ఏమిటీ మాయా..? ఎవరు చేస్తున్నారు..? అంతుచిక్కని మిస్టరీ..!

31 Jul, 2021 12:59 IST|Sakshi
కాలిపోయిన దుస్తులు, దగ్ధమైన పశువుల కొట్టం 

 చందంపేట మండలం పాత ఊరి తండాలో అగ్ని ప్రమాదాలు

నిత్యం ఏదో ఒక ఇంట్లో కాలిపోతున్న దుస్తులు, గడ్డివాములు, పశువుల కొట్టాలు

మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4గంటల వరకు ఘటనలు

22 రోజులుగా ఇదే తంతు..భయాందోళనలో తండావాసులు

మిట్ట మధ్యాహ్నం 12 గంటలు దాటిందంటే చాలూ ఆ తండావాసులకు గుండెల్లో దడ మొదలవుతుంది. ఎవరింట్లో దుస్తులు కాలిపోతాయో.. గడ్డివాములు, పశువుల కొట్టాలు తగలబడతాయోనని. సాయంత్రం నాలుగు గంటల వరకు ఇదే తంతు. కంటికి కనిపించరు.. ఇంట్లో మనుషులు ఉన్నా దస్తులు వాటంతట అవే కాలిపోతాయి.. ఊరంతా కాపలాగా ఉన్నా కళ్ల ముందే అగ్గి భగ్గుమంటోంది. ఏమిటీ మాయా..? ఎవరు చేస్తున్నారు..? ఎందుకు చేస్తున్నారు..? ఇది ఎలా సాధ్యం. కేవలం దుస్తులు, గడ్డివాములు, పశువుల కొట్టాలనే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు.? ఇలా ఎన్నో ప్రశ్నలు గిరిజనుల మధిని తొలిచేస్తున్నాయి.  

సాక్షి, నల్గొండ: నల్లగొండ జిల్లా చందంపేట మండల పరిధిలోని ముర్పుతల గ్రామపంచాయతీ పరిధిలోని పాతఊరితండా మారుమూల ప్రాంతం. సుమారు 200 జనాభా కలిగిన ఈ తండాలో వ్యవసాయమే జీవనాధారం. 

22రోజులుగా..
గడిచిన 22 రోజులుగా రోజూ తండాలోని ఒకటి, లేదా రెండు ఇళ్లలో దస్తులు, గడ్డివాములు, పశువుల కొట్టాలు కాలిపోవడం పరిపాటిగా మారింది. మొదట్లో ప్రమాదం అనుకున్నా.. నిత్య ఘటనలతో తండావాసులు ఆందోళన చెందుతున్నారు.పోలీసులను ఆశ్రయించినా.. ఊరంతా కాపలాగా ఉన్నా.. ప్రమాదాలకు ఆగడం లేదు. రెండు, మూడు సందర్భాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేసినా ఘటనలు ఆగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

మంత్రగాడిని పిలిపించి..
గిరిజనులు మాత్రం తండాకు ఎవరో ఏమో చేశారని, అందుకే ఈ అరిష్టాలు జరుగుతున్నాయని బలంగా నమ్ముతున్నారు. ఇటీవల తండాకు ఓ మంత్రగాడిని పిలిపించి రూ.70 వేలు, మూడు యాటపోతులు ముట్టచెప్పి బాగు చేయించాలని కోరారు. అయితే, ఆ మంత్రగాడు చేసిన పూజల రోజు మినహా మిగతా రోజుల్లో ప్రమాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా, మరో పెద్ద మంత్రగాడిని తీసుకువచ్చి బాగు చేయించుకోవాలనే ఆలోచనలో గిరిజనం ఉన్నట్లు తెలిసింది. కాగా, పోలీసులు మాత్రం ఇదీ.. కావాలనే ఎవరో చేస్తున్నారని, మిస్టరీని త్వరలోనే ఛేదిస్తామని అంటున్నారు. 

భయం..భయంగా ఉంది 
రోజు ఏదో ఓ ఇంట్లో బట్టలు కాలిపోతున్నాయి.. ఈ ఘటనలో భయం..భయంగా గడుపుతున్నాం. కొందరు బట్టలు ఇంటిబయట వేసి కాపలా ఉంటున్నారు. మనుషులు చేస్తున్నారా లేదా మరేదైనా కారణం ఉందా అని అధికారులు తేల్చాలి. 
– మూనావత్‌ శిరీషా, తండావాసి

ఏ క్షణం.. ఏం జరుగుతుందోనని 
గడ్డివాములు తగలబడుతుండడం, ఏదో ఓ చోట మంటలు వ్యాపించడం లాంటి ఘటనలతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. పోలీసు అధికారులు నిఘా పెట్టి తండావాసుల్లో ధైర్యం నింపాలి.
– మూనావత్‌ లాలు, తండావాసికాపలా ఉంటున్నాం 
వింత ఘటనతో తండావాసులు భయాందోళన­కు గురవుతున్నారు. ఎవరైనా వ్యక్తులు ఉద్దేశపూర్వ­కంగా ఇలాంటి ఘటనలకు పాల్పడుతూ భయాందోళనకు గురి చేస్తున్నారా అనే కోణంలో వి­చారణ జరపాలి. ఇప్పటికే తండాలో కాపలా కా­స్తున్నాం. అయినా ఈ వింత ఘటనలు ఆగడం లేదు.
– బొల్లు అలివేలు, సర్పంచ్‌

మరిన్ని వార్తలు