వీళ్లు మహాముదుర్లు, స్వామికే.. శఠగోపం పెట్టారుగా!

6 Sep, 2021 07:53 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

చింతపల్లి(నల్లగొండ): విలువైన దేవుని మాన్యం అన్యాక్రాంతమవుతోంది. దేవాదాయ శాఖ పర్యవేక్షణ లోపం, పూజారుల ఇష్టారాజ్యం వల్ల  చింతపల్లి మండల కేంద్రంలోని గట్టుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి భూములలు ఆక్రమణకు గురవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయ రికార్డుల్లో 110 ఎకరాలు ఉండగా..  రెవెన్యూ రికార్డుల్లో మాత్రం 70 ఎకరాలను మాత్రమే అధికారికంగా లెక్క చూపిస్తుండడం పలు సందేహాలకు తావిస్తోంది.
ఎంతో చరిత్ర కలిగిన ఆలయం
హైదరాబాద్‌–నాగార్జునసాగర్‌ రాష్ట్ర రహదారికి కేవలం వంద మీటర్ల దూరంలో గట్టుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది. 600 సంవత్సరాల క్రితం ఇక్కడ వేంకటేశ్వరస్వామి వెలిసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం ఆధీనంలో 110 ఎకరాల భూమి ఉంది. ఈ భూముల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు ఎకరం రూ.1.50 కోట్లు పలుకుతుంది. విలువైన భూములు కావడంతో కొందరు అక్రమార్కులు హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రికార్డులను తారుమారు చేస్తూ తప్పుడు లెక్కలతో దేవాలయ భూములను కాజేసేందుకు కుట్రలు పన్నుతున్నారని తెలుస్తోంది. ఆలయానికి దేవరకొండ, గోకారం, గడియగౌరారం గ్రామాల్లో కూడా ఈ దేవాలయానికి సంబంధించి భూములు ఉన్నాయి. అవి కూడా ఎక్కడా రికార్డుల్లో లేని పరిస్థితి. 
పూజారుల ఆధీనంలో..
గట్టుపతి దేవాలయం భూములు ఇక్కడి 80 ఏళ్ల నుంచి పూజారుల ఆధీనంలో ఉన్నాయి. అసలు దేవాదాయ శాఖ కమిటీ ఆధీనంలో దేవాలయ ఈ భూములు ఉండాలి. దానిపై కమిటీ సభ్యుల పర్యవేక్షణ ఉంటుంది. భూములకు సంబంధించి దేవాదాయ శాఖ ప్రత్యేకంగా రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ భూములు కౌలు వేలం వేసి దేవాలయ నిర్వహణ చేయాల్సి ఉంటుంది. కానీ వేలంపాట నిర్వహించకుండానే విలువైన భూములు మాయం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతన్నాయి. ఇప్పటివరకు సుమారు 40 ఎకరాల వరకు భూములు మాయమైనట్లు తెలుస్తోంది. 
40 ఎకరాల లెక్క తేల్చని రికార్డులు
గట్టుపతి దేవాలయ భూముల వివరాలను రెవెన్యూ రికార్డుల ఆధారంగా నిర్వహిస్తున్నారు. రెవెన్యూ రికార్డులో 110 ఎకరాలకు బదులుగా 70 ఎకరాలు ఉన్నట్లు చూపిస్తుండగా.. మిగతా 40 ఎకరాల ప్రస్తావన ఎక్కడా చూకపోవడం ఇటు దేవాదాయ శాఖ అధికారులు అటు రెవెన్యూ అధికారుల ఉదాసీనతకు అద్దంపడుతోంది.  సంబంధిత అధికారులు స్పందించి భూముల సంరక్షణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం 
దేవాలయ భూములు అన్యాక్రాంతమైన విష యం తమ దృష్టికి వచ్చింది. భూముల విలువలు పెరగడంతో అక్రమార్కులు దేవాదాయ భూములను ఆక్రమిస్తున్నారని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. భూముల వేలంపాటకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. 
– సత్యనారాయణమూర్తి, దేవాదాయ శాఖ ఈఓ

చదవండి: Hyderabad Collector L Sharman: బైక్‌పై వెళ్లి.. తనిఖీలు చేసి..

మరిన్ని వార్తలు