‘లుకేమియా’ దహిస్తోంది!.. కుమారుడి వేదన.. తండ్రి రోదన

16 Jun, 2022 14:20 IST|Sakshi

సహచర మిత్రులతో సరదాగా గడపాల్సిన ఆ బాలుడిని మాయదారి రోగం (లుకేమియా) దహిస్తోంది. రోజురోజుకూ ఒంట్లోని రక్తం తగ్గుతుండడంతో పసివాడు నరకయాతన అనుభవిస్తున్నాడు. వైద్యం చేయించే స్థోమత తండ్రికి లేకపోవడంతో మనసున్న మారాజులు ముందుకు వచ్చి కుమారుడిని బతికించాలని వేడుకుంటున్నాడు. 

సాక్షి, కోదాడ(నల్గొండ): సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామానికి చెందిన చేకూరి రమేష్‌కు కుమార్తె శ్రీవల్లి (14), కుమారుడు సాగర్‌ ఉన్నారు. వీరు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిది, ఏడవ తరగతి చదుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో రమేష్‌ భార్య కొన్నేళ్ల క్రితం విడిపోయి వేరేగా ఉంటోంది. రమేష్‌ లారీడ్రైవర్‌గా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. 

సాగర్‌ అనారోగ్యం బారిన పడడంతో..
కొంతకాలంగా సాగర్‌ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంటోంది. వంట్లో నలతగా భావించి తండ్రి స్థానికంగా వైద్యం చేయించేవాడు. అయితే, ఏప్రిల్‌ సాగర్‌ ఆరోగ్యం పూర్తిగా క్షణించిడంతో ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించడంతో లుకేమియా (బ్లడ్‌ క్యాన్సర్‌)గా వైద్యులు నిర్ధారించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించగా 45రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నాడు. 
చదవండి: రంగారెడ్డి: టీఆర్‌ఎస్‌ నేతల్లో పీకే ఫీవర్‌!

వైద్య పరీక్షలకే అప్పుచేసి..
రమేష్‌ది పేద కుటుంబం. అతడికి ఇతడి ఉండేందుకు ఇల్లు తప్ప ఆస్తిపాస్తులు లేవు. లారీ డ్రైవర్‌గా వెళ్లిన క్రమంలో సోదరుడి ఇంట్లో పిల్లలను ఉంచి జీవనం సాగిస్తున్నాడు. ఉన్నపలంగా కుమారుడు అనారోగ్యం బారిన పడడంతో డ్రైవర్‌ విధులకు వెళ్లకుండా బాలుడి బాగోగులు చూసుకుంటున్నాడు. ఇప్పటి వరకు సాగర్‌ వైదానికి తన వద్ద ఉన్న కొద్ది మొత్తంతో పాటు అప్పు చేసి నెట్టుకొచ్చాడు.

9నెలల పాటు వైద్యం అందితేనే..
లుకేమియా(బ్లడ్‌ క్యాన్సర్‌)తో బాధపడుతున్న సాగర్‌కు రెండు రోజులకు ఒకమారు పరీక్షలు నిర్వహించి అవరం మేరకు రక్తం ఎక్కించాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. అలా తొమ్మిది నెలల పాటు చికిత్స అందితేనే మహమ్మారి బారి నుంచి బయటపడతానని పేర్కొంటున్నారు. అందుకు రూ. 5లక్షల వరకు ఖర్చు అవుతాయని తెలిపారు. అంతపెద్ద మొత్తం తన వద్ద లేదని ఓ వైపు కుమారుడి వేదన చూడలేకపోతున్నానని, రోదించడం తప్ప మరే దారి కనిపించడం లేదని వాపోతున్నాడు. దయార్థ హృదయం కల వారెవరైనా ముందుకు వచ్చి సాయం చేస్తే తన కొడుకు ప్రాణాలు దక్కుతాయని రమేష్‌ ప్రాథేయపడుతున్నాడు. 

కొడుకు ప్రాణాలు కాపాడాలి
ఒక్కగానొక్క కొడుకు మాయదారి జబ్బు బారినపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. నాది నిరుపేద కుటుంబం. పూర్తిస్థాయిలో వైద్యం అందించే స్థోమత నాకు లేదు.  దానగుణం గల వ్యక్తులు స్పందించి తన కుమారుడి ప్రాణాలు కాపాడాలి. పూర్తిస్థాయిలో వైద్యం అందాలంటే రూ.ఐదు లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తేల్చిచెప్పారు. 
– చేకూరి సాగర్, చిన్నారి తండ్రి, ఆకుపాముల

సాయం చేయాలనుకుంటే..
సాగర్‌ సోదరుడు బాలాజీ 
బ్యాంకు ఖాతా : 30543275599
ఎస్‌బీఐ, ఆకుపాముల బ్రాంచి
ఐఎఫ్‌ఎస్‌సి కోడ్‌ : ఎస్‌బీఐయన్‌0002562
ఫోన్‌పే, గూగుల్‌పే నెం : 96761 37554 

మరిన్ని వార్తలు