దేవ.. దేవా!

12 Nov, 2020 08:25 IST|Sakshi

పదహారేళ్లుగా ‘సా..గు’తున్న దేవాదుల ప్రాజెక్టు పనులు  

 రూ.6 వేల కోట్లతో మొదలై రూ.13,445 కోట్లకు చేరిన అంచనా వ్యయం

6.53 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం.. నీరందుతున్నది 2.34 లక్షల ఎకరాలకే..

పూర్తికాని 2,590 ఎకరాల భూసేకరణ.. పరీక్ష పెడుతున్న టన్నెల్‌ పనులు

పనుల తీరుపై ‘కాగ్‌’అక్షింతలు.. సీఎం అసంతృప్తి

వచ్చే ఏడాది జూన్‌ నాటికి పనుల పూర్తికి ప్రభుత్వం గడువు

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి జలాల వినియోగమే లక్ష్యంగా పదహారేళ్ల కిందట చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకం పనులు నత్తకే నడక నేర్పుతున్నాయి. 60 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తూ ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ఈ పథకం పనులు ముక్కుతూ మూలుగుతూ సాగుతున్నాయి. పూర్తికాని భూసేకరణ, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, భారీ సొరంగాల నుంచి ఊరుతున్న నీటి ఊటలు పనులకు పరీక్ష పెడుతున్నాయి. ప్రాజెక్టు పనులను వేగిరం చేసేందుకు కార్పొరేషన్ల ద్వారా నిధులను సమకూరుస్తున్నా.. పనుల్లో జాప్యం జరుగుతుండటం ప్రభుత్వ పెద్దలనూ అసహనానికి గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్‌ నాటికైనా ప్రాజెక్టును పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యాలను విధించింది.

ఈ ఎత్తిపోతల పథకాన్ని 2003–04లో రూ.6 వేల కోట్లతో ప్రారంభించారు. అంచనా వ్యయం ప్రస్తుతం రూ.13,445 కోట్లకు పెరిగింది. దీని కింద ఆయకట్టును 6.53 లక్షల ఎకరాలుగా నిర్ణయించగా, ఇంతవరకు 2.34 లక్షల ఎకరాలే సాగులోకి వచ్చాయి. మూడు దశల పనుల్లో మొదటి రెండు దశలు పూర్తయ్యాయి. అయితే ఇంకా కొంత ఆయకట్టుకు నీరందాల్సి ఉంది. మూడో దశ పనులు మాత్రం మొత్తంగా చిక్కుల్లో పడ్డాయి. రామప్ప నుంచి ధర్మసాగర్‌ వరకు భారీ టన్నెళ్లలో ఊరుతున్న నీటి ఊటలు, భూసేకరణ సమస్యతో పనులు మందగించాయి. దీనిపై అసంతృప్తితో ఉన్న సీఎం కేసీఆర్‌ స్వయంగా సీఎంఓ కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ను రంగంలోకి దింపినా పనుల్లో పురోగతి లేదు. 

ముక్కుతూ, మూలుగుతూ ‘మూడో దశ’
ప్రాజెక్టు కోసం మొత్తంగా 31,383 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 28,793 ఎకరాలు సేకరించారు. మరో 2,590 ఎకరాలను సేకరించాల్సి ఉంది. భూసేకరణకు రూ.985 కోట్లు ఖర్చుచేశారు. ఫేజ్‌–3లో మొత్తంగా 12,368 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, 9,778 ఎకరాలనే సేకరించారు. కోర్టు కేసులు, రైతులు ఎక్కువ పరిహారాన్ని డిమాండ్‌ చేయడం వంటివి భూసేకరణకు అడ్డం పడుతున్నాయి. ఇక, ఫేజ్‌Œ›–3లోని ప్యాకేజీ–1, 2 పనులు ఇప్పటికే పూర్తికాగా, ప్యాకేజీ–3 నుంచి ప్యాకేజీ–8 వరకు పనులకు సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ప్యాకేజీ–3లో రామప్ప నుంచి ధర్మసాగర్‌ వరకు నీటిని తరలించేందుకు తవ్వాల్సిన 49 కిలోమీటర్ల టన్నెల్‌లో.. 1.46 కి.మీ. మేర టన్నెల్‌ నిర్మాణం సలివాగు కింది నుంచి వెళ్లాల్సి ఉంది. 853 మీటర్ల టన్నెల్‌ తవ్వకానికే ఏళ్లుపట్టింది.

