ఆధునిక దేవాలయం: ఆ అపురూప ఘట్టానికి నేటికి 66 ఏళ్లు

10 Dec, 2021 10:30 IST|Sakshi

డిసెంబర్‌ 10, 1955న శంకుస్థాపన చేసిన ఆనాటి ప్రధాని నెహ్రూ

Nagarjunasagar Project Marks the 66th Anniversary of The Foundation Stone: నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసి నేటితో 66 ఏళ్లు నిండాయి. 1955 డిసెంబర్‌ 10న అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి పైలాన్‌లో శంకుస్థాపన చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తిస్థాయిలో మానవశక్తితో నిర్మితమైన ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందించేందుకు కుడి, ఎడమ కాలువలను నిర్మించారు. కుడి కాలువను జవహర్‌ కాలువగా, ఎడమ కాలువను లాల్‌బహుదూర్‌ శాస్త్రి కాలువగా పిలుస్తారు. జవహర్‌ కాలువ సాగర్‌ ఆనకట్ట కుడివైపు నుంచి ప్రారంభమవుతుంది. 

ఈ కాలువ పనులను 10 అక్టోబర్‌ 1956న అప్పటి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. ఇది దక్షిణ విజయపురి (రైట్‌ బ్యాంకు) వద్ద సొరంగ మార్గం ద్వారా ప్రారంభమై 392 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ కాలువ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 11లక్షల 74వేల 874 ఎకరాలు సాగవుతుందని స్థిరీకరించారు. రిజర్వాయర్‌ ఎడమవైపు నుంచి ప్రారంభమయ్యే లాల్‌బహుదూర్‌ శాస్త్రి కాలువ పొట్టిచెలమ నుంచి చలకుర్తి వరకు సొరంగమార్గం ద్వారా ప్రయాణిస్తుంది. దీని నిర్మాణాన్ని 1959లో ఆనాటి గవర్నర్‌ భీమ్‌సేన్‌ సచార్‌ ప్రారంభించారు. 

ఈ కాలువ పొడవు 349 కిలోమీటర్లు. దీని కింద 10లక్షల 37వేల 796 ఎకరాలు సాగవుతుందని స్థిరీకరించారు. రెండు కాలువలకు 132 టీఎంసీల చొప్పున నీటిని కేటాయించారు. రిజర్వాయర్‌ నీటిమట్టం 489 అడుగుల పైన ఉన్నప్పుడు ఈ రెండు కాలువలకు నీటిని విడుదల చేయవచ్చు. 4 ఆగస్టు 1967న నాటి ప్రధాని ఇందిరాగాంధీ కుడి, ఎడమ కాలువలకు మొట్టమొదటిసారి నీటిని వదిలారు.

లక్ష్యానికి దూరంగా..
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నేటికీ నెరవేరలేదు. సిమెంట్‌తో నిర్మించిన కాలువలు కాలక్రమేణా దెబ్బతినడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొంది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో ప్రపంచ బ్యాంకు రుణంతో చిట్టచివరి ఎకరం వరకు నీరందాలనే ఉద్ధేశంతో సాగర్‌ ప్రాజెక్టు కాలువల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టారు. అయినా ఇప్పటికీ చివరి భూములకు నీరందని కాల్వలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పూడికతో రెండు పంటలకు అందని నీరు..
నాగార్జునసాగర్‌ జలాశయంతో పాటు ఎగువన ఉన్న శ్రీశైలం జలాశయంలో పూడిక చేరడంతో ఒకసారి నిండితే రెండు పంటలకు నీరు సరిపోవడం లేదు. అంతేకాకుండా ప్రాజెక్టు నిండిన సమయంలో అధికారులు సరైన ప్రణాళికలు తయారుచేయకపోవడంతో నీటి విడుదల ఆలస్యమై దుబారా అధికమవుతుంది. ఇప్పటికీ ఏ తూము ద్వారా ఎంత నీటిని విడుదల చేస్తే ఎన్ని ఎకరాలు సాగవుతుందనే సమాచారం అధికారుల వద్ద లేదు. ఆయా తూముల వద్ద బోర్డులు ఏర్పాటు చేయలేదు. జలాశయంలోకి పూడిక చేరకుండా చూసి కాలువల స్థానంలో పైపులైన్లు అమర్చితే మరికొన్ని భూములకు సాగునీరందే అవకాశాలున్నాయని రైతులు అంటున్నారు. 

తూములన్నింటికీ షట్టర్లు బిగించాలి..
ప్రధాన కాల్వకు ఉన్న మేజర్ల దగ్గరి నుంచి ప్రతి పంట కాల్వకు షట్టర్లు బిగించాలి. పంటల అవసరాన్ని బట్టి రైతులు నీటిని వినియోగించుకునేలా తూములు డిజైన్‌ చేయాలని రైతులు కోరుతున్నారు. మేజర్ల దగ్గరి నుంచి పంట కాల్వల వరకు ఏ తూముకు ఏ నెలలో ఎంత నీటిని విడుదల చేస్తే ఎంత భూమి సాగవుతుందనే విషయాన్ని బోర్డుల ద్వారా తెలియజేయాలని కోరుతున్నారు. 

సాగర్‌ జలాశయం విస్తీర్ణం–   110 చదరపు మైళ్లు
గరిష్ట నీటిమట్టం –                590 అడుగులు
డెడ్‌ స్టోరేజీ లెవల్‌ –              490 అడుగులు
నీటి నిల్వ సామర్ధ్యం –          408.24 టీఎంసీలు   (ప్రస్తుతం పూడిక నిండటంతో 312 టీఎంసీలు)
నీటి నిల్వ డెడ్‌ స్టోరేజీ –       179.16 టీఎంసీలు (ప్రస్తుతం పూడిక నిండటంతో 168 టీఎంసీలు) 
నీటి విడుదలకు ఉండాల్సిన కనీస నీటిమట్టం 510 అడుగులు 

మరిన్ని వార్తలు