హైడ్రోజన్‌ కారుకు పేటెంట్‌.. మిర్యాలగూడ వాసి పరిశోధనకు దక్కిన గౌరవం

31 Oct, 2022 02:27 IST|Sakshi
హైడ్రోజన్‌ సాయంతో నడిచే కారు యంత్రం, పూర్ణ మల్లికార్జున్‌రావు  

ప్రభుత్వం ముందుకొస్తే ప్రాజెక్టును అప్పగిస్తానంటున్న పూర్ణమల్లికార్జున్‌రావు 

మిర్యాలగూడ: పెట్రోల్, డీజిల్‌ కారుకు నీటిలోని హైడ్రోజన్‌ సాయంతో మైలేజీ పెంచేలా తాను రూపొందించిన యంత్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పేటెంట్‌ లభించినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌రిటైర్డ్‌ ఉద్యో­గి కాశీనాథుని పూర్ణమల్లికార్జున్‌రావు తెలిపారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఆదివారం ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏడేళ్లు శ్రమించి నీటినుంచి హైడ్రోజన్‌ను వేరు చేసి కారు ఇంజన్‌కు అందించే సాంకేతికతను అభివృద్ధి చేశానన్నారు. 2021, జూన్‌ 6న కేంద్ర ప్రభుత్వ పేటెంట్‌ సంస్థకు దరఖాస్తు చేయగా పలు దశల్లో ఇంజనీర్లు పరిశీలించి ఈ నెల 27న పేటెంట్‌ పత్రం మంజూరు చేశారని చెప్పారు.  

యంత్రం పనితీరు ఇలా.. 
డీజిల్, పెట్రోల్‌ కార్లకు రూ.10 వేల వ్యయంతో నీటి నుంచి హైడ్రోజన్‌ను వేరుచేసే యంత్రాన్ని అమర్చి ఇంజన్‌కు అనుసంధానిస్తారు. కారు ఆన్‌ చేయగానే ఆటోమేటిక్‌గా ఈ యంత్రం పనిచేయడం ప్రారంభమవుతుంది. యంత్రం నీటి ట్యాంకులోని హైడ్రోజన్‌ను వేరు చేస్తుంది. అది ఇంజిన్‌లోకి వెళ్లి కారు ముందుకు వెళ్లేందుకు సాయం చేస్తుంది. దీంతో డీజిల్, పెట్రోల్‌ కార్లకు అదనంగా 10 కి.మీ. మైలేజీ పెరుగుతుంది. తన కారుకు యంత్రాన్ని అమర్చి ఏడాదికిపైగా పరిశీలిస్తున్నట్లు పూర్ణమల్లికార్జున్‌రావు తెలిపారు. పెరిగిపోతున్న ఇంధన ఖర్చులు తగ్గించుకునేందుకు ఈ యంత్రం ఉపయోగపడుతుందన్నారు. ప్రభుత్వం మందుకొస్తే తన ప్రాజెక్టును అందిస్తానన్నారు.

మరిన్ని వార్తలు