సాయిచరణ్‌కు కన్నీటి వీడ్కోలు: ‘గొప్పోడివయ్యావనుకుంటే.. కానరాని లోకాలకు వెళ్లిపోతివా కొడుకా’

29 Jun, 2022 16:48 IST|Sakshi

నల్లగొండకు చేరుకున్న మృతదేహం

కుమారుడి మృతదేహం చూసి  స్పృహతప్పిన తల్లిదండ్రులు

నివాళులర్పించిన ఎంపీలు, ఎమ్మెల్యే, వివిధ పార్టీల నాయకులు

నల్లగొండ క్రైం: అమెరికాలో నల్లజాతీయుడి కాల్పుల్లో మరణించిన నక్క సాయి చరణ్‌ మృతదేహం మంగళవారం నల్ల గొండకు తీసుకువచ్చారు. నల్లగొండ పట్టణంలోని వివేకానంద నగర్‌ కాలనీకి చెందిన రిటైర్డ్‌ ప్రధానోపాధ్యాయుడు నక్క సత్యనారాయణ– పద్మ కుమారుడు సాయిచరణ్‌(25) ఈ నెల 20న అమెరికాలోని మేరీలాండ్‌ రాష్ట్రం బాల్టిమోర్‌ సిటీలో నల్లజాతీయుడు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన విషయం తెలిసిందే. సాయి చరణ్‌ మృతదేహం మంగళవారం ఉదయం నల్లగొండలోని నివాసానికి ప్రత్యేక వాహనంలో రాచకొండ సీపీ మహెష్‌ భగవత్‌ చేర్చారు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లి, తండ్రి గుండెలవిసేలా రోదించారు.

కుమారుడి పార్థీవదేహాన్ని చూసి రోదిస్తున్న తల్లి 

గొప్పోడివయ్యావనుకుంటే.. కానరాని లోకాలకు వెళ్లిపోతివా కొడుకా అంటూ వారి రోధించిన తీరు అందరినీ కలిచివేసింది. డిసెంబర్‌లో వస్తానని చెప్పి శవమై వస్తివా అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘డాడీ నేను ఉండేది అమెరికా దేశంలో. డేంజర్‌ జోన్‌ 5లో ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత నేను ఉండే ప్రాంతం నుంచి ఉద్యోగాన్ని మార్చుకుంటా’ అని చెప్పాడని సాయిచరణ్‌ తండ్రి సత్యనారాయణ తెలిపారు. ఆ ప్రాంతం నుంచి కొన్నిరోజులు ముందుగా మారినా తన కుమారుడి ప్రాణం దక్కేదని విలపించాడు.  
చదవండి👉🏻బస్టాండ్‌ బాత్‌రూంలో ప్రసవం.. పుట్టిన కొద్దిసేపటికే ఆడశిశువు మృతి

నాలుగు గంటలు రోడ్డుపైనే సాయిచరణ్‌..
స్నేహితుడిని కారులో తీసుపోయి ఎయిర్‌పోర్టులో దింపి తిరిగి వస్తుండగా ఇంటర్‌స్టెట్‌–95 లోని కెటన్‌ అవెన్యూ చివరికి చేరుకోగానే ఓ నల్లజాతీయుడు కారుపై కాల్పులు జరిపడంతో ముఖం కుడివైపు బుల్లెట్‌ తగిలిందని, ఆ వెంటనే కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిందని తెలిసింది. ఇతరుల సాయం కోసం సాయిచరణ్‌ కారు డోర్‌ తీసి కిందపడిపోయాడు. కాల్పులు జరిగిన 4గంటల తర్వాత పోలీస్‌ పెట్రోలింగ్‌ గమనించి ఆస్పత్రికి తరలించగా చికిత్స మొదలైన రెండు గంటల్లోనే  సాయి చరణ్‌ మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ప్రకటించారు.

వాట్సాప్‌ ద్వారా సమాచారం..
సాయిచరణ్‌ మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చే విషయంపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ప్రత్యేక వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేశారు. జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరితో, సాయిచరణ్‌ కుటుంభ సభ్యులతో సీపీ ఫోన్‌లో మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, జగదీష్‌ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సాయి మృతదేహన్ని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నారు.
చదవండి👉🏻దేశ్‌కీ నేతా! బీఆర్‌ఎస్‌ ఏమైంది?

అండగా ఉంటాం..
సాయి చరణ్‌ కుటుంబానికి అండగా ఉంటామని ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  అన్నారు. మృతుని కుటుంబాన్ని పరామార్శించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం వారి కుటుంబానికి తగిన సహకారం అందించాలని కోరారు. 

మరిన్ని వార్తలు