NTPC: భారత విద్యుత్తేజం ఎన్టీపీసీ

7 Nov, 2021 04:54 IST|Sakshi

ఎన్టీపీసీకి 46 వసంతాలు పూర్తి 

74 విద్యుత్‌ కేంద్రాల ద్వారా 67,657.5 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి 

జ్యోతినగర్‌ (రామగుండం): భారతావనికి వెలుగులు అందిస్తూ విద్యుత్తేజంగా విరాజిల్లుతున్న నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నేటికి 46 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ప్రస్తుతం దేశంలో ఎన్టీపీసీ 74 విద్యుత్‌ కేంద్రాల ద్వారా 67,657.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తోంది. 2032 నాటికి 1,28,000 మెగావాట్ల లక్ష్యంతో నూతన ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తూ ముందుకు సాగుతోంది. 

నవంబర్‌ 7న ‘రైజింగ్‌ డే’.. 
స్వాతంత్య్రం అనంతరం దేశం తీవ్ర విద్యుత్‌ కొరత ఎదుర్కొంది. కేంద్రం పరిధిలో ఒక విద్యుత్‌ కేంద్రం ఉండాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఆ విద్యుత్‌ కేంద్రం ఉన్న రాష్ట్రానికి ఎక్కువ శాతం విద్యుత్‌ కేటాయించి, మిగతా విద్యుత్‌ను ప్రాంతాల వారీగా పంపిణీ చేయాలని తీర్మానం చేశారు. అప్పటికప్పుడు నిర్మించాలంటే సమయం పడుతుందనే ఉద్దేశంతో ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన బదర్‌పూర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని టేకోవర్‌ చేసింది. 1975 నవంబర్‌ 7న ఎన్టీపీసీని రిజిస్టర్‌ ఆఫ్‌ కంపెనీస్‌గా నమోదు చేసి, జాతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంగా నామకరణం చేసి, ఎన్టీపీసీగా గుర్తించారు. దీంతో ఈ రోజును సంస్థ ‘రైజింగ్‌ డే’గా నిర్వహిస్తోంది. 

2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం 
ఎన్టీపీసీ దేశంలో బొగ్గు గనులు, గ్యాస్, నీరు, స్థలం ప్రాంతాలను గుర్తించి, విద్యుత్‌ ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఇలా దినదినాభివృద్ధి చెందుతూ అతిపెద్ద విద్యుత్‌ కేంద్రంగా ఎదిగింది. ప్రపంచస్థాయి విద్యుత్‌ సంస్థలతో పోటీ పడుతూ భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పవర్‌ ప్లాంట్‌ సామర్థ్యం, పీఎల్‌ఎఫ్, మెయింటెనెన్స్, రక్షణ, విద్యుత్‌ పొదుపు, పర్యావరణ సమతౌల్యం, మేనేజ్‌మెంట్‌ విధానాలతో మొదటి స్థానంలో నిలిచింది. అలా నవరత్న కంపెనీగా ఉన్న ఎన్టీపీసీ 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం చెందింది. 

ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రాలు  
ఎన్టీపీసీ సొంతంగా బొగ్గు, గ్యాస్, హైడ్రో, సోలార్, ఫ్లోటింగ్‌ సోలార్, జాయింట్‌ వెంచర్స్‌తో పాటు మొత్తంగా 74 విద్యుదుత్పత్తి కేంద్రాలను కలిగి ఉంది. ప్రస్తుతం సూపర్‌ క్రిటికల్‌ మెగా ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఎన్టీపీసీ తన ప్రధాన వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి కన్సల్టెన్సీ, పవర్‌ ట్రేడింగ్, విద్యుత్‌ నిపుణుల శిక్షణ, బొగ్గు తవ్వకాల రంగాల్లో ముందుకు సాగుతోంది. మైనింగ్‌లో ఎన్టీపీసీ వేగవంతమైన ప్రగతిని సాధించింది. ప్రపంచంలోని ప్రముఖ విద్యుత్‌ సంస్థగా అవతరించే దిశగా పయనిస్తోంది. 

కరోనా సమయంలోనూ నిరంతర విద్యుత్‌ సరఫరా 
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ దేశానికి ఎన్టీపీసీ నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేసింది. కోవిడ్‌–19కు వ్యతిరేకంగా పోరాడటంలో ప్రభుత్వానికి మద్దతుగా పీఎం కేర్‌ ఫండ్‌కు రూ.257.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ మొత్తంలో రూ.250 కోట్లు కంపెనీవి కాగా, సంస్థ ఉద్యోగులు తమ వేతనాల నుంచి రూ.7.5 కోట్లు అందించారు. ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌లు నిర్మించారు. కరోనా ఉధృతిలో కాంట్రాక్టు, వలస కార్మికులకు నిత్యావసరాలు, వైద్యసేవలు అందించారు. సంస్థ ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటికీ భౌతిక దూరం పాటిస్తున్నారు. ఎన్టీపీసీ ప్రపంచంలో నంబర్‌ వన్‌ స్థాయిలో నిలిచేందుకు సమన్వయంతో ముం దుసాగాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. 

ఇతర సంస్థలతో కలసి వ్యాపారాలు 
ఒకప్పుడు విద్యుదుత్పత్తి మాత్రమే చేసిన ఎన్టీపీసీ భవిష్యత్‌ పోటీని ఎదుర్కొని ఉత్పత్తి, పంపిణీ, విద్యుత్‌ కొనుగోలు, అమ్మకాలు, సొంతంగా బొగ్గు గనుల ఏర్పాటు, జాయింట్‌ వెంచర్లు తదితర ఎన్నో రంగాల్లో ఇతర సంస్థలతో కలసి వ్యాపారాలు చేస్తోంది. జాయింట్‌ వెంచర్ల పేరిట బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక దేశాల్లో వాటి భాగస్వామ్యంతో విద్యుత్‌ ప్రాజెక్టులు నిర్మి స్తోంది. భవిష్యత్‌లో అణు విద్యుత్‌ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేయాల్సి వస్తే మొదట ఎన్టీపీసీకే అవకాశం దక్కనుంది.  

మరిన్ని వార్తలు