వేప చెట్లకు ముప్పు.. 

14 Dec, 2022 02:09 IST|Sakshi

కొమ్మల ముడత వ్యాధి ప్రభావం 

కానీ ఎదుర్కొనేంత బలంగానే మన రాష్ట్రంలోని చెట్లు

ఎఫ్‌సీఆర్‌ఐ ప్లాంట్‌ పాథాలజిస్ట్‌ డా. జగదీశ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: కొమ్మల ముడత లేదా డైబ్యాక్‌ అని పిలిచే విధ్వంసకర వ్యాధితో ప్రస్తుతం వేపచెట్లకు ముప్పున్నదని ములుగు ఫారెస్ట్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్లాంట్‌ పాథాలజిస్ట్‌ డా.జగదీశ్‌ తెలిపారు. ఇది అన్ని వయసులు, అన్ని పరిమాణాల వేప చెట్ల ఆకులు, కొమ్మలు, పుష్పగుచ్ఛాలను ప్రభావితం చేస్తుందని, ఐతే దీని వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కొనేంత బలంగా మన రాష్ట్రంలోని చెట్లున్నాయని ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ వ్యాధి ఆగస్టు–డిసెంబర్‌ల మధ్య ఎక్కువగా కనిపిస్తుందని, వర్షాకాలం మొదలయ్యాక లక్షణాలు కనిపిస్తాయని, వర్షాకాలం చివర్లో శీతాకాలంలో ఇది క్రమంగా తీవ్రమవుతుందని వివరించారు. 

విత్తన శుద్ధితో తగ్గుముఖం 
వేప విత్తనాలు విత్తే సమయంలో, శిలీంద్రనాశకాలు లేదా బయో నియంత్రిత ఏజెంట్లతో విత్తన శుద్ధి ఈ సంక్రమణను తగ్గిస్తుందని తెలియజేశారు. మొలక, నారు దశలో కార్బండాజిమ్‌ 2.5 గ్రాముల లీటరు నీరు లేదా ట్రైకోడెర్మా వంటి బయోకంట్రోల్‌ శిలీంద్రనాశకాల నివారణ స్ప్రేలు కచ్చితంగా నారు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయనీ, వ్యాధులకు నిరోధకతను కల్పిస్తాయని తెలిపారు.

వేప చెట్టు స్వాభావికంగా వ్యాధిని బాగా తట్టుకోగలుగుతుందని, తరచుగా ఫంగస్‌ వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చేయగలదని స్పష్టం చేశారు. దీనిపై తమ ఇన్‌స్టిట్యూట్‌ ల్యాబొరేటరీలో అధ్యయనాలు నిర్వహించామని, వ్యాధికారక కారణాన్ని ఫోమోప్సిస్‌ అజాడిరచ్‌టేగా గుర్తించినట్లు తెలియజేశారు. రాష్ట్రంలో వరుసగా మూడేళ్లుగా ఇది వెలుగులోకి రావడం కొంత ఆందోళన కలిగించే అంశమేనని పేర్కొన్నారు. వేప డైబ్యాక్, ఇతర చెట్ల వ్యాధులకు సంబంధించి ఏవైనా సందేహాలుంటే 9705893415 నంబర్‌లో సంప్రదించవచ్చునని జగదీశ్‌ తెలియజేశారు.   

మరిన్ని వార్తలు