కమ్యూనిస్టులే సాయుధ పోరాట వారసులు 

27 Sep, 2021 03:10 IST|Sakshi
పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కె.నారాయణ తదితరులు 

సీపీఐ, సీపీఎం నేతలు కె.నారాయణ, సారంపల్లి మల్లారెడ్డి 

హఫీజ్‌పేట్‌ (హైదరాబాద్‌): తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఐ, సీపీఎం జాతీయ నాయకులు డాక్టర్‌ కె.నారాయణ, సారంపల్లి మల్లారెడ్డిలు అన్నారు. ఆదివారం కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌లో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఎస్‌.సుగుణ రచించిన పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నవాబు, దొరల పాలనకు వ్యతిరేకంగా పేద, కార్మిక, కర్షక, కళాకారులు ఏకమై మహత్తరమైన పోరాటం చేశారన్నారు.

ఆనా టి ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యం లో ఈ సాయుధ పోరాటం జరిగిందన్నారు. అయి తే అప్పటి పోరాటంతో ఎలాంటి సంబంధంలేని బీజేపీ, దానిని కేవలం హిందూ, ముస్లింల మధ్య గొడవగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణలో వేల ఎకరాల భూమిని దొరల నుంచి లాక్కుని పేద ప్రజలకు ఇచ్చిన చరిత్ర ఎర్రజెండాకు మాత్రమే ఉందన్నారు. కేంద్రం లోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలు ప రస్పరం సహకరించుకుంటూ.. పేదలపై భారం మోపే లా పాలన కొనసాగస్తున్నాయన్నారు.

కేం ద్రం.. ప్రభుత్వరంగ సంస్థలు అమ్ముతుంటే.. టీఆర్‌ఎస్‌ సర్కారు రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మేస్తోందని విమర్శించారు. సీఆర్‌ ఫౌండేషన్‌ గౌరవ అధ్యక్షుడు, సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అనారోగ్య కారణంగా సభకు హాజరు కానందున ఆయన సందేశాన్ని యూ ట్యూబ్‌ ద్వారా అందించారు. ఈ కార్యక్రమంలో తెలుగు వర్సిటీ మాజీ వీసీ ఆవుల మంజులత, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం రాçష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు, రఘుపాల్, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు