ల్యాండ్‌లైన్‌ నుంచి ఫోన్‌ చేస్తేనే అంబులెన్స్‌ల అనుమతి

12 May, 2021 11:24 IST|Sakshi

సరిహద్దులో రెండోరోజూ కొనసాగిన తనిఖీలు

ఇబ్బంది పడిన పలువురు కోవిడ్‌ బాధితులు

కఠినంగా వ్యవహరించిన పోలీసులతో వాగ్వాదానికి దిగిన రోగి బంధువులు 

సాక్షి, నల్గొండ: రాష్ట్ర సరిహద్దు అయిన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌లో ఏపీనుంచి రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న అంబులెన్స్‌ల తనిఖీ రెండో రోజు మంగళవారం కూడా కొనసాగింది. సోమవారం కోవిడ్‌ పేషంట్‌ అడ్మిట్‌ అయ్యే వైద్యశాలలో బెడ్‌ ఉన్నట్లు అనుమతి పత్రాలు చూపితే పంపిన పోలీసులు రెండో రోజు మాత్రం ఇంకా కఠినంగా వ్యవహరించారు. అనుమతి పత్రాలు చూపిస్తే సరిపోదు బెడ్‌ ఉన్నట్లు సంబంధిత వైద్యశాలల ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ నంబర్‌నుంచి తమతో మాట్లాడిస్తేనే పంపిస్తామని తెలిపారు.

కొందరికి వెంటనే ఆ విధంగా ఫోన్‌లో స్పందించడంతో  వదిలారు. మరికొద్ది మందికి ల్యాండ్‌లైన్‌ నుంచి ఫోన్‌లు రావడం ఆలస్యం కావడంతో పోలీసులతో రోగుల బంధువులు వాగ్వాదానికి దిగారు. ఫోన్‌ చేసేందుకు దాదాపుగా 40 నిమిషాలు ఆలస్యం కావడంతో పక్కకు ఓ అంబులెన్స్‌ ఆపివేశారు. పేషంట్‌తో పాటు ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్‌ సరిపడా ఉండదని, గమ్యానికి చేరుకునే సమయాన్ని అంచనా వేసి ఆక్సిజన్‌ పెట్టి పంపిస్తుంటారని పేషంట్‌ బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు గంటలు గంటలు ఇక్కడ ఆపి తమను ఇబ్బందులకు గురి చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.   

వాడపల్లి సరిహద్దు వద్ద అంబులెన్స్‌ల నిలిపివేత
దామరచర్ల : రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన మండలంలోని వాడపల్లి కృష్ణానది వంతెన చెక్‌ పోస్టు వద్ద ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను రెండో రోజు మంగళవారం కూడా నిలిపివేశారు. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు రోజులుగా ఇతర ప్రాంతాల నుంచి రాష్ట్రానికి కరోనా బాధితులతో వస్తున్న అంబులెన్స్‌లు, ఇతర వాహనాలను నిలిపి వేస్తున్నారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల్లో రోగులు చేరేందుకు ముందస్తు అనుమతులు తీసుకున్న వాహనాలను మాత్రం అనుమతి ఇస్తున్నారు. ఇతర వాహనాలను తిప్పి పంపు తున్నారు.    

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు