వాళ్లు సమాజానికి మూలస్తంభాలు

24 Jan, 2021 12:59 IST|Sakshi

ఆడపిల్లల్ని కాపాడుకుందాం

సముచిత స్థానం కల్పిద్దాం

ఆధునిక కాలంలోనూ బాలికలపై కొనసాగుతున్న వివక్ష

పథకాలెన్ని ఉన్నా ఫలితాలు అంతంతే..

నేడు జాతీయ బాలిక దినోత్సవం

సిరిసిల్ల‌: ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి మహాలక్ష్మీ అరుదెంచిందని భావిస్తారు. స్త్రీలు పూజించబడిన చోట దేవతలు నివసిస్తారంటారు. నవీన మానవ సమాజంలో మాత్రం ఇంకా ఆడపిల్లలకు సముచిత స్థానం లేదనడం అతిశయోక్తి కాదు. దేశంలో ప్రతీ 1,000 మంది పురుషులకు 943 మంది మహిళలు మాత్రమే ఉన్నారంటే పరిస్థితిని అంచనా వేయొచ్చు. సభ్య సమాజానికి మూల బిందువైన ఆడపిల్లలను గర్భంలో ఉన్నప్పుడు తుంచేయడం, భ్రూణ హత్యలకు పాశవికంగా పాల్పడడం వంటి చర్యలు ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయేందుకు కారణమవుతున్నాయి. ప్రతీ వ్యవస్థలోనూ పురుషుడికే అగ్రపీఠం ఇవ్వడం వల్ల మహిళలు నిరాదరణకు గురవుతున్నారు. లింగ నిష్పత్తి ప్రకారం దేశంలో ప్రతీ 1,000 మంది బాలురకు 1981లో 962 మంది, 1991లో 945 మంది 2011లో 919 మంది బాలికలు ఉన్నారు. ప్రతీ పదేళ్లకు ఈ సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ ఉండడం ప్రమాదస్థితికి దర్పణం పడుతోంది. ఈ లెక్కల ప్రకారం స్త్రీ, పురుష జనాభా నిష్పత్తి సమతూకంలో ఉండడంలో దేశం 41వ స్థానంలో ఉంది. 

బాలిక దినోత్సవం వెనుక..
సనాతన దేశంలో బాలికల పట్ల వివక్షను నిర్మూలించేందుకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏటా జనవరి 24న బాలికా దినోత్సవం జరుపుతోంది. ఆడపిల్లలను చదవనిద్దాం.. ఎదగనిద్దాం అనే నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఆడపిల్లల హక్కులపై అవగాహన కల్పించడం, వారి సామాజిక పురోగతికి అవసరమైన ప్రోత్సాహం, సమానావకాశాలను అందించేలా కృషి చేస్తోంది. స్త్రీలకు ఉన్నత విద్య, ఆరోగ్యం, పోషకాహారం వంటివి అందించే దిశగా పలు ప్రయత్నాలు జరుపుతోంది. పలు పథకాలను రూపొందించి అమలు చేస్తోంది. ప్రత్యేకంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ సారథ్యంలో పలు పథకాలను రూపొందించింది. బేటీ బచావో..బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన పథకాలను అమలు చేస్తోంది. పదేళ్ల లోపు బాలికల పేరిట పోస్టాఫీసులు, బ్యాంకుల్లో ఖాతాలు ప్రారంభించిన వారికి 9.1శాతం వడ్డీని అందిస్తోంది. ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తోంది. దేశంలో ప్రస్తుతం 440జిల్లాల్లో ఈ పథకం అమలులో ఉంది. 

కొనసాగుతున్న వివక్ష..
ఆడపిల్లను లక్ష్మీదేవితో సమానంగా చూసే సభ్య సమాజంలో ఇంకా లింగ వివక్ష కొనసాగుతూ ఉండడం విషాదం. చదువుకొని ఉద్యోగాలు చేయాలా.. ఊళ్లు ఏలాలా అనే ప్రశ్నలతో ఉన్నత విద్యను ఆడపిల్లలకు అందకుండా చేస్తున్నారు. రెండేళ్ల తేడాతో ఉన్న అబ్బాయి, అమ్మాయి ఉన్న ఇంట్లో ఆడపిల్లలను బడి మాన్పించి, అబ్బాయిని చదివించే నిరుపేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్యకు చేరేసరికి ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతూ కనిపించడమే ఇందుకు నిదర్శనం.

