హలో.. మీ పేరుతో ఓ పార్సిల్‌ వచ్చింది

22 May, 2023 03:59 IST|Sakshi

మీ పేరిట ఫెడెక్స్‌లో డ్రగ్స్‌ పార్సిల్‌ ఉందంటూ బాధితులకు ఫోన్లలో బెదిరింపులు

నకిలీ ఐడీ కార్డులు, పార్సిళ్ల ఫొటోలను వాట్సాప్‌ చేస్తున్న వైనం

కేసు పెట్టకుండా ఉండాలంటే అధికారులతో మాట్లాడుకోవాలని సూచన

భయపడిన వారి నుంచి అందినకాడికి దండుకుంటున్న సైబర్‌ ముఠా

రాజస్తాన్, హరియాణా నుంచి ఎక్కువగా ఈ తరహా మోసాలు

దర్యాప్తు సంస్థల పేరుతో దగా.. సైబర్‌ నేరగాళ్ల కొత్త దందా

 ‘‘మీ పేరు, చిరునామాతో ఉన్న ‘ఫెడెక్స్‌’ పార్సిల్‌లో మాదక ద్రవ్యాలు ఉన్నాయి. దర్యాప్తు నిమిత్తం  మీపై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు  చేస్తున్నాం. ఒకవేళ మీపై కేసు నమోదు కాకుండా  ఉండాలంటే కస్టమ్స్‌ అధికారులతో ‘ఒప్పందం’ కుదుర్చుకోండి’’ ఇదీ హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినికి వచ్చిన సైబర్‌ నేరగాళ్ల ఫోన్‌కాల్‌! యువతిని నమ్మించేందుకు ఆమె వాట్సాప్‌కు డ్రగ్స్‌ ఉన్న పార్సిల్, కస్టమ్స్‌ అధికారి ఐడీ కార్డు కూడా  పంపించారు. దీంతో భయపడిన ఆమె...  కేసు నమోదు చేయొద్దంటూ వేడుకొని  ఆన్‌లైన్‌ ద్వారా రూ. లక్షలు  సమర్పించుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: సైబర్‌ నేరగాళ్లు దోపిడీ లకు ఇటీవల కాలంలో దర్యాప్తు అధికారుల అవతారమెత్తుతున్నారు. ముంబై, ఢిల్లీ పోలీసులమని, సీబీఐ, ఈడీ, కస్ట మ్స్‌ అధికారులమంటూ అమాయ కులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. భయపడి పోతున్న సామాన్యులు రూ. లక్షల్లో ముట్టజెప్పి మోసపోతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఈ తరహా కేసులు పెద్ద సంఖ్యలో నమోద వుతున్నాయని సైబర్‌ పోలీసులు తెలిపారు.

ఎలా చేస్తున్నారంటే..
సామాజిక మాధ్యమాలు, డేటా ప్రొవైడర్ల ద్వారా సైబర్‌ నేరస్తులు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారు. ఎంపిక చేసుకున్న వ్యక్తులకు ఫోన్‌ చేసి ఢిల్లీ, ముంబై కస్టమ్స్‌ అధికారులమని పేరు, చిరునామా చెబుతూ సంభాషిస్తారు.

మీ పేరు, అడ్రస్‌తో ఉన్న పార్సిల్‌ కస్టమ్స్‌లో అనుమానాస్పదంగా కనిపించి నిలిపివేసినట్లు, తెరిచి చూస్తే అందులో మాదకద్రవ్యాలు, ఇతరత్రా చట్ట వ్యతిరేక ఉత్పత్తులు ఉన్నాయని గుర్తించినట్లు బెదిరిస్తారు. ఫోన్‌లో ఏమాత్రం బెరుకుగా మాట్లాడుతున్నట్లు అనిపించగానే బెదిరింపులు రెట్టింపు చేస్తారు. మనీలాండరింగ్, మాదక ద్రవ్యాల కేసులు నమోదు చేస్తామని వరుసగా ఫోన్లు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తారు.

కేసు వద్దంటే స్వాహా..
అమాయకులను నమ్మించేందుకు నకిలీ పోలీసు అధి కారుల గుర్తింపు కార్డులు సైతం కేటుగాళ్లు వాట్సాప్‌ చేస్తారు. ఈ వ్యవహారం నుంచి బయట పడాలంటే దర్యాప్తు సంస్థల అధికారులతో మాట్లాడి ఒప్పందం చేసుకో వాలని సలహా ఇస్తారు. ఆపై కొద్దిసేపటికి మరో నకిలీ అధికారి ఫోన్‌ చేసి కేసు లేకుండా ఉండాలంటే కొంత నగదు చెల్లించాల్సి ఉంటుందని సూచిస్తారు. ఇలా బాధితులను బెది రించి రూ. లక్షల్లో నగదు కొట్టేస్తున్నారు.

ఈ రాష్ట్రాల నుంచే ఎక్కువ
ఈ తరహా మోసాలు ఎక్కువగా ఫెడెక్స్‌ పార్సిల్‌ సంస్థ పేరుతో జరుగుతున్నాయని సైబర్‌ పోలీసులు విచారణలో గుర్తించారు. రాజస్తాన్, హరియాణా, జార్ఖండ్‌కు చెందిన సైబర్‌ ముఠాలు ఎక్కువగా ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నాయని ఓ పోలీసు అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు