వేపకు మళ్లీ  ‘డై బ్యాక్‌’ ముప్పు!

30 Apr, 2023 02:15 IST|Sakshi

తెలుగు రాష్ట్రాల్లో మూడేళ్లుగా వేప చెట్లపై ‘టీ మస్కిటో’, ఫంగస్‌ దాడి

కొమ్మలన్నీ ఎండి, ఆకులు రాలి దెబ్బతిన్న చెట్లు

అయినా ఏటా ఉగాది తర్వాత చిగురించి బతుకుతున్న వేప

ఈసారి ఫిబ్రవరి నుంచి అకాల వర్షాలతో మళ్లీ మొదలైన కీటక దెబ్బ

ఈ ఏడాది 50–80 శాతం దాకా విత్తన దిగుబడి  తగ్గొచ్చంటున్న నిపుణులు

ల్లెపల్లెనా, రోడ్ల పక్కన, అడవుల్లో విస్తృతంగా పెరిగే మన వేపచెట్లకు మరోసారి ‘డై బ్యాక్‌’జబ్బు ముప్పు పొంచి ఉంది. సుమారు మూడేళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో ‘టీ మస్కిటో’, ఫంగస్‌ దాడితో తీవ్రంగా దెబ్బతిన్న లక్షలాది వేపచెట్లు ఈ ఏడాది ఉగాది తర్వాత కోలుకుంటున్న క్రమంలో మళ్లీ టీ మస్కిటో దాడి మొదలుపెట్టింది. ఈసారి ఫిబ్రవరి నుంచి అకాల వర్షాలు కురుస్తుండటంతో మళ్లీ పంజా విసురుతోంది. ఫలితంగా చెట్లన్నీ కొమ్మలతో సహా ఎండి పోవడంతోపాటు ఆకులు రాలిపోతున్నాయి. దీనివల్ల చెట్లకు పోషకాలు అందక క్రమంగా చచ్చిపోతున్నాయి. దీన్నే డై బ్యాక్‌గా పిలుస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్‌

తగ్గనున్న వేప విత్తన దిగుబడి...
రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత తీవ్రం కావొచ్చని శాస్త్రేవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెగుళ్లు సోకడం వేపవిత్తనాల దిగుబడి భారీగా తగ్గిందని చెబుతున్నారు. ఈ ఏడాది 50 నుంచి 80% దాకా విత్త నాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని, దీని ప్రభావం వేప ఉత్పత్తులు, నీమ్‌కేక్స్, నీమ్‌ ఆయిల్, నీమ్‌ కోటింగ్‌పై ఆధారపడిన పరిశ్రమలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. డై బ్యాక్‌ జబ్బును జాతీయ స్థాయిలో దీనిని కట్టడి చేసేందుకు కార్యాచరణను చేపట్టక పోతే భవిష్యత్‌లో వేప ఆధారిత ముడిపదార్థాలను విదేశాల నుంచి దివగుమతి చేసుకోవాల్సిన దుస్థితి ఎదురుకావొచ్చని చెబుతున్నారు.

కొనసాగుతున్న పరిశోధనలు..
ఈ సమస్యపై ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఫారెస్ట్‌ కాలేజీ ఆఫ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టి ట్యూట్‌ (ఎఫ్‌సీఆర్‌ఐ) ఐఐసీటీ, జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విడి విడిగా పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. వేపచెట్లకు ఎదురవుతున్న కీటక దాడు లు, చెదలు, ఫంగస్‌లను ఎలా కట్టడి చేయాలనే దాని పై పరిష్కారాలు కనుగునేందుకు కృషి చేస్తున్నాయి.

ఎఫ్‌సీఆర్‌ఐలో పరి శోధన నిర్వహిస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ బి.జగదీశ్‌కుమార్‌ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే ఫోమోప్‌సిస్‌ అజాడిరాచ్‌టే అనే పాథోజెన్‌ ద్వారా వేప చెట్లకు ఈ జబ్బు సోకుతున్నట్లు గుర్తించారు. ఈ పాథోజెన్‌ గాలి ద్వారా సులభంగా వ్యాప్తికి అవకాశం ఉన్నందున వేపచెట్లు ఉన్న ప్రాంతానికి చేరుకున్నాక వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. రాష్ట్రమంతటా వేప చెట్లు విస్తరించి ఉన్నందున అన్నింటికీ వివిధ రసా యన మిశ్ర మాలతో పిచికారీ చేయడం అసాధ్యంగా మారిందని వివరించారు.

అయితే వేపకు బతికే శక్తిసామ ర్థ్యాలు ఎక్కువగా ఉన్నందున పెద్దచెట్లకు అంతగా నష్టం ఉండదని ప్రొ.జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా విభాగం రిటైర్డ్‌ సంచాలకుడు డాక్టర్‌ ఆర్‌.జగదీశ్వర్‌ అభిప్రాయపడ్డారు. కానీ గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్లు ఎక్కువ కావడంతో వేపచెట్టు నుంచి విత్తనం నేలపై పడి తిరిగి మొలకెత్తడం తగ్గిపోయిందన్నా రు. అందు వల్ల వేప ముడిపదార్థాల ఉత్పత్తి, సరఫరాలో తగ్గుదల కనిపిస్తోందని సాక్షితో మాట్లాడుతూ చెప్పారు. 

మరిన్ని వార్తలు