డాక్టర్ల దారుణం.. కరోనా ఉందని కాన్పు చేయలేదు

26 Jan, 2022 02:24 IST|Sakshi

ఆస్పత్రి ఆవరణలో చెంచు మహిళ ప్రసవం 

‘కరోనా వేళ రాష్ట్ర వైద్య సిబ్బంది అద్భుత సేవలు అందిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన గర్భిణికి కరోనా సోకినా నిర్మల్‌ జిల్లా భైంసా ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవం చేశారు. జనగామ ఎంసీహెచ్‌ ఆస్పత్రిలో కూడా కరోనా సోకి క్లిష్ట పరిస్థితిలో ఉన్న గర్భిణికి సురక్షితంగా డెలివరీ చేశారు.’’ 
– ఈ నెల 23న ట్విట్టర్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు 

నిజమే రాష్ట్రవ్యాప్తంగా వైద్య సిబ్బంది కరోనా పరిస్థితుల్లో సైతం వెనుకంజ వేయకుండా నిర్విరామ సేవలందిస్తున్నారు. కానీ కొన్నిచోట్ల మాత్రం వారు ఈ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి మెచ్చుకున్న రెండ్రోజులకే ఒక నిండు గర్భిణిని ఆస్పత్రి ఆరుబయటే వదిలేశారు. కరోనా సాకుతో ఆమెకు డెలివరీ చేసేందుకు నిరాకరించారు. దీంతో ఆమె ఆస్పత్రి ఆవరణలోనే ప్రసవించింది. 

సాక్షి, నాగర్‌కర్నూల్‌/అచ్చంపేట రూరల్‌: పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ నిండు గర్భిణికి కరోనా పాజిటివ్‌ ఉందనే సాకుతో డెలివరీ చేసేందుకు వైద్యులు నిరాకరించిన ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది. బల్మూర్‌ మండలం బాణాలకు చెందిన చెంచు మహిళ నిమ్మల లాలమ్మ మూడో  కాన్పు కోసం  సోదరి అలివేలతో కలసి మంగళవారం ఉదయం  అచ్చంపేట సివిల్‌ ఆస్పత్రికి వచ్చింది.

ముందు జాగ్రత్తగా వైద్యులు ఆమెకు కరోనా ర్యాపిడ్‌ టెస్టు చేయగా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఇక్కడ డెలివరీ చేయడం కుదరదని, నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆస్పత్రికి రెఫర్‌ చేస్తూ చీటీని రాసిచ్చి చేతులు దులిపేసుకున్నారు. కనీసం అంబులెన్సు కూడా ఏర్పాటు చేయలేదు. దాదాపు 40 నిమిషాలు గడిచిపోయాయి. ఈలోగా లాలమ్మకు పురిటి నొప్పులు ఎక్కువైనా వైద్యులెవరూ స్పందించలేదు. చివరికి ఆస్పత్రి ఆవరణలోనే ఆమె ఆడశిశువుకు జన్మి నిచ్చింది. దీంతో సిబ్బంది హడావుడిగా లాలమ్మను ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. బిడ్డకు, తల్లికి ప్రత్యేక గదిని కేటాయించి చికిత్స అందించారు.  

గతంలోనూ ఇదే తీరు.. 
గతంలోనూ అచ్చంపేట సివిల్‌ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వెలుగుచూసింది. 2016 సెప్టెంబర్‌ 28న నల్లగొండ జిల్లా చందంపేటకు చెందిన ఈదమ్మ కాన్పుకు రాగా.. ఆస్పత్రి వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతో ఆçస్పత్రి బయటే ప్రసవించింది. 2019 డిసెంబర్‌ 18న అచ్చంపేట మండలం నడింపల్లికి చెందిన గర్భిణికి డెలివరీ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి తల, మొండెం వేరు అయ్యేలా చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. 

రానియ్యలేదు: అలివేలు, లాలమ్మ సోదరి
పురిటినొప్పులు వస్తున్నాయని చెల్లెలు లాలమ్మను ఆస్పత్రికి తీసుకొచ్చినం. డాక్టర్లు టెస్టు చేసి కరోనా ఉందని చెప్పారు. పురిటినొప్పులు వస్తున్నా ఎవరూ దగ్గరకు రాలేదు. మేం చెంచులం, పైసలు ఉండవనే మమ్మల్ని ఆస్పత్రి నుంచి పంపించారు. అందరూ చూస్తుండగానే కాన్పు అయింది. 

నిబంధనల ప్రకారమే రెఫర్‌ చేశాం: డా.కృష్ణ, సూపరింటెండెంట్‌ 
ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి పరీక్ష చేయగా కరోనా  పాజిటివ్‌ అని తేలింది. డ్యూటీ డాక్టర్‌ పరిశీలించి నిబంధనల ప్రకారమే జిల్లా ఆస్పత్రికి రెఫర్‌ చేశారు. వారు బయటకుపోయిన చాలాసేపటి  తర్వాత ఆరుబయట ఆమె ప్రసవించడంతో వెం టనే బాలింత, శిశువుకు ఆస్పత్రిలోని ఓ ప్రత్యేక గదిలో చికిత్స అందిస్తున్నాం. 

డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకోండి: మంత్రి హరీశ్‌ 
అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన గర్భిణిని కోవిడ్‌ వచ్చిందని చేర్చుకోకుండా బయటికి పంపిన డ్యూటీ డాక్టర్‌ హరిబాబుపై చ ర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు కలెక్టర్‌ ఉదయకుమార్‌ను ఆదేశించారు. కోవిడ్‌తో వచ్చి న గర్భిణులకు ఆస్పత్రుల్లోనే ప్రసవాలు చేయా లని జిల్లా వైద్యాధికారులను ఆదేశించారు.  

మరిన్ని వార్తలు