రోడ్డు ప్రమాదంలో ఎంపీటీసీ దంపతుల మృతి 

2 Sep, 2021 07:51 IST|Sakshi
కవిత, ఆమె భర్త వేణుగోపాల్‌రెడ్డి(ఫైల్‌)

టిప్పర్‌ను వెనుకనుంచి ఢీ కొట్టిన స్కార్పియో

నల్లగొండ నుంచి వస్తుండగా పెద్దఅంబర్‌పేట్‌ వద్ద ప్రమాదం

సాక్షి, హయత్‌నగర్‌/రామగిరి(నల్లగొండ): రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎంపీటీసీ సభ్యురాలితోపాటు ఆమె భర్త మృతిచెందారు. పోలీసుల కథ నం ప్రకారం నల్లగొండ జిల్లా అనిశెట్టి దుప్పలపల్లి చెంది న దొంతం కవిత (40) తిప్పర్తి మండలంలోని థానేదార్‌పల్లి ఎంపీటీసీగా పనిచేస్తున్నారు. ఆమె భర్త వేణుగోపాల్‌రెడ్డి(52) బిల్డర్‌. హైదరాబాద్‌లో మన్సూరాబాద్‌లోని సహారా ఎస్టేట్‌ సమీపంలో వీరు ఉంటున్నారు. కూతురు వివాహంకోసం ఇటీవల నల్లగొండ విద్యానగర్‌లో ఉన్న తమ మరో ఇంటికి వెళ్లారు.

అక్కడ పెళ్లి కార్యక్రమాలు పూర్తయ్యాక మంగళవారం తిరిగి హైదరాబాద్‌లోని నివాసానికి వచ్చేందుకు రాత్రి 8.30 గంటలకు స్కార్పియో వాహనంలో బయలుదేరారు. రాత్రి 10.40 గంటల సమయంలో పెద్ద అంబర్‌పేట్‌లోని ఔటర్‌ రింగురోడ్డు దాటగానే మలుపు వద్ద ముందుగా వెళుతున్న టిప్పర్‌ డ్రైవర్‌ సడెన్‌ బ్రేకు వేశాడు. దీంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఈ దంపతుల వాహనం టిప్పర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కవిత, ఆమె భర్త వేణుగోపాల్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు.
చదవండి: పబ్‌లో చిన్నారి డాన్స్‌ వైరల్‌.. పోలీసులు సీరియస్‌ 


పాడె మోస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

టిప్పర్‌ కింద ఇరుక్కుపోయిన వాహనం.. 
టిప్పర్‌ను స్కార్పియో వాహనం వెనుకనుంచి వేగంగా ఢీ కొట్టడంతో టిప్పర్‌ కింద ఇరుక్కుని స్కార్పియో ముందుభాగం నుజ్జునుజ్జు అయింది. కారులో ఉన్న వారిని బయటకు తీసేందుకు పోలీసులు చాలాసేపు శ్రమించాల్సి వచ్చిందని, అప్పటికే వారు మృతి చెందారని స్థానికులు తెలిపారు.

కూతురి వివాహం.. అంతలోనే విషాదం 
కవిత, వేణుగోపాల్‌రెడ్డి దంపతులకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తుండగా ఎంబీబీఎస్‌ చదివిన కూతురుకు ఆగస్టు 20న వివాహం జరిపించారు. పెళ్లి కార్యక్రమాలు పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్‌ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భార్యాభర్తలు ఒకేసారి మృతి చెందడం అందరిని కలచి వేసింది. బుధవారం మృతుల అంత్యక్రియలు వారి స్వగ్రామం తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లిలో జరిగాయి. అంతిమయాత్రలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొని పాడె మోశారు. శాసనమండలి మాజీ చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తదితరులు మృతులకు నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు