చూపు లేకున్నా.. ఒకరికొకరుగా..

11 Jan, 2021 09:07 IST|Sakshi

శ్రీనగర్‌కాలనీలో ఘనంగా వి‘వాహ్‌’

పెద్దల సమక్షంలో ఒక్కటైన జంట  

సాక్షి, బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): ఆ జంటకు కాలనీవాసులే కళ్లయ్యారు.. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు.. మేం నడిపిస్తాం.. మీరు నడవండంటూ ఏడడుగులు నడిపించారు.. కళ్లు లేని వారంటే సమాజంలో చిన్న చూపుందనేది నాటిమాట.. కానీ నేటి సమాజానిది పెద్దచూపు.. ఆ కాలనీవాసులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల ముందు చూపు, పెద్ద మనసుతో కళ్లు లేని జంట పెళ్లిని కనులపండువగా నిర్వహించారు. పుట్టుకతోనే కళ్లులేని వారిని చేరదీసి వారిని పెంచి, పెద్ద చేసి చదివించి వారికి నచ్చిన రంగాల్లో శిక్షణ ఇప్పించి ఓ ఇంటివారిని చేస్తే అంతకు మించిన తృప్తి, ఆనందం ఇంకేముంటుంది చెప్పండి.. శ్రీనగర్‌కాలనీలోని కేశవనగర్‌ సరస్వతి విద్యామందిర్‌లో ఆకాశమంత పందిరిలో వేద మంత్రాల సాక్షిగా, కాలనీవాసుల ఆనందోత్సాహాల మధ్య ఆదివారం ఉదయం ఓ అంధ జంట ఒక్కటయ్యారు.. చిలుకూరు బాలాజీ టెంపుల్‌ అర్చకులు రంగరాజన్‌ చేతులమీదుగా జరిగిన ఈ వివాహానికి స్థానిక కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి, పలువురు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. చదవండి: గన్నీ బ్యాగులో మృతదేహం.. ఇంకా మిస్టరీలే!

► నిఖిల్, రాణి ఇద్దరూ పుట్టుకతోనే కళ్లు లేని వారు.. వారిని ఇట్రాయిడ్‌ అనే సంస్థ చేరదీసి ఇంటర్‌ వరకు చదివించింది. వీరికి వ్రిశాంక ఫైన్‌ ఆర్ట్స్‌ సంస్థ మ్యూజిక్‌లో, పాటలు పాడటంలో శిక్షణనిచ్చారు. నిఖిల్‌ సింగర్‌గా స్థిరపడ్డాడు. రాణి డిగ్రీ వరకు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్‌ అవుతోంది.  
► ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్‌లో ఒకే కాలేజీలో చదువుకుంటూ ఒకరిని ఒకరు ఇష్టపడటంతో పాటు పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించారు. ఇదే విషయాన్ని ఇట్రాయిడ్‌ సంస్థ ఫౌండర్‌ మధుకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.  
► వెంటనే వ్రిశాంక ఫైన్‌ ఆర్ట్స్‌ సంస్థ బంగారు లక్ష్మణ్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వీరిద్దరిని ఆదివారం రోజు ఒక్కటి చేశారు. వీరి పెళ్లి కేశవ్‌నగర్‌ కాలనీవాసులతో పాటు చాలామంది రకరకాలుగా సహాయ సహకారాలు అందించారని వ్రిశాంక ఫైన్‌ ఆర్ట్స్‌ సంస్థ ఫౌండర్‌ బంగారు కవిత తెలిపారు.  
► పెళ్లి కోసం సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినట్లు వారు తెలిపారు. అంధుల పెళ్లి విషయాన్ని తెలుసుకొని తానే స్వయంగా వచ్చినట్లు చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ తెలిపారు.  
► మ కాలనీలో జరుగుతున్న వివాహం గురించి తెలుసుకున్న ఆ కాలనీవాసులు తమ ఇంట్లో వారి వివాహంలో చేసినట్లుగా పెళ్లిలో కోలాహలంగా గడిపారు. వివాహం తర్వాత వారికి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. 

మరిన్ని వార్తలు