వణికిస్తున్న చలి.. మరోవైపు ఒమిక్రాన్‌.. లైట్‌ తీసుకోవద్దు ప్లీజ్‌!

3 Dec, 2021 16:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘డెల్టా’ వేరియంట్‌తో పది నెలలుగా కంటిమీద కునుకు లేకుండా గడిపిన సిటిజన్లు.. తాజాగా దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌తో మళ్లీ వణికిపోతున్నారు. ఎప్పుడూ ఎటు నుంచి ఏ రూపంలో వచ్చి పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సోమవారం సంగారెడ్డి గురుకులంలోని 42 మంది విద్యార్థులకు కోవిడ్‌ నిర్ధారణ కావడంతో నగరంతో పాటు శివారు జిల్లాల్లోని వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ 18 ఏళ్లలోపు వారికి టీకాలు అందుబాటులోకి రాకపోవడం, కాలేజీలు, స్కూళ్లు, హాస్టళ్లు పూర్తిస్థాయిలో పని చేస్తుండటం, భౌతిక దూరం పాటించకపోవడం, 40 నుంచి 60 మంది విద్యార్థులను ఒకే చోట కూర్చోబెడుతుండటంతో తల్లిదండ్రుల్లో గుబులు పుట్టిస్తోంది. 
చదవండి: ‘ఒమిక్రాన్‌’ వేరియెంట్‌ కథాకమామిషూ

ఊపిరి పీల్చుకునే లోపే.. 
సెకండ్‌వేవ్‌ తీవ్రతకు అనేక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అనేక మంది కుటుంబ పెద్దదిక్కును కోల్పోయారు. ఇప్పటి వరకు గ్రేటర్‌ జిల్లాల్లో 1,33,83,065 మంది కోవిడ్‌ టీకా తీసుకోగా, వీరిలో 53,47,634 మంది మాత్రమే రెండు డోసులు పూర్తి చేసుకున్నారు. మరో 80,35,431 మొదటి డోసు టీకా తీసుకుని రెండో డోసు కోసం ఎదురు చూస్తున్నారు. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జులై మాసాల్లో నగరంలో రోజుకు సగటున వెయ్యికిపైగా కేసులు నమోదు కాగా, కోవిడ్‌ టీకాల పంపిణీతో ఆగస్టు నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం వందలోపే నమోదవుతోంది. 
చదవండి: ఒమిక్రాన్‌ ‘తీవ్రత’పై స్పష్టత లేదు

కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో వైరస్‌ పీడ ఇక పూర్తిగా తొలగిపోయినట్లేనని సిటిజన్లు భావించి మాస్క్‌లను తీసేసి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈలోపే ‘బి.1.1.529’ రూపంలో మళ్లీ మరో వేరియంట్‌ వెలుగు చూడటం ఇది ఇప్పటివరకు ఉన్న డెల్టా కంటే మరింత ప్రమాదమని వైద్యులు హెచ్చరికలు జారీ చేయడంతో మళ్లీ ఆందోళన మొదలైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల నేపథ్యంలో ప్ర భుత్వం అప్రమత్తమైంది. 12 ఆఫ్రికా దేశాల నుంచి నగరానికి వస్తున్న ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. విమానం దిగిన తర్వాత 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.   

డెల్టా కంటే వేగంగా..    
ప్రస్తుతం దక్షిణాప్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ డెల్టా కంటే ప్రమాదకరమైంది. వేగంగా విస్తరిస్తుంది. ప్రస్తుతం మన ఒంట్లో ఉన్న యాంటిబాడీస్‌ ఈ వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొంటాయా? లేదా అనేది కూడా ఇంకా తేలలేదు. ఇందుకు మరో రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం గాంధీ కోవిడ్‌ సెంటర్‌లో 55 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 35 కోవిడ్‌ బాధితులు కాగా, మరో 20 బ్లాక్‌ ఫంగస్‌తో బాధపడుతున్న వారు ఉన్నారు.  
– డాక్టర్‌ రాజారావు, సూపరింటెండెంట్, గాంధీ ఆస్పత్రి  

వైరస్‌ను లైట్‌గా తీసుకోవద్దు  
ప్రస్తుతం కేసుల సంఖ్య మాత్రమే తగ్గింది. వైరస్‌ ఇంకా పోలేదు. కానీ చాలా మంది వైరస్‌ను తేలికగా తీసుకుంటున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్నామనే ధీమాతో మాస్క్‌లు లేకుండా తిరుగుతున్నారు. శుభకార్యాలు, పూజల పేరుతో పెద్ద సంఖ్యలో ఒక చోటికి చేరుతున్నారు. భౌతికదూరం పాటించడం లేదు. కనీసం చేతులను శానిటైజ్‌ చేయడం లేదు. ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యాన్నే చెల్లించుకోవాల్సి వస్తుంది. విధిగా ప్రతి ఒక్కరూ వాక్సిన్‌ వేసుకోవాలి. 
  – డాక్టర్‌ స్వరాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌ఓ, రంగారెడ్డి 

టీకాలపై ప్రచారం.. 
నగరంలోని కొన్ని వర్గాల ప్రజల్లో కోవిడ్‌ టీకాలపై ఇప్పటికీ పలు అపోహలు ఉన్నాయి. మత పెద్దలు, పార్టీ అధినేతలతో ప్రచారం చేయిస్తున్నాం. టీకాలపై వారికి అవగాహన కల్పించి, అపోహలను తొలగిస్తున్నాం. వారంతా టీకాలు వేయించుకునేలా ప్రోత్సహిస్తున్నాం. జిల్లాలో టీకాల కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేస్తున్నాం.   
 – డాక్టర్‌ వెంకటి, డీఎంహెచ్‌ఓ, హైదరాబాద్‌ 

ఉపాధ్యాయులను అప్రమత్తం చేశాం  
ఇటీవల గురుకులాల్లో కోవిడ్‌ కేసులు వెలుగు చూడటంతో వెంటనే అప్రమత్తమయ్యాం. ప్రీమెట్రిక్, పోస్ట్‌ మెట్రిక్‌ హాస్టళ్లు సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులను అప్రమత్తం చేశాం. ఇంటర్‌వెల్, మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులు విధిగా చేతులు శుభ్రం చేసుకునేలా చూస్తున్నాం. అన్ని పాఠశాలలల్లోనూ మాస్క్‌లు తప్పనిసరి చేశాం. విద్యార్థులు భౌతికదూరం పాటించే విధంగా చూసుకోవాల్సిందిగా ఆయా యాజమాన్యాలకు సూచించాం.  
– సుశీందర్‌రావు, డీఈఓ, రంగారెడ్డి  

ట్రేటర్‌ జిల్లాల్లో కోవిడ్‌ టీకాలు ఇలా.. 

జిల్లా మొత్తం  ఫస్ట్‌ డోసు  సెకండ్‌ డోసు
హైదరాబాద్‌  55,38,975 33,01,862 22,37,113
మేడ్చల్‌ 37,94,677  22,52,390 15,42,287 
రంగారెడ్డి    40,49,413 24,81,179 15,68,234 

మరిన్ని వార్తలు