కడుపు కోయకుండా కాన్పు చేయరు!

17 Dec, 2020 02:36 IST|Sakshi

కరీంనగర్‌ జిల్లాలో 82.4 శాతం సిజేరియన్లే

తక్కువగా కొమురంభీం జిల్లాలో 27.2 శాతం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 69.3 శాతం మహిళల్లో రక్తహీనత

తాజాగా వెల్లడించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే  

సాక్షి, హైదరాబాద్‌: అమ్మ పొట్టకు కోత తప్పడం లేదు. సిజేరియన్‌ లేకుండా డాక్టర్లు బిడ్డను బయటకు తీయడంలేదు. రాష్ట్రంలో ఈ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాలో 82.4 శాతం సిజేరియన్‌ ఆపరేషన్లు జరుగుతున్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 తెలిపింది. ఈ మేరకు తాజాగా 31 జిల్లాల వారీగా సర్వే వివరాలను వెల్లడించింది. అత్యంత తక్కువగా కొమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 27.2 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని పేర్కొంది. ఇక ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనైతే కరీంనగర్‌ జిల్లాలో ఏకంగా 92.8 శాతం సిజేరియన్‌ ద్వారానే బిడ్డను బయటకు తీస్తున్నారు. ఆ తర్వాత జోగులాంబ గద్వాల జిల్లా ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో 65.8 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిజేరియన్లు అత్యధికంగా జనగామ జిల్లాలో 73 శాతం జరుగుతుండగా, అత్యంత తక్కువగా కొమురంభీం ఆసిఫాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 16.6 శాతం జరుగుతున్నాయి.  

పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం..
రాష్ట్ర ప్రజలను జీవనశైలి వ్యాధులు పట్టిపీడిస్తున్నాయి. ముఖ్యంగా బీపీ, షుగర్‌ వంటి రోగాలతో హైదరాబాద్‌ ప్రజలు సతమతమవుతున్నారు. షుగర్‌ వ్యాధితో హైదరాబాద్‌లో 26.8 శాతం మంది పురుషులు బాధపడుతుండగా, మహిళల్లో 21.2 శాతం మంది మధుమేహంతో ఇబ్బందిపడుతున్నారు. అత్యంత తక్కువగా కొమ్రంభీం జిల్లాలో పురుషులు 11.6 శాతం, మహిళలు 8.4 శాతం మంది షుగర్‌ వ్యాధికి గురయ్యారు. అధిక రక్తపోటుతోనూ హైదరాబాద్‌ జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇక్కడి పురుషుల్లో 41.7 శాతం మంది, మహిళల్లో 30.2 శాతం మంది బీపీతో బాధపడుతున్నారు.

అత్యంత తక్కువగా నల్లగొండ జిల్లాలో పురుషులు 25.7 శాతం, మహిళలు 19.6 శాతం మంది బీపీకి గురయ్యారు. ఇక రాష్ట్రంలో ఐదేళ్లలోపు పిల్లల్లోనూ ఊబకాయం పెరుగుతోంది. అత్యధికంగా జనగామ జిల్లాలో 6.4 శాతం మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. తర్వాత జగిత్యాల జిల్లాలో 5.5 శాతం, హైదరాబాద్‌ పిల్లల్లో 4.3 శాతం, భద్రాద్రి కొత్తగూడెంలో 3.7 శాతం, ఆదిలాబాద్‌లో 2.9 శాతం, జయశంకర్‌ భూపాలపల్లిలో 1.4 శాతం, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 1.2 శాతం, మెదక్‌ జిల్లాలో 1.1 శాతం, వికారాబాద్‌ జిల్లాలో 0.8 శాతం పిల్లల్లో ఊబకాయం సమస్య ఉంది.  

మరిన్ని వార్తలు