భ్రూణహత్యలు..
పెంచి పెద్ద చేయడంతో పాటు కట్నాలిచ్చి పెళ్లి చేయడం భారంగా భావించే కొంత మంది తల్లిదండ్రులు పుట్టబోయేది ఆడ శిశువు అని తెలుసుకుని గర్భంలోనే తుంచేస్తున్నారు. కడుపులో ఉండగానే శిశువు ఆడ, మగ అని నిర్ధారించే స్కానింగ్‌ పరీక్షలను చట్ట పరిధిలో నేరంగా పరిగణిస్తున్నా ఇంకా భ్రూణ హత్యల పరంపర 
కొనసాగుతూనే ఉంది.

బాల్య వివాహాలు..
యుక్త వయసు రాకముందే ఆడపిల్లలకు వివాహాలు చేస్తే భారం తగ్గుతోంది, బాధ్యత తీరుతుంది అని తల్లిదండ్రులు భావించడం కారణంగా బాల్య వివాహాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో అమ్మాయిలకు భద్రత కరువైందన్న భావనతో ఉన్నత చదువులకు దూరంగా ఉంచుతున్నారు. పేదరికం, నిరక్షరాస్యత తదితర కారణాలు కూడా ఆడపిల్లల విషయంలో తల్లిదండ్రుల వివక్షకు కారణమవుతోంది.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో..
జిల్లా ఆవిర్భావం నుంచి సమగ్ర శిశు రక్షణ పథకం ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. జిల్లా కేంద్రంలో ఒక శిశు సంరక్షణ కేంద్రం నిర్వహించబడుతోంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 30 బాల్య వివాహాలను నిలువరించగలిగారు. యుక్త వయసుకు ముందే ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయడం వల్ల కలిగే నష్టాలపై తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆపరేషన్‌ స్మైల్‌ ద్వారా దాదాపు 60 మంది బడి బయటి పిల్లలను గుర్తించారు. మరో 65 మందిని ఆపరేషన్‌ ముస్కాన్‌లో గుర్తించారు. 22 మంది అట్రాసిటీ బాధితులకు నష్ట పరిహారం ఇచ్చారు. 14 మంది అనాథ హెచ్‌ఐవీ బాధితులకు నెలకు రూ.1000 ఆర్థిక సాయం అందిస్తున్నారు.

ఉన్నతంగా  చదివించాలి
లింగ వివక్షను నిర్మూలించే ప్రక్రియ కుటుంబంతోనే ప్రారంభం కావాలి. ఆడపిల్లలను మగ పిల్లలతో సమానంగా చూడాలి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలను కూడా ఉన్నతంగా చదివించాలి. ప్రతీ రంగంలోనూ అమ్మాయిలు ప్రతిభ చాటుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా అందుతున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని అమ్మాయిలు ఎదిగేలా సానుకూల వాతావరణాన్ని సృష్టించాలి.
– సుచరిత, బాల రక్షాభవన్‌ కోఆర్డినేటర్‌

సమాజానికి మూలస్తంభాలు
మానవ సమాజానికి మూలస్తంభాలైన ఆడపిల్లలను చదవనివ్వడం, ఎదగనివ్వడం సమాజం కనీస బాధ్యత. ప్రతీ ఆడపిల్ల స్వయంపోషిత స్థితికి ఎదిగే వరకు వివాహాన్ని వాయిదా వేసుకోగలగాలి. పరాధీన మనస్తత్వంతో పెంచడం మంచిది కాదు. తన కాళ్లమీద తాను నిలబడేంత వరకు అమ్మాయిలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలి.
– రౌతు అలేఖ్యపటేల్, సీడీపీవో, సిరిసిల్ల

మరిన్ని వార్తలు