ఇక్కడ 2012లో ఎదురైన ప్రమాదం నుంచి కోలుకొని దీన్ని తిరిగి పూర్తిచేయడానికి ఏకంగా ఎనిమిదేళ్లు పట్టింది. ప్రస్తుతం సలివాగు కింద టన్నెల్‌ పూర్తిచేసినా, ఊట కారణంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మొన్నటి వర్షాలతో సమస్య ఇంకా పెరిగింది. డీవాటరింగ్‌ చేసేందుకు నెలకు డీజిల్‌ ఖర్చే కోటి రూపాయల వరకు ఉంటోంది. ప్యాకేజీ–4 కింద పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ పనుల్ని ప్రస్తుత ఏజెన్సీ నుంచి తొలగించి మరో ఏజెన్సీకి ఇవ్వాలని యోచిస్తున్నారు. ప్యాకేజీ–5లో 386 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, నల్లబెల్లి మండలం రుద్రగూడెం వద్ద జాతీయ రహదారి క్రాసింగ్‌తో సమస్యలున్నాయి. ఈ పనులన్నీ పూర్తయితేనే ఫేజ్‌–3 కింద 2.42 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందనుంది.

పనుల తీరును ‘కాగ్‌’తప్పుబట్టినా..
దేవాదుల పనుల్లో జాప్యాన్ని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) 2018లోనే తప్పుపట్టింది. ప్రాజెక్టు పనుల గడువు ఇప్పటికే 8సార్లు పొడిగించినా పూర్తి చేయలేకపోయారని, దీనివల్ల నిర్మాణ వ్యయం పెరుగుతోందని ఎత్తిచూపింది. నిర్మాణ సమయంలో ప్రాజెక్టు వ్యయం రూ.6వేల కోట్లు కాగా, దాన్ని ఒకమారు రూ.9,427 కోట్లకు, తర్వాత మళ్లీ సవరించి రూ.13,445 కోట్లకు చేర్చారని ఆక్షేపించింది. పెరిగిన వ్యయాలకు అనుగుణంగా ఆయకట్టుకు మాత్రం నీరందించలేకపోయారంది. ముఖ్యంగా భూసేకరణ, రహదారుల క్రాసింగ్‌ విషయంలో జరుగుతున్న జాప్యంతో ప్రాజెక్టు వ్యయం పెరుగుతున్న విషయాన్ని ఎత్తిచూపింది. ఈ నేపథ్యంలో పనులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం వచ్చే ఏడాది జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని ఇరిగేషన్‌ శాఖకు లక్ష్యంగా పెట్టింది.

వచ్చే జూన్‌ నాటికి పూర్తి చేస్తాం
దేవాదుల ప్రాజెక్టు పనుల్లో జాప్యం జరుగుతున్న మాట వాస్తవమే. భూసేకరణ సమస్యలు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఇబ్బందులున్నాయి. సీఎం కేసీఆర్‌ సూచనతో స్థానిక ప్రజాప్రతినిధులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల సమన్వయంతో సమస్యలు పరిష్కరిస్తూ పనులు పూర్తిచేసేలా ప్రణాళిక రచించాం. వచ్చే ఏడాది జూన్‌ నాటికి 1,200కుపైగా చెరువులకు నీళ్లిచ్చేలా పనులు ముగిస్తాం. భూసేకరణ ప్రక్రియకు అవసరమైన నిధులను విడుదల చేస్తాం. మిగతా పనులకు రుణాల ద్వారా నిధుల లభ్యత ఉంది.
రజత్‌కుమార్, ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ.

మరిన్ని వార్తలు