సాగర్‌ రైతుల ఆశలు సజీవం..

25 Jul, 2021 03:26 IST|Sakshi

నాగార్జునసాగర్‌ కింద ఈ వానాకాలంలో 6.40 లక్షల ఎకరాల పూర్తి ఆయకట్టుకు నీరు

ఇప్పటికే సమృధ్ధిగా నీటి నిల్వలు.. 312 టీఎంసీలకుగానూ 182 టీఎంసీల నిల్వ

శ్రీశైలానికి ప్రవాహాలు పెరుగుతుండటంతో ఆగస్టు రెండోవారం నుంచి భారీ వరద!

ఆగస్టు 13 నుంచి ఏడు తడులకు నీళ్లిచ్చే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: ఐదు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎగువ ప్రాజెక్టులన్నీ నిండి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ప్రవాహాలు వస్తున్నాయి, ఇది నిండితే ఇక వచ్చేదంతా సాగర్‌కే కావడంతో వానాకాలం సాగుపై ఆశలు చిగురించాయి. ఇప్పటికే కనీస నీటిమట్టాలకు పైన 42 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. వానాకాలం నీటి విడుదలకు మరో 20 రోజుల గడువు ఉంది. అప్పటిలోగా మరింత నీరు చేరుతుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు.

శ్రీశైలం నిండితే దిగువకే నీరంతా.. 
పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీవర్షాలకు ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టులు పూర్తిగా నిండగా దిగువకు వచ్చే నీరంతా శ్రీశైలం ప్రాజెక్టుకే. దీంతో శ్రీశైలంలోనూ మట్టాలు గణనీయంగా పెరు గుతున్నాయి. శ్రీశైలంలో 215 టీఎంసీల నిల్వ సా మర్థ్యానికిగాను 93 టీఎంసీల మేర నీరు చేరింది. మరో 122 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండుకుండ లా మారనుంది. ప్రవాహాలు ఇదేవిధంగా కొనసాగితే మరో 10, 15 రోజుల్లో ప్రాజెక్టు నిండే అవకాశముంది. అదే జరిగితే ఆగస్టు రెండోవారం నుంచి శ్రీశైలం నుంచి వచ్చే వరదంతా దిగువ సాగర్‌కే. ప్రస్తుతం సాగర్‌లో 312 టీఎంసీల నిల్వ సామర్థ్యా నికిగాను 182 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇం దులో కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన వినియోగార్హమైన నీరు 42 టీఎంసీల మేర ఉంది.

మరో 45 టీఎంసీల నీరు చేరే వరకు... 
ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగర్‌ కింద 6.40 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని ఇటీవల జరిగిన ఇరిగేషన్‌ శాఖ శివమ్‌ కమిటీ భేటీలో అధికారులు నిర్ణయించారు. దీనికి 60 టీఎంసీల నీరు అవసరమని అంచనా కట్టారు. సాగర్‌పై ఆధారపడ్డ ఏఎంఆర్‌పీ కింద, హైదరాబాద్‌ జంటనగరాలకు, మిషన్‌ భగీరథ, నల్లగొండ జిల్లా తాగు అవసరాలకు కనీస నీటిమట్టం 510 అడుగులకు ఎగువన కనిష్టంగా 25 టీఎంసీల మేర నీటిని పక్కన పెట్టాకే సాగు అవసరాలకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. ఈ లెక్కన ప్రస్తుత లభ్యత కేవలం 17 టీఎంసీలే ఉంటుంది. ఈ నీరు సాగు అవసరాలను తీర్చే అవకాశంలేనందున మరో 45 టీఎంసీల నీరు చేరే వరకు వేచిచూడాల్సి ఉంది.

అయితే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ద్వారా సాగర్‌లోకి 25 వేల నుంచి 29 వేల క్యూ సెక్కుల మేర నీటి విడుదల కొనసాగుతోంది. దీనికితోడు, ఆగస్టు రెండోవారం నుంచి ప్రవాహాలు పెరగనుండటంతో నిల్వలు పెరిగే అవకాశం ఉంద ని అంటున్నారు. గత ఏడాది మాదిరిగానే ఆగస్టు 13 నుంచి సాగర్‌ ఎడమకాల్వకు నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, పూర్తి ఆయకట్టుకు నీరందుతుందని నీటి పారుదల వర్గాలు భావిస్తున్నాయి. గత ఏడాది మాదిరిగా ఆగస్టు 13 నుంచి నవంబర్‌ వరకు ఆరు నుంచి ఏడు తడులకు నీరందే అవకాశముందని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి. 

మరిన్ని వార్తలు