6 వరుసలుగా నాగ్‌పూర్‌ హైవే  

20 Jul, 2021 01:29 IST|Sakshi

బోయిన్‌పల్లి– మేడ్చల్‌ ఆవలి వరకు విస్తరణ 

నాలుగు భారీ ఎలివేటెడ్‌ కారిడార్లు, సర్వీసు రోడ్లతో నిర్మాణం 

సాక్షి, హైదరాబాద్‌: ట్రాఫిక్‌ చిక్కులతో విలవిల్లాడుతున్న 44వ నంబర్‌ జాతీయ రహదారి(నాగ్‌పూర్‌– నిజామాబాద్‌ హైవే)ని హైదరాబాద్‌ శివారు ప్రాంతంలో ఆరు వరుసలకు విస్తరించనున్నారు. ఈ మేరకు భారత జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రతిపాదించింది. హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి నుంచి మేడ్చల్‌ తర్వాత ఉండే కాల్లకల్‌ వరకు దాదాపు 24 కి.మీ. మేర రహదారిని విస్తరించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖకు తాజాగా ప్రతిపాదించింది. ఇందుకు దాదాపు రూ.1,300 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసింది. దీనికి కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది.  ఈ జాతీయ రహదారికి ఇరువైపులా మేడ్చల్‌ వరకు కొత్త కాలనీలు శరవేగంగా విస్తరిస్తున్నాయి.  దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ చిక్కులు ఏర్పడుతున్నాయి. కూడలి ప్రాంతాల్లో సిగ్నల్‌ పడితే కిలోమీటర్‌ మేర వాహనాల బారులు తీరుతున్నాయి. దీంతో ఈ రహదారిని విస్తరించాలని చాలాకాలం నుంచి ప్రజలు కోరుతున్నారు. 

భారీ ఎలివేటెడ్‌ కారిడార్లతో.. 
బోయిన్‌పల్లి నుంచి మేడ్చల్‌ వరకు కీలక కూడళ్లలో భారీ ఎలివేటెడ్‌ కారిడార్లకు ప్రణాళిక రచించారు. హైదరాబాద్‌ నుంచి మేడ్చల్‌ వెళ్లే దారిలో తొలుత కీలక జంక్షన్‌ అయిన సుచిత్ర కూడలి వద్ద 2 కి.మీ. పొడవైన వంతెన నిర్మించనున్నారు. ఇక్కడి నుంచి 10 కి.మీ. అంటే గుండ్లపోచంపల్లి వరకు మూడు భారీ వంతెనలు ఉంటాయి. సుచిత్ర కూడలి మొద టిది కాగా, సినీప్లానెట్‌ కూడలి వద్ద 560 మీటర్ల పొడవుతో రెండో వంతెన, కొంపల్లి–దూలపల్లి మధ్య 1.2 కి.మీ. మేర మూడో వంతెన నిర్మిస్తారు.  అక్కడి నుంచి మేడ్చల్‌ దాటేవరకు రోడ్డును పూర్తి స్థాయిలో విశాలంగా మారుస్తారు. మేడ్చల్‌ దాటే వరకు రెండున్నర కి.మీ. మేర వంతెన నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించారు. బోయిన్‌పల్లి నుంచి గుండ్ల పోచంపల్లి వరకు పనులకు రూ.450 కోట్లు, అక్కడి నుంచి మేడ్చల్‌  వరకు చేపట్టే పనులకు రూ.850 కోట్లు ప్రతిపాదించారు. 

మరిన్ని వార్తలు