మొన్న బాలింత, నిన్న పసికందు, నేడు మరొకరు..10 రోజుల్లో ముగ్గురు మృత్యువాత

29 Sep, 2022 08:21 IST|Sakshi

సాక్షి, నల్గొండ: మొన్న బాలింత, నిన్న నాలుగు రోజుల పసికందు, నేడు మరో వ్యక్తి నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు. పది రోజుల వ్యవధిలోనే ముగ్గురు మృతిచెందడం కలకలం రేపుతోంది. ఆస్పత్రిలో మరణాలపై ఇటీవల డీఎంఈ రమేష్‌రెడ్డి విచారణ జరిపినా కూడా వైద్యుల తీరులో మార్పు కనిపించడం లేదని రోగుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్ర ఆస్పత్రిలో అస్వస్థతతో బాధపడుతున్న వ్యక్తికి సకాలంలో సరైన చికిత్స అందించకపోవడంతోనే మృతిచెందాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. 

సకాలంలో వైద్యం అందలేదని..
నల్లగొండ పట్టణానికి చెందిన కంది బుచ్చిరాములు (50) తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి సిబ్బంది అతడిని అత్యవసర విభాగంలో చేర్చి చికిత్స అందించారు. నిమిషాల వ్యవధిలోనే బుచ్చిరాములు మృతిచెందడంతో బంధువులు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. సకాలంలో వైద్యం అందకనే బుచ్చిరాములు మృతిచెందాడంటూ డ్యూటీలో ఉన్న డాక్టర్‌ శ్రీనాథ్‌తో వాగ్వాదం చేస్తూ అతడిపై చేయి చేసుకున్నారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని డాక్టర్‌పై దాడిచేసిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  

విధులు బహిష్కరించి డాక్టర్ల ఆందోళన 
సేవాభావంతో విధులు నిర్వహిస్తున్నా తమపై రోగుల బంధువులు దాడి చేస్తున్నారంటూ జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్యులు విధులను బహిష్కరించి ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆ సమయంలో డాక్టర్‌ శ్రీనాథ్‌పై దాడి చేసిన ఓ వ్యక్తి అక్కడికి రాగా, పోలీసుల సమక్షంలోనే అతడిపై వైద్య సిబ్బంది ప్రతిదాడి చేశారు.

అతడి వెంట ఉన్న మహిళలు కాళ్లు పట్టుకుంటామని వేడుకున్నా పట్టించుకోకుండా పిడిగుద్దులు కురిపించారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ప్రతిదాడి చేసిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం నీలగిరి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ మూర్తి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ అనితారాణి, కోశాధికారి డాక్టర్‌ రమేష్, ఇతర వైద్యులు.. ఎస్పీ రెమా రాజేశ్వరిని కలిసి తమకు రక్షణ కల్పించాలని కోరారు.

మరిన్ని వార్తలు