తండ్రి ఇబ్బందులను అధిగమించే ఆలోచన

8 Dec, 2020 09:29 IST|Sakshi
ప్రాజెక్టును తయారు చేస్తున్న విద్యార్థినులు

సాక్షి, నల్లగొండ :  ఆ విద్యార్థిని తన తండ్రి పడుతున్న ఇబ్బంది తొలగించేందుకు హైడ్రాలిక్‌ లిఫ్టింగ్‌ వీల్‌చైర్‌ ఆలోచన చేసింది. ఈ ఆలోచనను రాష్ట్రస్థాయికి పంపగా.. నచ్చడంతో దానికి సంబంధించి ప్రాజెక్టు తయారు చేసేందుకు ఇంక్విలాబ్‌ ఫౌండేషన్‌.. తమ ప్రతినిధులు అశోక్, షమీర్‌ను నల్లగొండకు పంపింది. వారి సూచనల మేరకు జిల్లా సైన్స్‌ అధికారి, గైడ్‌ టీచర్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టును తయారు చేయిస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు రాష్ట్రస్థాయి స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌కు ఎంపికైంది. రాష్ట్రంనుంచి మొత్తం 25 ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో నల్లగొండ బాలికల పాఠశాల విద్యార్థిని తయారు చేసిన హైడ్రాలిక్‌ లిఫ్టింగ్‌ వీల్‌చైర్‌ ప్రాజెక్టు ఒకటి. ఆ ప్రాజెక్టు ఖర్చు ఇంక్విలాబ్‌ ఫౌండేషనే భరించనుంది. ఈ ప్రాజెక్టును 19వ తేదీన వీడియో క్లిప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో ప్రదర్శించాల్సి ఉంటుంది.

జిల్లానుంచి 370 ఆలోచనలు
తెలంగాణ ప్రభుత్వం స్కూల్‌ ఇన్నోవేషన్‌ చాలెంజ్‌ పేరుతో విద్యార్థుల్లో కలిగే ఆలోచనల మేరకు ప్రాజెక్టుల తయారీకి ఏటా ప్రతిపాదనలు కోరుతోంది. యూనిసెఫ్, ఇంక్విలాబ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయిలో 9వ తరగతి నుంచి విద్యార్థులు వారి ప్రాంతంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సంబంధించిన ఆలోచనను మాత్రమే స్వీకరిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కొత్తగా వచ్చే ఆలోచనలు పంపించాలని కోరగా నల్లగొండ నుంచి 280 పాఠశాల నుంచి 370 ఆలోచనలను జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో పంపించారు.

తండ్రి పడుతున్న సమస్యతో వచ్చిన ఆలోచన..
నల్లగొండ ప్రభుత్వ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బషీరా తన తండ్రి పక్షవాతం కారణంగా కాలు చేయి పని చేయని పరిస్థితి. దానివల్ల తండ్రి ఇంట్లో ఏమీ తన సొంతంగా చేసుకోలేకపోయేవాడు. దీని పరిష్కారానికి ఆ బాలికకు ఓ ఆలోచన వచ్చింది. హైడ్రాలిక్‌ లిఫ్టింగ్‌ చైర్‌ వీల్‌ చైర్‌తో బటన్‌ నొక్కితే చైర్‌ ఎత్తులోకి లేవడం పైన ఉన్న వస్తువులను అందుకోవడం, వీల్‌చైర్‌తో ఇంట్లో సొంతంగా తిరగ గలగడం, తన పనులు తానే చేసుకోగలుగుతాడని ఆ బాలిక భావించి తన ఆలోచనను పాఠశాలలోని గైడ్‌ టీచర్‌ పూర్ణిమకు చెప్పింది. ఆమె వెంటనే ముగ్గురిని టీమ్‌గా ఏర్పాటు చేసి ఆ ప్రాజెక్టు ఎలా ఉంటుందో తయారు చేసి ఆ ఆలోచన వీడియో రూపంలో రాష్ట్రస్థాయికి పంపారు. అయితే రాష్ట్రంలో 7,093 ఐడియాలు వివిధ సమస్యలపై వచ్చాయి. రౌండ్ల వారీగా ఎంపిక చేయగా.. చివరకు 25 ప్రాజెక్టులను మూడో రౌండ్‌లో ఎంపిక చేశారు. ఈ 25లో నల్లగొండ విద్యార్థిని ప్రాజెక్టు ఉండడంతో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19న హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్టును ప్రదర్శిస్తారు. 25 ప్రాజెక్టుల్లో 10 ప్రాజెక్టులను గ్రాండ్‌ ఫినాలేకు ఎంపిక చేయనున్నారు.

హైడ్రాలిక్‌ లిఫ్టింగ్‌ వీల్‌చైర్‌ నమూనా
రాష్ట్రస్థాయికి ఎంపిక సంతోషకరం 
నల్లగొండ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థినికి వచ్చిన హైడ్రాలిక్‌ లిఫ్టింగ్‌ వీల్‌ చైర్‌ ఆలోచన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. రాష్ట్రస్థాయికి 7 వేల పైచిలకు ప్రాజెక్టులు పంపితే అందులో 25 ఎంపిక చేస్తే అందులో జిల్లా ప్రాజెక్టు ఉంది. ప్రాజెక్టు తయారు చేసిన విద్యార్థిని, సైన్స్‌ అధికారి, గైడ్‌ టీచర్‌కు అభినందనలు. – భిక్షపతి, డీఈఓ

మరిన్ని వార్తలు