ఆమె కేవలం నవీన్‌కు ఫ్రెండ్‌ అంతే!.. నేరాంగీకారంలో షాకింగ్‌ విషయాలు చెప్పిన హరిహర కృష్ణ

25 Feb, 2023 15:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నల్లగొండ ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విద్యార్థి నవీన్‌ దారుణ హత్యోదంతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. తాను ప్రేమించిన అమ్మాయితో.. చనువుగా ఉండటం భరించలేకే స్నేహితుడిని దారుణంగా హతమార్చినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు నిందితుడు హరిహర కృష్ణ. అయితే స్నేహితుడే తన కొడుకుపై ఇంతటి ఘాతుకానికి పాల్పడతాడని ఊహించలేదని నవీన్‌ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షి టీవీతో మృతుడు నవీన్‌ తండ్రి శంకర్‌ నాయక్‌ పోలీసులతో మాట్లాడుతూ.. 

గెట్ టు గెదర్ పేరుతో నా కొడుకుని పిలిచి హత్య చేశాడు.  కాకపోతే.. హరిహర కృష్ణ పద్ధతి నచ్చక ఆ అమ్మాయి దూరం అయిందని అంతా చెప్తున్నారు. మా అబ్బాయి నవీన్ ఆ అమ్మాయితో ప్రేమలో లేడు. వాళ్లిద్దరూ కేవలం స్నేహితులే.  నవీన్‌కు ఆ అమ్మాయి దగ్గర అవుతుందేమో అనే అనుమానంతోనే హత్య చేశాడు. ఈ హత్యలో ఆ అమ్మాయి ప్రేమేయం ఉందో, లేదో కూడా మాకు తెలియదు అని చెప్పారాయన. ఏది ఏమైనా తమ బిడ్డను పొట్టనబెట్టుకున్న వాడిని కఠినంగా శిక్షించాలి అని కోరుతోంది బాధిత కుటుంబం. 

ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై  అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీలో పూర్తి సమాచారం పొందుపరిచారు. నిందితుడు పేరాల హరిహర కృష్ణ, మలక్‌పేట పరిధిలోని మూసారాంబాగ్‌కు చెందినవాడు. నిందితుడు తనంతట తానే పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. నేరాన్ని అంగీకరించే సమయంలో అతనిచ్చిన స్టేట్‌మెంట్‌ ఇలా ఉంది. 

నవీన్ , నేను దిల్‌షుక్‌ నగర్లో ఇంటర్మీడియట్ కలిసి చదువుకున్నాం. ఆ సమయంలో నేను ఒక స్నేహితురాలిని ప్రేమించా. కొన్ని కారణాల వల్ల ఆమె నాకు దూరం అయ్యింది. కానీ, నవీన్‌ దానిని తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆమెను ప్రేమించాడు!. ఆ అమ్మాయి కూడా నవీన్‌తో సన్నిహితంగా మెలిగింది. వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని తట్టుకోలేక.. మూడు నెలల కిందట నవీన్‌ను చంపాలని నిర్ణయించుకున్నా. కొద్దీ రోజుల్లోనే బీటెక్ పూర్తి చేసుకొని హైదరాబాద్ కి నవీన్ కోచింగ్ రాబోతున్నట్లు తెలుసుకున్నా. హైదరాబాద్ వస్తే నా లవర్‌కు మరింత దగ్గర అవుతాడేమో అనిపించింది. అందుకే టైం కోసం ఎదురు చూశా.

ఫిబ్రవరి 17వ తేదీన.. నేనూ, నవీన్‌ ఎల్‌బీ నగర్‌లో కలుసుకున్నాం. కాసేపు అలా తిరిగాం. ఆ తర్వాత మూసారాంబాగ్‌లోని మా ఇంటికి వెళ్లాం. రాత్రి కాగానే.. తాను హాస్టల్‌ వెళ్తానని చెప్పాడు. దీంతో బైక్‌పై ఇద్దరం బయల్దేరాం. పెద్ద అంబర్‌పేటకు చేరుకోగానే మా ఇద్దరి మధ్య ఆ యువతి విషయమై గొడవ మొదలైంది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. కత్తితో దాడి చేశా.  నవీన్‌ను చంపేసి ప్రైవేట్‌ భాగం, గుండె, తన, చేతి వేళ్లు, చేతులు.. అన్నింటిని కత్తితో వేరు చేసి.. అక్కడి నుంచి పరారయ్యాను. విజయవాడ హైవే పక్కన పడేశాను..

ఇది ఈ కేసులో నిందితుడు హరిహర కృష్ణ పోలీసుల ముందు ఒప్పుకున్న విషయాలు. ఈ మేరకు విషయాలన్ని ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు స్నేహితులు. నిందితుడు హరిహర కృష్ణ పై సెక్షన్ 302, 201 ఐపీసీ , 5(2) (V) , SC ,St, POA act 2015 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఇక.. తన మీదకు అనుమానం రాకూడదనే ఉద్దేశంతో ఘటన తర్వాత నవీన్‌ స్నేహితులకు కాల్‌ చేశాడు హరి. నవీన్‌ మొబైల్‌ స్విచ్ఛాఫ్‌ వస్తోందని డ్రామాలాడాడు. 

అమ్మాయి పాత్రపై విచారణ చేపట్టాం
అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన నవీన్ హత్య కేసుపై సాక్షీ టీవీ తో ఎల్బీనగర్ డీసీపి సాయి శ్రీ మాట్లాడారు. నల్గొండ ఎంజీ యూనివర్సిటీ కి చెందిన నవీన్ హత్య కేసులో దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటికే నిందితుడు హరిహరకృష్ణ ను అరెస్ట్ చేశాము. సాంకేతిక ఆధారాలతో కేసును విచారణ చేస్తున్నాము . హత్యలో ఎవరెవరు పాల్గొన్నారనేది తేలాల్సి ఉంది. ఇది ఒక పథకం ప్రకారం చేసిన హత్య గా స్పష్టమైంది. నవీన్ ను అతి కిరాతకంగా పొడిచి చంపిన నిందితుడు హరిహరకృష్ణ. ఇందులో అమ్మాయి పాత్ర ఎంత వరకు ఉందో తేల్చాల్సి ఉంది. నవీన్ , హరిహరకృష్ణ ఇద్దరూ మంచి స్నేహితులు అని తెలిపారాయన.

ఒత్తిడి తట్టుకోలేకే..
నేనావత్‌ నవీన్‌ది నాగర్‌కర్నూల్‌ జిల్లా చారుకొండ మండలం సిరిసనగండ్ల గ్రామం. నల్గొండలోని ఎంజీ యూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ (ఈఈఈ) నాలుగో ఏడాది చదువుతున్నాడు. నాలుగు రోజులైనా కళాశాలకు, ఇంటికి నవీన్‌ రాకపోవడంతో ఈ నెల 22న తండ్రి శంకర్‌ నాయక్‌ నార్కట్‌పల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నార్కట్‌పల్లి ఎస్సై రామకృష్ణ ఎంజీయూలో విద్యార్థులను, హరి స్నేహితులను విచారించారు. అయితే.. అదేరోజు సాయంత్రం నుంచి హరి ఫోన్‌ స్విఛ్చాఫ్‌ రావడంతో వారి తల్లిదండ్రులను పోలీసులు పిలిపించి అతని గురించి వాకబు చేశారు. కుటుంబ సభ్యులు, పోలీసులు, స్నేహితుల నుంచి ఒత్తిడి పెరగడంతో హరి శుక్రవారం రాత్రి అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు హరిహర కృష్ణ.

మరిన్ని వార్తలు