అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కేసీఆర్‌

21 Oct, 2020 14:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారీ వర్షాలు, వరదలతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశించారు. 15 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి హైదరాబాద్‌లోని అన్ని చెరువుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం వరద సహాయక చర్యలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు కురిశాయన్నారు. హైదరాబాద్‌లోని అన్ని చెరువులు పూర్తిగా నిండాయని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, చెరువులకు గండ్లు పడినా, కట్టలు తెగినా వెంటనే మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. ( డ్రైనేజీ సిస్టం దారుణంగా ఉంది: కిషన్‌రెడ్డి )

కాగా, భారీ వర్షాలు, వరదలు కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులను ఆదుకునేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత సోమవారం కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పూర్తిగా ఇల్లు కోల్పోయిన వారికి రూ.లక్ష.. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ.50 వేల చొప్పున తక్షణసాయం, వరదతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.10 వేల ఆర్థికసహాయం అందజేస్తామని చెప్పారు. ఈ సహాయం అందించేందుకు మున్సిపల్‌ శాఖకు.. రూ.550 కోట్లు విడుదల చేశారు.

మరిన్ని వార్తలు