నల్లగొండ: షీ టీమ్‌ వేధింపుల వల్లే.. శివ మృతిపై తాస్కాని గూడెంలో తీవ్ర ఉద్రిక్తత

15 Apr, 2023 20:46 IST|Sakshi

సాక్షి, నల్లగొండ:  చండూర్ మండల పరిధిలోని తాస్కాని గూడెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోగా.. పోలీసుల వేధింపుల వల్లే చనిపోయాడంటూ అతని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో.. శుక్రవారం సాయంత్రం పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ నెలకొంది.  

గ్రామానికి చెందిన ఓ యువతిని అబ్బనబోయిన శివ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. యువతి తల్లి షీ టీమ్‌ పోలీసులను ఆశ్రయించడంతో.. అతన్ని పిలిపించుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చారు పోలీసులు. అనంతరం ఇంటికి చేరుకుని పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు శివ. దీంతో ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే.. 
 
పోలీసుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నాడంటూ కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు. కౌన్సిలింగ్‌ పేరుతో శివను కొట్టారని, ఆ మనస్తాపంతోనే శివ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆగ్రహంతో రగిలిపోయారు బంధువులు, గ్రామస్తులు. ఈ క్రమంలో.. శివ మృతదేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించగా..  ఆ మృతదేహాంతో ఆ అమ్మాయి ఇంటి ఎదుట నిరసన వ్యక్తం చేసేందుకు శివ కుటుంబ సభ్యులు యత్నించారు.

ఆ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరగ్గా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులపై కారం పొడి చల్లి దాడికి దిగారు మృతుడి బంధువులు.  షీటీమ్ సీఐ రాజశేఖర్‌పై శివ సోదరి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు