జూన్‌లో నీట్‌? వచ్చే వారంలో నోటిఫికేషన్‌

7 Mar, 2022 04:31 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్‌: వైద్య సీట్లల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌)–2022 ఈ ఏడాది జూన్‌లో జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే వారంలో నోటిఫికేషన్‌ విడుదలవుతుందని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వర్గాలు తెలిపాయి. నీట్‌ పరీక్ష ద్వారా దేశంలోని 532 మెడికల్‌ కాలేజీల్లో 83,125 ఎంబీబీఎస్‌సీట్లు, 313 డెంటల్‌ కాలేజీల్లో 26,949 బీడీఎస్‌ సీట్లు, 52,720 ఆయుష్, 525 బీవీఎస్‌సీ సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు. తెలంగాణలో 2022–23 వైద్య విద్యా సంవత్సరంలో అదనంగా 8 వైద్య కళాశాలలు రానున్నాయి. వాటిల్లో 1,200 ఎంబీబీఎస్‌ సీట్లు వస్తాయి.

మెడికల్‌ ప్రవేశాల్లో ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలవుతాయి. ఈ కోటా కింద ఆయా అభ్యర్థులకు 10% రిజర్వేషన్‌ లభిస్తుంది. ఈడబ్ల్యూఎస్‌కోటాకు అనుగుణంగా ఈసారి 5,200 మెడికల్‌ సీట్లు రానున్నాయని ఎన్‌టీఏ వర్గాలు తెలిపాయి. కాగా, ఎయిమ్స్, జిప్‌ మర్‌ వంటి ప్రతిష్టాత్మక మెడికల్‌ విద్యాసంస్థలతో పాటు దేశంలోని అగ్రశ్రేణి వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ వంటి యూజీ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులు నీట్‌ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. నీట్‌–2021 పరీక్షకు 15 లక్షల మందికి పైగా దేశవ్యాప్తంగా హాజరుకాగా, వీరిలో సుమారు 8 లక్షల మంది అభ్యర్థులు అర్హత సాధించారు. అభ్యర్థి ర్యాంకు, కేటగిరీని బట్టి మెడికల్‌ కాలేజీల్లో సీటు దక్కుతుంది. ఈ పరీక్షను ఆఫ్‌లైన్‌ మోడ్‌లోనే నిర్వహిస్తారు.  

మరిన్ని వార్తలు