Nalgonda: పొలం తవ్వుతుండగా గుప్త నిధులు

30 Dec, 2021 08:38 IST|Sakshi

సాక్షి, రామన్నపేట(నల్లగొండ): మండలంలోని కుంకుడుపాముల గ్రామంలో ఓ రైతు పొలంలో గుప్తనిధులు లభ్యమైన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కుంకుడుపాముల గ్రామానికి చెందిన కన్నెబోయిన మల్లయ్య సర్వే నంబర్‌లు 16, 17లోని తన పొలంలో వారం రోజుల క్రితం గట్లు తీస్తుండగా మట్టిపాత్ర(గురిగి), చిన్న ఇనుపపెట్టె కనిపించాయి.

మట్టిపాత్రలో 38 వెండి నాణేలు, 5 వెండి పట్టీలు, 14 వెండి రింగులు(విరిగినవి) లభ్యమయ్యాయి. ఇనుప పెట్టెలో 19 బంగారు బిళ్లలు(పుస్తెలతాడుకు ఉండేవి) ఐదు బంగారు గుండ్లు ఉన్నాయి. వెండి నాణేలపై ఉర్దూ పదాలు ఉన్నాయి. కాగా మల్లయ్య తీసిన గట్టును ఆనుకొని అతడి సోదరుడు లింగయ్య పొలం ఉంటుంది. అందులో నాటు వేసేందుకు వచ్చిన కూలీలు వాటిని తలా ఒకటి తీసుకోవడానికి చేతిలో పట్టుకున్నారు.

అదే సమయంలో ఒక మహిళ పూనకం వచ్చినట్టు ఊగి వాటిని ముట్టుకుంటే అరిష్టమని పలుకడంతో వారంతా నాణేలు, బంగారు ఆభరణాలను తిరిగి ఇచ్చారు. పొలంలో లభ్యమైన నిధిని మల్లయ్య ఇంటి వద్ద గల పెంటకుప్పలో దాచాడు. విషయం తెలుసుకున్న అతడి సోదరుడు లింగయ్య ఇద్దరి మధ్య ఉన్న పొలంగట్టులో దొరికింది కాబట్టి తనకు వాటా కావాలని డిమాండ్‌ చేశాడు.  వరినాట్లు ముగిసిన రెండురోజుల అనంతరం సోదరులిద్దరు గ్రామంలోని ఓ పెద్దమనిషిని ఆశ్రయించారు.

సమానంగా పంచుకోవాలని పెద్దమనిషి సలహా ఇచ్చాడు. వాటిని పంచుకునే విషయంలో అన్నదమ్ములిద్దరికీ తేడా వచ్చింది. దీంతో మల్లయ్య మంగళవారం తనకు పొలంలో దొరికిన గుప్తనిధిని రామన్నపేట పోలీసులకు అప్పజెప్పాడు. గుప్తనిధి వివరాలను రెవెన్యూ అధికారులకు అందించామని, గురువారం వారికి అందజేయనున్నట్లు సీఐ చింతా మోతీరాం తెలిపారు. 

చదవండి: మరో ఆసక్తికర పరిణామం.. జిరాక్స్‌ తీస్తే కొంపలు అంటుకుంటాయ్‌..!?

మరిన్ని వార్తలు