వేపకు మళ్లీ ఆపదొచ్చింది.. మేలుకోకపోతే వింత రోగంతో మాడిపోవడం ఖాయం!

15 Nov, 2022 21:29 IST|Sakshi

ఆత్మకూరు (ఎం)/యాదాద్రి భువనగిరి: వేపకు మళ్లీ ఆపదొచ్చింది. వింత రోగంతో పచ్చని వృక్షాలు మాడిపోతున్నాయి. ఎన్నో ఔషధ గుణాలున్న చెట్లు కళ్లెదుటే మోడుబారి పోతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది కూడా వైరస్‌ సోకి పెద్ద ఎత్తున చెట్లు మోడుబారాయి.  గత సంవత్సరం మాదిరిగానే మళ్లీ  వేప చెట్లు వైరస్‌కు గురవుతున్నాయి.  
వైరస్‌ ద్వారా తెగులు
సృష్టిలో రకరకాల చెట్లు ఉన్నప్పటికీ వేపది ప్రత్యేక స్థానం. ఔషధ గుణాలు కలిగిన ఈ చెట్టుతో అనేక రకాల ప్రయోజనాలున్నాయి. అలాంటి ప్రాధాన్యం కలిగిన వేప చెట్టు ఇప్పుడు డైబ్యాక్, ట్రీమస్టికో వైరస్‌ బారిన పడింది. ఈ వైరస్‌ సోకిన చెట్ల కొమ్మలు పసుపు, గోదుమ రంగులోకి మారి ఆ తర్వాత నిర్జీవ స్థితికి చేరుతున్నాయి. ఈ వైరస్‌ ఒక వేప చెట్టు నుంచి మరో వేప చెట్టుకు వస్తుంది.  

వాడాల్సిన మందులు
వైరస్‌ బారిన పడిన వేప చెట్లకు కార్భోలానిజిమ్‌ ద్రావకాన్ని ఒక గ్రాం ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పది రోజుల తర్వాత కాపర్‌ ఆక్సై డ్‌ క్లోరైడ్‌ మూడు గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంతేకాకుండా  వైరస్‌ ఆశించిన చెట్టు కొమ్మలను నరికివేయాలి. నరికిన కొమ్మలకు గోరింటాకు ముద్దగా చేసి అంటించాలని సంబంధిత అధికారులు చెబుతున్నారు. 
(చదవండి: వీళ్లు మనుషులేనా.. ప్రేమ పెళ్లి చేసుకుందని.. కూతురుని కిడ్నాప్‌ చేసి గుండుకొట్టించి)

గత ఏడాది మొక్కుబడి చర్యలు 
గత ఏడాది వేప చెట్లు వైరస్‌ బారిన పడి ఎండిపోతుండడంతో అప్రమత్తం అయిన ప్రభుత్వం.. చెట్లను కాపాడుకునేందుకు సంరక్షణ చర్యలు చేపట్టాలని  ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు, సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పర్యటించి వేప చెట్లకు మందులు పిచికారీ చేయాల్సి ఉంది. మొక్కుబడిగా కొన్ని చెట్లకు మాత్రమే మందులు వేసి ఆ తర్వాత చేతులు దులుపుకున్నారు. మందు పిచికారీ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది కావడంతో సర్పంచ్‌లు చేతులెత్తేశారు. దీంతో వైరస్‌ మళ్లీ వ్యాప్తి చెందుతోంది.  
(చదవండి: హైదరాబాద్‌లో విచ్చలవిడిగా హాస్టళ్లు, లాడ్జీలు.. పోలీసుల ప్రత్యేక యాప్‌)

ఈసారి తీవ్రత ఎక్కువగా ఉంది
వేప చెట్లకు వైరస్‌ తీవ్ర త ఈసారి ఎక్కువగా ఉంది. తేమ శాతం అధికంగా ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. వైరస్‌ సోకిన చెట్టు ఆరు నెల్లోపు చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఉష్ణోగ్రతలు పెరిగితే చిగురిస్తాయి.  గతంలో సర్పంచ్‌లకు చెప్పి మందు పిచికారీ చేయించాం.  సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం.
–అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి

మందులు పిచికారీ చేయాలి
వేప చెట్లతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. పూర్తిగా ఔషధ గుణాలు కలిగిన వేప చెట్లు వైరస్‌ బారిన పడి ఎండిపోతుండడం ఆందోళన కలిగి స్తోంది. ప్రభుత్వం ముందుకొచ్చి సంరక్షణలు చర్యలు చేపట్టాలి. అధికారులకు ఆదేశాలు జారీ చేసి మందులు పిచికారీ చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే చెట్లు అంతరించే ప్రమాదం ఉంది
–డి.వెంకన్న, సైన్స్‌ ఉపాధ్యాయుడు, ఆత్మకూరు(ఎం) 

అధికారులు స్పందించాలి
నాకు తెలివి వచ్చినప్పటి నుంచి వేప పుల్లతోనే దంతాలు తోముకుంటున్నా. గత ఏడాది వేప చెట్లకు వైరస్‌ సోకి చాలా వరకు ఎండిపోయాయి. మళ్లీ అదే మాదిరిగా ఇప్పుడు ఎండిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మొదటిసారి పూర్తిస్థాయిలో నివారణ చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వెంటనే స్పందించి చెట్లను కాపాడాలి.
–బద్దం శంకర్‌రెడ్డి, రైతు, కాల్వపల్లి, ఆత్మకూరు(ఎం) మండలం  

మరిన్ని వార్తలు