షార్ట్‌ ఫిలింతో అదరగొట్టారు.. నూకలంపాడు గ్రామానికి జాతీయ అవార్డు

24 Sep, 2022 13:20 IST|Sakshi

ఏన్కూరు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు మండలానికి చెందిన నూకలంపాడు గ్రామం జాతీయ స్థాయిలో సత్తా చాటింది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులతో రూపొందించిన లఘుచిత్రం (షార్ట్‌ ఫిలిం) జాతీయ స్థాయిలో రెండో బహుమతి గెలుచుకుంది. ఈ మేరకు వచ్చే నెల 2వ తేదీన ఢిల్లీలో జరిగే జాతీయ స్వచ్ఛతా దివస్‌ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గ్రామ సర్పంచ్‌ ఇంజం శేషయ్య అవార్డు అందకోనున్నారు. ఏటా స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) ఫేస్‌–2లో భాగంగా ఓడీఎఫ్‌ ప్లస్‌ విభాగంలో గ్రామపంచాయతీల్లో మరుగుదొడ్ల వాడకం, ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ, తదితర అంశాలపై జాతీయ స్థాయిలో లఘుచిత్రాల పోటీలు నిర్వహిస్తారు. గత ఏడాది జిల్లాలోని ముదిగొండ మండలం పమ్మి పంచాయితీ ఎంపికైంది. ఈ ఏడాది ఏన్కూరు మండలం నూకలంపాడు పంచాయతీ ఎంపిక కావడం విశేషం. 

అందరి సహకారంతో..
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి వెనుక సర్పంచ్‌ ఇంజం శేషయ్య ప్రధాన పాత్ర పోషించారు. గ్రామంలోని ప్రజలందరినీ కుటుంబ సభ్యులుగా భావించి గ్రామాభివృద్ధి వైపు నడిపించారు. ఇప్పటికే గ్రామంలో 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం, వాడకం జరుగుతుండగా, వ్యక్తిగత పరిశుభ్రత, తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తున్నారు. తడి చెత్తను ఎరువుగా మార్చడం, పొడి చెత్తను విక్రయిస్తుండడంతో పంచాయతీకి అదనపు ఆదాయం సమకూరుతోంది. అలాగే, గ్రామంలో ప్లాస్టిక్‌ నిషేధాన్ని పక్కాగా అమలుచేస్తున్నారు. ఇలా గ్రామాభివృద్ధి, ఇక్కడ అమలు చేస్తున్న పనులతో రూపొందించిన లఘుచిత్రం జాతీయ స్థాయిలోనే రెండో స్థానంలో నిలిచింది.

అప్పుడు ఉపసర్పంచ్‌.. ఇప్పుడు సర్పంచ్‌
నూకలంపాడు గ్రామపంచాయితీలో 1,260 మంది జనాభా, 950 మంది ఓటర్లు ఉన్నారు. ఏజెన్సీ మండలం అయినందున ఎస్టీ అభ్యర్థిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలి. కానీ ఎస్టీలు లేకపోవడంతో ఎనిమిది వార్డులకు గాను నాలుగు వార్డులకే ఎన్నిక నిర్వహిస్తారు. గత ఎన్నికలో నాలుగు వార్డులకు గాను మూడు వార్డులు గెలిచిన పార్టీ అభ్యర్థిని ఉపసర్పంచ్‌గా ఎన్నుకోగా, ఆయనే సర్పంచ్‌గా విధులు నిర్వర్తించారు. ఇక 2019 ఎన్నికల్లో నాలుగు వార్డులకు రెండు పార్టీల అభ్యర్థులు రెండేసి వార్డులు గెలుచుకున్నారు. ఈ మేరకు లాటరీ పద్ధతిలో సర్పంచ్‌ను ఎన్నుకోగా ఇంజం శేషయ్యకు అవకాశం దక్కింది. గతంలో ఉపసర్పంచ్‌గా అనుభవం ఉండడంతో ఇంజం శేషయ్య గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తిచేయడమే కాక సొంత ఖర్చుతో గ్రామంలో బోర్లు, రహదారులు, కాల్వ రోడ్డుకు గ్రావెల్‌ తోలకం చేపట్టారు. ఇంకా వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, రోడ్ల వెంట మొక్కలు నాటించడంతో గ్రామం పచ్చగా కళకళలాడుతోంది. 

అందరూ ఆదర్శంగా తీసుకోవాలి
జాతీయస్థాయిలో ఉత్తమ లఘుచిత్రం అవార్డు సాధించిన నూకలంపాడు గ్రామాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యారాములు సూచించారు. నూకలంపాడు గ్రామాన్ని శుక్రవారం సందర్శించిన ఆయన సర్పంచ్‌ ఇంజం శేషయ్య – స్వరూప దంపతులను సత్కరించి మాట్లాడారు. కొన్నేళ్లుగా గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని కితాబిచ్చారు.  

కలెక్టర్‌ అభినందనలు..
ఇక, జాతీయ స్థాయి షార్ట్‌ఫిల్మ్‌ పోటీల్లో రెండో స్థానం దక్కించుకున్న నూకలంపాడు గ్రామపంచాయతీ పాలకవర్గాన్ని కలెక్టర్‌ వీపీ గౌతమ్‌ అభినందించారు. ఈమేరకు సర్పంచ్‌ శేషయ్య, పాలకవర్గం, సిబ్బందిని ఆయన శుక్రవారం సన్మానించి మాట్లాడారు. మిగతా గ్రామాల పాలకవర్గాలు స్ఫూర్తిగా తీసుకుని అవార్డులు సాధించేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ స్నేహలత, డీఆర్‌డీఓ విద్యాచందన, జెడ్పీ సీఈఓ వీవీ అప్పారావు, డీపీఓ హరిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

మాపై బాధ్యత పెరిగింది    
నూకలంపాడు సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నాను. గతంలో జిల్లాస్థాయి అవార్డులు వచ్చినా, ఇప్పుడు జాతీయస్థాయిలో పేరు రావడం ఆనందంగా ఉంది. ఈ అవార్డుతో మాపై ఇంకా బాధ్యత పెరిగినట్లయింది. ఎమ్మెల్యే కేటాయించనున్న నిధులతో డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపడుతాం.
–ఇంజం శేషయ్య, సర్పంచ్‌  

మరిన్ని వార్తలు