TSPSC పేపర్‌ లీక్‌ కేసులో ఇద్దరికి ఈడీ కస్టడీ.. జైల్లోనే విచారణకు అనుమతి

15 Apr, 2023 18:51 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ పేపర్ల లీక్‌ వ్యవహారంలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పేపర్‌ లీక్‌ కేసులో ఇద్దరు నిందితులను కస్టడీకి తీసుకునేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి అనుమతి లభించింది. రెండు రోజులపాటు వాళ్లను కస్టడీకిలోకి తీసుకుని విచారించొచ్చని కోర్టు ఈడీ అధికారులకు తెలిపింది.

కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్‌, రాజశేఖర్‌లను ఈడీ ప్రశ్నించేందుకు అనుమతించింది నాంపల్లి కోర్టు. ఈ మేరకు ఈ నెల 17, 18 తేదీల్లో.. అదీ  చంచల్‌గూడ జైల్లోనే ఇద్దరిని ప్రశ్నించాలని కోర్టు ఆదేశించింది. జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న ప్రవీణ్‌, రాజశేఖర్‌ల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు అనుమతించాలంటూ నాంపల్లిలోని ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఈడీ. 

ఈ మేరకు జైల్లోనే నిందితులను విచారించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేలా జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరింది. ఆ విజ్ఞప్తికి కోర్టు అనుకూలంగా ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. 

మరిన్ని వార్తలు