స్కూళ్లలో వై‘రష్‌’.. గురుకులాలు, పాఠశాలల్లో పెరుగుతున్న కేసులు 

4 Dec, 2021 04:01 IST|Sakshi

శుక్రవారం 46 మందికి పాజిటివ్‌ 

మాస్కు లేనివాళ్లకు జరిమానా 

పెద్దపల్లిలో 31 మందికి, యాదగిరిగుట్టలో 10 మందికి ఫైన్‌ 

సాక్షి నెట్‌వర్క్‌: పాఠశాలల్లో కరోనా కలకలం రేపు తోంది. గత కొన్ని రోజులుగా వైరస్‌ బారిన పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య పెరుగు తోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో కలిపి 46 మంది విద్యార్థులు, నలుగురు ఉపాధ్యాయులు, ఓ వంట మనిషికి వైరస్‌ సోకినట్టు వెల్లడైంది. 

లక్షణాలు ఉన్న వాళ్లకు టెస్టులు చేయగా..
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న 10 మంది విద్యార్థులు జలుబు, తుమ్ములతో బాధపడుతుండగా శుక్రవా రం కరోనా పరీక్షలు చేశారు. అందరికీ వైరస్‌ సోకిం దని తేలింది. జిల్లాలోని మల్యాల మండలంలోని ఓ గురుకుల పాఠశాలలో 9 మంది విద్యార్థినులకు కరోనా సోకింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మం డలం ఇంద్రేశంలోని మహత్మా జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో బుధవారం ముగ్గురు, గురువారం 25 మంది విద్యార్థినులకు కరోనా సోకగా శుక్రవారం మరో 19 మందికి వైరస్‌ సోకినట్టు వెల్లడైంది.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌.ఎస్‌ మండల కేంద్రంలోని మోడల్‌ స్కూల్‌లో ఇద్దరు ఇంటర్‌ విద్యార్థినులు, ఓ వంట మనిషికి కరోనా సోకింది. హనుమకొండ జిల్లా దామెర మం డలం వెంకటాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, ఓ ఉపాధ్యాయుడికి.. శాయం పేట మండలం పెద్దకోడెపాక రెవెన్యూ శివారులోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో ఓ ఉపాధ్యాయురాలికి పాజిటివ్‌గా తేలింది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కోటగల్లి ప్రభుత్వ బీసీ మెట్రిక్‌ హాస్టల్‌లో ఓ టీచర్‌కు, ఓ విద్యార్థికి పాజిటివ్‌ వచ్చింది. వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ పట్టణ శివారులోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.

మాస్కు వేసుకోని వారికి జరిమానా
కరోనా వేరియెంట్‌ ఒమిక్రాన్‌ భయపెడుతుండటంతో ప్రభుత్వం మరోసారి కఠిన నిబంధనలు అమలు చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ప్రతి ఒక్కరికీ మాస్కు తప్పనిసరి చేసింది. పెద్దపల్లిలో మాస్కు లేకుండా బయట తిరుగుతున్న 31 మందికి, యాద గిరిగుట్ట పట్టణంలో 10 మందికి రూ. వెయ్యి చొప్పున పోలీసులు జరిమానా విధించారు. కౌన్సిలింగ్‌ ఇచ్చారు.  
 

మరిన్ని వార్తలు