‘నీట్‌’ ప్రశాంతం

14 Sep, 2020 03:13 IST|Sakshi
హైదరాబాద్‌లో ఓ విద్యార్థినికి జ్వరం చెక్‌ చేస్తున్న దృశ్యం

94శాతం హాజరు

కరోనా ఉన్న విద్యార్థులకు ఐసోలేషన్‌ గదిలో పరీక్ష

ఈజీగా పేపర్‌... 99% ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ నుంచే..

ఈసారి అర్హత మార్కు150 వరకు పెరిగే అవకాశం

500 మార్కులు వస్తే ఎక్కడో ఒకచోట సీటు?

సాక్షి, హైదరాబాద్‌: ఎట్టకేలకు ‘నీట్‌’పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. వైద్య కోర్సుల్లో చేరేందుకు దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన పరీక్ష తెలంగాణలో కట్టుదిట్టంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరిగితే, ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను విడతల వారీగా అనుమతించారు. అన్ని కేంద్రాల్లోనూ థర్మల్‌ గన్స్‌ను పెట్టారు. జ్వరం చూసిన తర్వాతే వారిని లోనికి అనుమతించారు. జ్వరం ఉన్నవారికి, కరోనా లక్షణాలున్న వారికి ఐసోలేషన్‌ గదిలో పరీక్ష నిర్వహించారు. గతంలో ఒక్కో గదిలో 24 మంది విద్యార్థులకుసీటింగ్‌ ఏర్పాట్లు చేస్తే, ఈసారి 12 మందినే కూర్చోబెట్టారు. దీనిద్వారా ఒక్కో బెంచీకి ఒక్క విద్యార్థే ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 

94 శాతం హాజరు... 
ఈ ఏడాది తెలంగాణ నుంచి 55,800 మంది విద్యార్థులు నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. హైదారాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌ జిల్లాల్లో 112 నీట్‌ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 94 శాతం మంది విద్యార్థులు ‘నీట్‌’పరీక్షకు హాజరైనట్లు అధికారులు అంచనా వేశారు. నీట్‌ పరీక్షా పేపర్‌ ఈసారి మోడరేట్‌ నుంచి సులువుగా ఉందని చాలామంది విద్యార్థులు అంటున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది పేపర్‌ చాలా ఈజీగా ఉందని చెబుతున్నారు. 99 శాతం ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్‌ నుంచే వచ్చాయి. కెమిస్ట్రీలోని రెండు మూడు ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయి. ఒకే ప్రశ్నకు ఇచ్చిన జవాబులు దగ్గరగా ఉన్నాయి. బయాలజీలోని నాలుగైదు ప్రశ్నలు కూడా అలాగే ఉన్నాయి. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. 

ఈసారి అర్హత మార్కు 150..!
మొత్తం 720 మార్కులకు పరీక్ష నిర్వహించారు. అర్హత మార్కులు గతేడాది కంటే ఈసారి పెరుగుతుంది. గతేడాది జనరల్‌లో అర్హత మార్కు 134 ఉండగా, ఈసారి దాదాపు 150 వరకు పెరిగే చాన్స్‌ ఉందని నిపుణులు అంచనా వేశారు. గతేడాది జనరల్‌ కేటగిరీలో 480 మార్కులు వస్తే ఎక్కడో ఒకచోట సీటు వచ్చేది. ఈసారి 500 మార్కులు వచ్చినవారికి సీటు వచ్చే అవకాశం ఉంది. కన్వీనర్‌ కోటాలో గతేడాది 520 మార్కులకు సీటు రాగా... ఈసారి 550 మార్కులు వస్తే సీటు వచ్చే అవకాశం ఉందని అంచనా. 
 

 ఈజీగా ఉంది: ముత్యాల సాయి వరుణ్, శ్రీచైతన్య, హైదరాబాద్‌
పేపర్‌ చాలా బాగుంది. ఎన్‌సీఈఆర్‌టీ నుంచే ఇచ్చారు. ప్రతీ సబ్జెక్ట్‌లో రెండు మూడు ప్రశ్నలు గందరగోళంగా ఉన్నాయి. బాటనీలో కొంచెం ఎన్‌సీఈఆర్‌టీ నుంచి కాకుండా బయటి నుంచి ఇచ్చారు. అయితే అవి కూడా ఎన్‌సీఈఆర్‌టీకి రిలేటెడే. చాలా ఈజీగా ఉంది. 

కెమిస్ట్రీ టఫ్‌గా ఉంది: రోహిత్‌ సింహా, హైదరాబాద్‌
మొత్తంగా ఈసారి నీట్‌ పరీక్ష పేపర్‌ ఈజీగానే ఇచ్చారు. కెమిస్ట్రీ మాత్రం టఫ్‌గా ఉంది. ఒకే రకమైన ఆన్సర్లు ఉన్నాయి. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. ఫిజిక్స్‌లో 95 శాతం ఫార్ములా బేస్డ్‌ ప్రశ్నలు ఇచ్చారు. బాటనీ 90 శాతం ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ నుంచే ఇచ్చారు.

ముందు నిరాకరణ.. ఆ తర్వాత అనుమతి
కరీమాబాద్‌: హన్మకొండకు చెందిన సాయివైష్ణవి నీట్‌ పరీక్ష రాసేందుకు ఆదివారం తాళ్ల పద్మావతి ఫార్మసీ కళాశాల సెంటర్‌కు వచ్చింది. అయితే సంబంధిత అధికారులు, సిబ్బంది వైష్ణవిని కోవిడ్‌ పేషంట్‌గా గుర్తించి లోనికి అనుమతి ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన సాయివైష్ణవి తనకు కరోనా సోకిన మాట నిజమేనని.. అయితే 14 రోజల పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్నానని, ప్రస్తుతం తనకు నెగెటివ్‌ వచ్చిందని చెప్పింది. అయినా కళాశాల సిబ్బంది అనుమతి నిరాకరించారు. ఆమె పరిస్థితిని గమనించిన మిల్స్‌కాలనీ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ నరేశ్‌కుమార్‌... సాయివైష్ణవిని సమీపంలోని అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌కు తరలించి కోవిడ్‌ పరీక్ష చేయించగా నెగెటివ్‌ వచ్చింది. దాంతో ఆమెను తిరిగి సెంటర్‌కు తీసుకువచ్చి పరీక్ష రాసేందుకు అనుమతించారు. 

మరిన్ని వార్తలు