఉంటుంది. మనకు తెలియని కొత్త, వింతైన విషయాలను తెలిపేందుకు లాంచీలో గైడ్‌ కూడా ఉంటాడు. 
చదవండి: మూడేళ్లుగా ఒకేచోట.. సైబరాబాద్‌లో ఎస్‌హెచ్‌ఓల బదిలీలు? 

టికెట్‌ వివరాలు
నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణానికి గాను ఒకవైపు ప్రయాణికి పెద్దలకు రూ.1500, 4 నుంచి 12 సంవత్సరాల లోపు పిల్ల లకు రూ.1200గా నిర్ణయించారు. సాగర్‌ నుంచి శ్రీశైలం, తిరిగి శ్రీశైలం నుంచి సాగర్‌కు రెండు పైపులా ప్రయాణానికి పెద్దలకు రూ.2500, పిల్లలకు రూ.2000 ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి వచ్చే పర్యాటలకు బస్‌ ప్యాకేజీతో కలిపి పెద్దలకు రూ.3999, పిల్లలకు రూ.3399 ఉంటుంది. వివరాలకు 98485 40371, 79979 51023 ఫోన్‌ నంబర్లను సంప్రదించాలి. ఆన్‌లైన్‌ బుకింగ్‌ కోసం www.tsdc.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని పర్యాటక శాఖ అధికారులు పేర్కొన్నారు. 
చదవండి: MLC Polls:టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండే విఠల్‌ కోటీశ్వరుడు..

సాగర్‌ జలాశయంలో లాంచీ (ఫైల్‌) 

మరిన్ని వార్తలు